Thursday, February 9, 2023

ఎన్టీఆర్ చికిత్స కోసం.... అమెరికా వెళ్తే

*ఎన్టీఆర్ చికిత్స కోసం.... అమెరికా వెళ్తే*

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు.కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మోదీ గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాలను పడగొట్టారని ఆయన విమర్శించారు. *తెలుగు దేశం పార్టీ అధినేత*
*నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ పడగొట్టారని మోదీ గుర్తు చేశారు*

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వంటి ప్రముఖుల ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ పడగొట్టిందని ప్రధాని గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ బురద జల్లితే, కమలం అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు. కొందరి భాష, ప్రవర్తన భారత దేశానికి నిరాశ కలిగిస్తున్నాయన్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాల వద్ద బురద ఉందని, తన వద్ద గులాల్ ఉందని, ఎవరి దగ్గర ఏది ఉంటే, దానినే వారు విసురుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం తాము కృషి చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఖర్గే గారు చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని దుయ్యబట్టారు. గడచిన మూడు, నాలుగేళ్ళలో దాదాపు 11 కోట్ల ఇళ్లకు కొళాయి నీటి కనెక్షన్లు అందినట్లు తెలిపారు.

సామాన్యులను సాధికారులను చేయడం కోసం జన్ ధన్ ఖాతా ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో సుమారు 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.

ప్రధానమంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ బుధవారం ముగిసింది. ఈ చర్చకు మోదీ గురువారం సమాధానం చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment