*పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..... కన్నుమూత....!*
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లు పాకిస్థాన్ మీడియా ఆదివారం తెలిపిందిఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని, దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది.
ముషారఫ్ (79) దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. రెండు వారాల క్రితం ఆయన ఈ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలులో చదివారు. ఆ తర్వాత లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చదివారు. 1961లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు.
జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుంచి 2007 వరకు పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ఆయన 2001 జూన్ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్థాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు.
1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధం సమయంలో ఆయన సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. 1980వ దశకంలో ఆయన ఓ ఆర్టిలరీ బ్రిగేడ్‌కు చీఫ్‌గా ఎదిగారు. ఆఫ్ఘనిస్థాన్ సివిల్ వార్‌లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతును ప్రోత్సహించారు. 1998లో అప్పటి పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆయనకు ఫోర్ స్టార్ జనరల్ హోదా ఇచ్చారు. దీంతో ఆయన పాకిస్థాన్ రక్షణ దళాలకు అధిపతి అయ్యారు. 1999లో కార్గిల్ యుద్ధం ఆయన హయాంలోనే జరిగింది. ఆయన నేతృత్వంలోనే కార్గిల్‌లోకి పాకిస్థాన్ చొరబడింది. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. షరీఫ్, ముషారఫ్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ముషారఫ్‌ను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించేందుకు షరీఫ్ విఫలయత్నం చేశారు. దీంతో ముషారఫ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసింది. 1999లో షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. 2001లో పాకిస్థాన్ అధ్యక్ష పదవిని ముషారఫ్ చేపట్టారు. షరీఫ్‌ను గృహ నిర్బంధం చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment