Thursday, February 9, 2023

అసెంబ్లీలో ధరణిపై ..... గరం గరం

*అసెంబ్లీలో ధరణిపై ..... గరం గరం*

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో 'ధరణి' పై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు  ప్రస్తావించారు. చాలా మంది రైతులు మీసేవలో దరఖాస్తు చేసుకొని అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రి కేటీఆర్‌ (KTR), ప్రశాంత్‌ రెడ్డి.. శ్రీధర్‌బాబు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఎక్కడో ఓ చోట జరిగిన ఘటనను మొత్తం ధరణికి ఆపాదించొద్దని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. ఔషధ నగరికి రైతుల నుంచి తక్కువ ధరలో సేకరించిన భూములను కార్పోరేట్లకు కట్టబెడుతున్నారని శ్రీధర్‌బాబు ప్రస్తావించడం మరోసారి గందరగోళానికి దారితీసింది. ఎమ్మెల్యే తన మాటలను ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.ధరణి అమలులోకి వచ్చిన తర్వాత చాలా మందికి హక్కుపత్రం లేక ఇబ్బందిపడ్డారు. మీసేవ ద్వారా తీసుకున్న అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ రోజు మ్యూటేషన్‌, పార్టిషన్‌, పౌథీ, పేర్ల తప్పులు, డబుల్‌ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర, ప్రభుత్వ భూముల గుర్తించి రికార్డులను నవీకరించి కొత్త పాస్‌బుక్‌లను మంజూరు చేశామన్న ప్రభుత్వపు మాటల్లో వాస్తవం లేదు'' అని శ్రీధర్‌బాబు అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. ''శ్రీధర్‌బాబు చెబుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే మొత్తం వ్యవస్థంతా కకావికలం అయిపోయిందన్నట్లుగా ఉంది. అంతా బాగా ఉంటే ఎవరూ మాట్లాడరు. ఎక్కడో ఓ చోట లోపాలుంటే దాన్ని బూతద్దంలో పెట్టి.. రాష్ట్రం అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని.. అసలు ఏమీ జరగడంలేదని చెప్పడం సరైంది కాదు'' అని అన్నారు. శ్రీధర్‌బాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఈసందర్భంగా కేటీఆర్‌ మండిపడ్డారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment