Thursday, February 9, 2023

ఎన్టీఆర్ చికిత్స కోసం.... అమెరికా వెళ్తే

*ఎన్టీఆర్ చికిత్స కోసం.... అమెరికా వెళ్తే*

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మోదీ గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాలను పడగొట్టారని ఆయన విమర్శించారు. *తెలుగు దేశం పార్టీ అధినేత*
*నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ పడగొట్టారని మోదీ గుర్తు చేశారు*

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వంటి ప్రముఖుల ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ పడగొట్టిందని ప్రధాని గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ బురద జల్లితే, కమలం అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు. కొందరి భాష, ప్రవర్తన భారత దేశానికి నిరాశ కలిగిస్తున్నాయన్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాల వద్ద బురద ఉందని, తన వద్ద గులాల్ ఉందని, ఎవరి దగ్గర ఏది ఉంటే, దానినే వారు విసురుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తాము కృషి చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఖర్గే గారు చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని దుయ్యబట్టారు. గడచిన మూడు, నాలుగేళ్ళలో దాదాపు 11 కోట్ల ఇళ్లకు కొళాయి నీటి కనెక్షన్లు అందినట్లు తెలిపారు.

సామాన్యులను సాధికారులను చేయడం కోసం జన్ ధన్ ఖాతా ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో సుమారు 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.

ప్రధానమంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ బుధవారం ముగిసింది. ఈ చర్చకు మోదీ గురువారం సమాధానం చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

అసెంబ్లీలో ధరణిపై ..... గరం గరం

*అసెంబ్లీలో ధరణిపై ..... గరం గరం*

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో 'ధరణి' పై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు  ప్రస్తావించారు. చాలా మంది రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకొని అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రి కేటీఆర్‌ (KTR), ప్రశాంత్‌ రెడ్డి.. శ్రీధర్‌బాబు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఎక్కడో ఓ చోట జరిగిన ఘటనను మొత్తం ధరణికి ఆపాదించొద్దని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. ఔషధ నగరికి రైతుల నుంచి తక్కువ ధరలో సేకరించిన భూములను కార్పోరేట్లకు కట్టబెడుతున్నారని శ్రీధర్‌బాబు ప్రస్తావించడం మరోసారి గందరగోళానికి దారితీసింది. ఎమ్మెల్యే తన మాటలను ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.ధరణి అమలులోకి వచ్చిన తర్వాత చాలా మందికి హక్కుపత్రం లేక ఇబ్బందిపడ్డారు. మీసేవ ద్వారా తీసుకున్న అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ రోజు మ్యూటేషన్‌, పార్టిషన్‌, పౌథీ, పేర్ల తప్పులు, డబుల్‌ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర, ప్రభుత్వ భూముల గుర్తించి రికార్డులను నవీకరించి కొత్త పాస్‌బుక్‌లను మంజూరు చేశామన్న ప్రభుత్వపు మాటల్లో వాస్తవం లేదు'' అని శ్రీధర్‌బాబు అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ''శ్రీధర్‌బాబు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మొత్తం వ్యవస్థంతా కకావికలం అయిపోయిందన్నట్లుగా ఉంది. అంతా బాగా ఉంటే ఎవరూ మాట్లాడరు. ఎక్కడో ఓ చోట లోపాలుంటే దాన్ని బూతద్దంలో పెట్టి.. రాష్ట్రం అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని.. అసలు ఏమీ జరగడంలేదని చెప్పడం సరైంది కాదు'' అని అన్నారు. శ్రీధర్‌బాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఈసందర్భంగా కేటీఆర్‌ మండిపడ్డారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Tuesday, February 7, 2023

ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది హక్కుల సంఘాలను & మేధావులను

https://youtu.be/uCWjY9vBn4U                                                            
 **ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది హక్కుల సంఘాలను & మేధావులను*

*#తెలంగాణ లో #ప్రజలపక్షాన #రాజ్యాంగం కల్పించిన న్యాయమైన #హక్కులకు అనుగుణంగా #అవినీతి మీద పోరాటం చేస్తున్న, ప్రశ్నిస్తున్న గొంతులను ఈ తెలంగాణ ప్రభుత్వం #అక్రమఅరెస్టులు చేయడం రాజ్యాంగంను / ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే కదా !!*

*ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను న్యాయంగా ప్రశ్నించేవారు ప్రజలు అయినా, జర్నలిస్ట్ లు అయినా,సోషల్ మీడియా అయినా,రాజకీయ పార్టీ నాయకులు అయినా అందరికి హక్కులు కల్పించింది కదా మన రాజ్యాంగం.మరి తెలంగాణ ప్రభుత్వం న్యాయంగా ప్రశ్నించేవారిని భయబ్రాంతులకు గురి చేస్తుంది ఇదెక్కడి న్యాయం!!*

*#తెలంగాణ లో నిత్యం ఏదో ఒకచోట ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్నారు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మరి శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వారిమీద #అక్రమంగా కేసులు పెట్టడం ఏమిటి ??*

*ఇలాంటి తెలంగాణ కోసమా ఎందరో అనరులైనారు ??. అసలు అమరవీరుల ఆశయాలకోసం ఈ ప్రభుత్వం ఏనాడైనా ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన చేసిందా  ?? అమరవీరుల కుటుంబాలు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో వున్నాయో తెలుసా ?? అమరవీరుల త్యాగాలమీద వేల కోట్లు ఎవరు దోచుకున్నారు / దోచుకుంటున్నారు అంటే ఒకటే కుటుంబం వారి వద్ద బానిసలుగా వున్న ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు కాదా ??*

*👆వీటిని ప్రశ్నించే వారిమీద అక్రమకేసులు. న్యాయస్థానాలు అంటే గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి. ఉదాహరణకు సోమేశ్ కుమార్ IAS అధికారి మీద ఎన్ని కోర్ట్ దిక్కారణ కేసులు ఉన్నాయో అందరికి తెలిసిందే.*

*NOTE : #తెలంగాణ లో ప్రజల హక్కులను ఎలా కాలరాస్తుంది ఈ ప్రభుత్వం అనడానికి బల్మూరు వెంకట్  వాస్తవ విశ్లేషణ చాలు.వెంకట్ ఒక VIP మరి ఇతనికే ఇలా జరిగింది అంటే సామాన్యుల పరిస్థితి ఏంది ??*

*Bplkm🪶*
*Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

పెట్రోలంటూ ఆరెంజ్ జ్యుస్ పోసుకొని.... కలెక్టరేట్ లో యువకుని హల్ చల్

*పెట్రోలంటూ ఆరెంజ్ జ్యుస్ పోసుకొని.... కలెక్టరేట్ లో యువకుని హల్ చల్*

*యువకుడితో మాట్లాడుతున్న కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌*

హనుమకొండ కలెక్టరేట్‌, : పెట్రోలంటూ ఆరెంజ్‌ జ్యూస్‌ ఒంటిపై పోసుకొని ఓ యువకుడు అధికారులను బెదిరించాడు.ఈ ఘటన సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి జరిగింది. హనుమకొండ జిల్లా భీమధేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అజయ్‌రెడ్డి వచ్చాడు.

తన భూ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని, పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ సీసాలోని ఆరెంజ్‌ రసాన్ని ఒంటిపై పోసుకున్నాడు. సెక్యురిటీ సిబ్బంది సదరు యువకుడిని అడ్డుకున్నారు. పెట్రోల్‌ వాసన రాకపోడంతో సీసాను పరిశీలించగా.. అందులో ఆరెంజు జ్యూస్‌ ఉందని గుర్తించారు. కలెక్టరేట్‌ ఏవో కిరణ్‌ప్రకాశ్‌ వచ్చి యువకుడితో మాట్లాడగా.. కాస్తులో ఉన్న భూమికి పట్టా లేదని, స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పాడు. భూసమస్యకు కలెక్టర్‌ పరిష్కారమార్గం చూపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, February 5, 2023

హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు

*హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు*

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, భారాస ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్‌ జనరల్‌ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా తీర్పు వెలువరించింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

*రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌*

*రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు*

*మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు*

*వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు*

*నీటి పారుదల రూ. 26,885 కోట్లు*

*విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు*

*ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు*

*ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు*

*దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు*

*ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు*

*ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు*

*బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు*

*మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు*

*మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు*

*అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు*

*విద్య కోసం రూ.19, 093 కోట్లు*

*వైద్యం కోసం రూ.12,161 కోట్లు*

*సుజీవన్ వావిలాల*🖋️ 

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..... కన్నుమూత....!

*పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..... కన్నుమూత....!*

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్  కన్నుమూసినట్లు పాకిస్థాన్ మీడియా ఆదివారం తెలిపిందిఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని, దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది.

ముషారఫ్ (79) దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. రెండు వారాల క్రితం ఆయన ఈ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలులో చదివారు. ఆ తర్వాత లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చదివారు. 1961లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు.

జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుంచి 2007 వరకు పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ఆయన 2001 జూన్ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్థాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు.

1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధం సమయంలో ఆయన సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. 1980వ దశకంలో ఆయన ఓ ఆర్టిలరీ బ్రిగేడ్‌కు చీఫ్‌గా ఎదిగారు. ఆఫ్ఘనిస్థాన్ సివిల్ వార్‌లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతును ప్రోత్సహించారు. 1998లో అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆయనకు ఫోర్ స్టార్ జనరల్ హోదా ఇచ్చారు. దీంతో ఆయన పాకిస్థాన్ రక్షణ దళాలకు అధిపతి అయ్యారు. 1999లో కార్గిల్ యుద్ధం ఆయన హయాంలోనే జరిగింది. ఆయన నేతృత్వంలోనే కార్గిల్‌లోకి పాకిస్థాన్ చొరబడింది. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. షరీఫ్, ముషారఫ్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ముషారఫ్‌ను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించేందుకు షరీఫ్ విఫలయత్నం చేశారు. దీంతో ముషారఫ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసింది. 1999లో షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. 2001లో పాకిస్థాన్ అధ్యక్ష పదవిని ముషారఫ్ చేపట్టారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️