Monday, May 3, 2021

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది

రంగంలోకి వైద్యవిద్యార్థులు
  • కరోనా విధుల అప్పగింతకు కేంద్రం నిర్ణయం
  • 100 రోజులు డ్యూటీ చేస్తే ప్రభుత్వోద్యోగాల్లో ప్రాధాన్యం
  • కొవిడ్‌ సర్వీస్‌ సమ్మాన్‌ పేరిట అవార్డులు
  • నీట్‌ పీజీ నాలుగు నెలలు వాయిదా
  • వైద్యులపై భారం తగ్గించేందుకు తాజా నిర్ణయం

న్యూఢిల్లీ, మే 3: కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ వైద్యులు, హెల్త్‌కేర్‌ వర్కర్లపై భారం పడకుండా, వైద్య సిబ్బందికి కొరత ఏర్పడకుండా కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కొవిడ్‌ విధుల్లో నియమించడానికి ప్రధాని మోదీ అనుమతి తెలిపారు. ఇందుకోసం నీట్‌ పీజీ పరీక్షను కనీసం నాలుగు నెలల పాటు వాయిదా వేశారు. కరోనాను కట్టడి చేసేందుకు అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలన్న ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (పీఎంవో) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నీట్‌ పీజీ పరీక్షను ఆగస్టు 31 కంటే ముందు నిర్వహించరు’ అని అందులో స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రత్యేక శిక్షణ అనంతరం వారి బోధకుల సమక్షంలో టెలీ కన్సల్టేషన్‌, కొవిడ్‌ లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారికి చికిత్స అందించవచ్చని పీఎంవో పేర్కొన్నది. బీఎస్‌సీ/జీఎన్‌ఎం నర్సింగ్‌లో ఉత్తీర్ణులైనవారు సీనియర్‌ వైద్యుల సమక్షంలో పూర్తి స్థాయిలో కొవిడ్‌ నిర్వహించవచ్చని తెలిపింది. 100 రోజుల పాటు కొవిడ్‌ విధులు నిర్వహించిన విద్యార్థులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. అంతేకాకుండా వారికి కొవిడ్‌ నేషనల్‌ సర్వీస్‌ సమ్మాన్‌ పేరిట అవార్డులు ఇవ్వనున్నట్టు పీఎంవో వెల్లడించింది.

కాంట్రాక్టు పద్ధతిలో నియామకం

విద్యార్థుల సేవలను వినియోగించుకోవడంలో భాగంగా వైద్య విభాగాల్లో ఖాళీలను 45 రోజుల్లోగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు పీఎంవో తెలిపింది. ఆరోగ్యం రాష్ర్టాల జాబితాలో అంశం కాబట్టి ఈ నిర్ణయం అమల్లో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నది.

No comments:

Post a Comment