Thursday, May 13, 2021

అన్నపూర్ణే..సదా సేవే!

నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

అడగంది అమ్మయినా పెట్టదు. కానీ, ఈ అన్నపూర్ణలు మాత్రం అక్షయపాత్రలు ధరించి, అడగకుండానే కొవిడ్‌ బాధితుల ఆకలి తీరుస్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతిక్షణం పరితపిస్తున్నారు. ఎల్లలు దాటొచ్చిన కల్లోలాన్ని కట్టడి చేయడానికి తమ వంతుగా పోరాడుతున్నారు. వంటింటి నుంచే కరోనా రక్కసిని దునుమాడే పోషకాస్ర్తాలను సంధిస్తున్నారు. కకావికలమవుతున్న కుటుంబాలకు రక్షణ కవచాలను అందిస్తున్నారు.

అన్నపూర్ణే..సదా సేవే!

హైదరాబాద్‌కు చెందిన నిహారిక సంకల్పం అమ్మ ప్రేమంత. బంగారం బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకొని మరీ ఆపన్నులకు అండగా నిలుస్తున్నది. ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన నిహారికకు సామాజిక స్పృహ ఎక్కువ. ఆమె భర్త సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎగువ మధ్యతరగతి కుటుంబం. ఎవరైనా నిజాయితీగా సాయం అడిగితే నిహారిక ఎంతమాత్రం వెనుకడుగు వేయదు. గతేడాది కొవిడ్‌ విలయంలోనూ ఎందరికో అండగా నిలిచింది. స్నేహితుల సాయంతో దాదాపు 3,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. హైదరాబాద్‌లో వరదల సమయంలోనూ నేనున్నానని ముందుకొచ్చింది. సెకండ్‌ వేవ్‌ కాలంలో మళ్లీ ఆపన్నహస్తం అందిస్తున్నదామె. అయినవారే భయం కొద్దీ కొవిడ్‌ బాధితులకు దూరంగా ఉంటున్న వేళ తను అన్నపూర్ణగా మారి వారి ఆకలి తీరుస్తున్నది. మధ్యాహ్నం, రాత్రి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న 100 మంది కొవిడ్‌ పేషంట్లకు భోజనం వడ్డిస్తున్నది. పనీర్‌, మష్రూమ్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూరలు, పప్పు, చారు, సలాడ్‌, రైతా ఇలా పోషకాలన్నీ ఏర్చి కూర్చి అందిస్తున్నది. నిహారిక తమ్ముడే స్వయంగా వాటిని రోగుల ఇంటికి డెలివరీ చేస్తుండటం విశేషం. బెడ్స్‌, ప్లాస్మా, మందుల అవసరం ఉన్నవాళ్లకు తనకు తోచిన సాయం చేస్తున్నది. ఈ భోజన క్రతువును మొత్తం తన ఖర్చుతోనే నిర్వహిస్తున్నది. 97018 21089 నంబర్‌కు ఫోన్‌ చేసి లొకేషన్‌ షేర్‌ చేస్తే ఫుడ్‌ డెలివరీ చేస్తామనీ, కొవిడ్‌ తగ్గుముఖం పట్టే వరకూ ఈ సేవలు కొనసాగుతాయనీ చెబుతున్నది నిహారిక.

దేశానికి అన్నపాత్ర
ఢిల్లీకి చెందిన సాక్షి అగర్వాల్‌ ఆలోచనలోంచి పుట్టింది కొవిఫీడ్‌ఇండియా.కామ్‌ (covifeedindia.com). దేశవ్యాప్తంగా వలంటీర్లను ఏకతాటిపైకి తెస్తున్న వేదిక ఇది. కరోనా బాధితులకు, హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నవారికి నాణ్యమైన భోజనం అందిస్తున్న అమృత హస్తమిది. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు కొవిఫీడ్‌ ఇండియా ప్రతినిధులు ఉన్నారు. అందరూ మహిళలే. అందరి లక్ష్యం ఒక్కటే, కొవిడ్‌ బాధితులు పస్తులుండకూడదు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్న వారికి ఎంతోకొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ సేవను ప్రారంభించారు సాక్షి అగర్వాల్‌. సాయం చేసే మనసుంటే చాలు, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వలంటీర్లుగా పేరు నమోదు చేసుకోవచ్చు. శక్తిమేరకు ఒకరికో, ఇద్దరికో, నలుగురికో భోజనం సరఫరా చేయవచ్చు. సాక్షి పిలుపుతో దేశవ్యాప్తంగా వందలమంది మహిళలు వలంటీర్లుగా చేరారు. తాము వండుకునే పదార్థాలనే నలుగురికీ చేరవేస్తున్నారు. అన్నార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేస్తే చాలు, తమ చుట్టుపక్కల ఉన్న వలంటీర్ల వివరాలు కనిపిస్తాయి. క్లిక్‌ చేయగానే టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ సమయానికి ఇంటిముందుకు వచ్చేస్తాయి. అందులో, ఉచితంగా అందించేవారూ ఉన్నారు. నామమాత్రం రుసుము తీసుకొని భోజనాలు పంపించేవాళ్లూ ఉన్నారు. ‘శక్తి ఉన్నవాళ్లు రుసుము చెల్లిస్తే ఆ మొత్తంతో మరో నలుగురికి సాయం చేయవచ్చు’ అంటారు సాక్షి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాల్లో కొవిఫీడ్‌ ఇండియా సేవలు అందుబాటులో ఉన్నాయి.

అందరి కోసం..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ సమీపంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ పేరు మీనాక్షీస్‌ స్కైలాంజ్‌. అక్కడి వారంతా సంపన్నులే. వందల్లో ఫ్లాట్లు, వేలల్లో జనాలు. ఓ గ్రామమంత ఉంటుంది. ఆ ఫ్లాట్లలోకి కరోనా వైరస్‌ జొరబడితే వాళ్ల పాట్లు చెప్పనలవి కాదు. కానీ, కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు అక్కడి పౌరులు. ఇందుకోసం మహిళలంతా నడుం బిగించారు. ఓ మహాక్రతువుకు నాంది పలికారు. దాదాపు 60 మంది మాతృమూర్తులు ఇందులో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. తమ గేటెడ్‌ కమ్యూనిటీనే ఓ కుటుంబంగా భావించి వైరస్‌ సోకిన వారికి అండగా ఉండాలనుకున్నారు. ‘మన వారికి మనం చేయూతనివ్వాలి’ అని సంఝా చులా చెప్పిన ఆలోచనను అపార్ట్‌మెంట్లలోని అమ్మలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. హోమ్‌ క్వారంటైన్‌లో కొవిడ్‌ బాధితులకు సకాలంలో రుచికరమైన అల్పాహారం, భోజనం అందివ్వాలనుకున్నారు. వాళ్లింట్లో చేసిందేదో పెట్టేసి చేతులు దులుపుకోలేదు. బాధిత కుటుంబానికి ఫోన్‌ చేసి, వారికి ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకుంటున్నారు. కారం, మసాలాలు ఏ స్థాయిలో ఉండాలో చెప్పమంటున్నారు. వాటిని శుచిగా ప్యాక్‌ చేసి, గుమ్మం ముందుంచి వస్తున్నారు. కూరలు ఎలా ఉన్నాయో ఆరా తీసి, ‘రాత్రికి ఏం పంపమంటారో మొహమాటం లేకుండా ఆర్డర్‌ ఇవ్వండి’ అని ప్రేమగా అడుతున్నారు. కన్నతల్లిలా ఆప్యాయతలు పంచుతూ కడుపునిండా తిండి పెడుతూ, గుండెనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న ఈ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుదాం.

అన్నపూర్ణే..సదా సేవే!

ఫోన్‌ చేస్తే చాలు
సేవాపథంలో స్త్రీలది ఎప్పుడూ ముందడుగే. ఆ కోవకే చెందుతారు ప్రపూర్ణ. భర్త రామకిషోర్‌రెడ్డి సహకారంతో దాదాపు పదేండ్లుగా ‘ఆశ్రి’ సొసైటీని నిర్వహిస్తున్నారామె. ఇప్పుడు అదే సేవాసంస్థ తరఫున కొవిడ్‌ బాధిత కుటుంబాల ఆకలి తీర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజూ సుమారు 150 కుటుంబాలకు నాణ్యమైన, రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. భోజనాలను వలంటీర్ల సాయంతో బాధితుల గుమ్మం దగ్గరకు చేరుస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రపూర్ణ వందలమందికి సాయం చేశారు. నిరుపేదలకు, వలస కార్మికులకు పోలీసుల పర్యవేక్షణలో అన్నదానం నిర్వహించారు. ‘నేను-నా కుటుంబం అనుకుంటే ఒంటరిగా మిగిలి పోతాం. నేను-నా సమాజం అనుకున్నాను. మా అమ్మానాన్న నేర్పించిన సంస్కారం ఇది. అందుకే, చిన్నప్పటి నుంచి సేవాభావం ఉండేది. పెండ్లయిన తర్వాతకూడా మా ఆయన నాకు అండగా నిలిచారు. కరోనా వేళ బాధితులకు అండగా నిలువాలనుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లోని నిరుపేద కొవిడ్‌ బాధితులు 92934 14444 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయవచ్చు. వారికి భోజనం పంపడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు ‘ఆశ్రి’ సొసైటీ నిర్వాహకురాలు ప్రపూర్ణ.

1 comment: