Thursday, December 15, 2022

యువరాజు పట్టాభిషేకం కోసంరాజ శ్యామల యజ్ఞం

*నాడు పోరాటాలకు నిలయమైన తెలంగాణ...*
*నేడు యాగాలకు, భోగాలకు నిలయమైంది*

భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు తెలంగాణ అంటే.. భూమి కోసం, భుక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నడిచిన..
సాయుధ రైతాంగ పోరాటం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తెలంగాణా అంటే...
ఇడ్లి సాంబార్ గోబ్యాక్.. నాన్ ముల్కీ ఘర్ వాపస్..

దేశ స్వాతంత్య్రం తర్వాత అరవై తొమ్మిదిలో, తెలంగాణ అంటే... 
ప్రాణాలకు తెగించి యువతరం పోరాడిన ప్రత్యేక తెలంగాణా తొలి దశ ఉద్యమం. మూడువందల ఆరవై మంది బలిదానం.

ఎనభై ల్లో తెలంగాణ అంటే... 
దొరతనాలను గడగడలాడించి, దొరగడిలను కూల్చి.. భూస్వామ్యానికి సవాల్ విసిరిన సాయుధ విప్లవ ప్రభంజనం.

గత దశాబ్దంలో తెలంగాణ అంటే... 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కై పట్టువదలని ప్రజా ఉద్యమం. మలిదశలో పద్నాలుగు వందల మంది ఆత్మార్పణం.. సంఘమే రణరంగమై..రాష్ట్ర సాధనే ద్యేయంగా నడిచిన ఉద్యమం.

ఈ రోజు తెలంగాణా అంటే..
కుట్రల,కుతంత్రాల, కుటుంబ పాలన కోసం..
కూడబెట్టిన ధనం, యువరాజు పట్టాభిషేకం కోసం
రాజ శ్యామల యజ్ఞం.

రేపటి తెలంగాణ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలన్నదే నేడు సబ్బండ వర్గాల, వర్ణాల ముందున్న ప్రశ్న..
తెలంగాణ అంటేనే పోరాటం...పోరాటం... 
కాళోజీ మాటలు మనకు మర్చిపోతున్నారా..
*ప్రాంతేతరు మోసం చేస్తే ప్రాంతం అవతలి వరకు తరిమి కోడతాం.. *ప్రాంతంలోని వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం*

Courtesy by : Voice Of Village (fb)

నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'

*_'జస్టిస్'కు జస్టిస్.!_*
_★ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్!_
_★ ముందే చెప్పిన వైనం_
_★ నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'_

*_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు అందించిన దమ్మున్న కథనం, 9440000009)_*

*_సెప్టెంబర్ 7, 2019న తెలుగు జర్నలిజంలో దమ్మున్న కథనాన్ని 'ఆదాబ్ హైదరాబాద్' ఆవిష్కరించింది. జస్టిస్ సంజయ్ కుమార్ పై జరిగిన అన్యాయం గురించి మూడు రోజుల పాటు హైకోర్టు న్యాయవాదులు కోర్టున బహిష్కరించారు. సామాన్యుల నుంచి న్యాయమూర్తి వరకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాల్సిన మీడియా గొంతు నాడు మూగబోయింది.  ఒక్క 'ఆదాబ్ హైదరాబాద్' మినహా మిగిలిన మొత్తం మీడియా అస్సలు ఆ సంఘటన జరగనట్లే నటించాయి. రాజకీయుల అక్రమాల గురించి రాయటానికి భయపడే పరిస్థితుల్లో... ఏకంగా న్యాయస్థానం గురించి, న్యాయమూర్తుల గురించి  'న్యాయదేవత సాక్షిగా జస్టిస్ సంజయ్ పై కుట్ర' అంటూ ఓ సంచలన కథనం ప్రముఖంగా ప్రచురించింది. సుప్రీంకోర్టుకు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా అయిదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఇప్పుడు ఆ జస్టిస్ సంజయ్ కుమార్ కు 'న్యాయం' జరిగింది._*

*_అసలేం జరిగింది.?:_*
సుప్రీంకోర్టుకు తెలుగు వ్యక్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా అయిదు గురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృ త్వంలో మంగళవారం సమావేశమైన కొలీజియం.. మణిపుర్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి(సీజే) జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే సంజయ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ అసను ద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ పేర్లను సిఫారసు చేసింది. వీరిలో జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ తెలంగాణకు చెందినవారు.

*_ఇదీ ప్రస్థానం:_*
1963 ఆగస్టు 14న హైదరాబాద్ లో జన్మించారు. నిజాం కళాశా లలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు.

*_న్యాయమూర్తిగా..:_*
2008 ఆగస్టు 8న ఉమ్మడి హైకో ర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబరు 14న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణి పుర్ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి ప్రాతి నిధ్యం లేదు. న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నా.. ఆయన నేరుగా సుప్రీంకోర్టు బార్ నుంచి నియమితులయ్యారు. తెలంగాణ మాతృ హైకోర్టు నుంచి చివరిసారిగా జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన పదవీ అనంతరం తాజాగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ పేరును కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో ఉన్న పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా కొద్దికాలంపాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో 34మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. కొలీజియం సిఫారసు చేసిన అయిదుగురి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కి చేరు తుంది. కాగా, పీవీ సంజయ్ కుమార్ తండ్రి రామచంద్రా రెడ్డిది చిత్తూరు జిల్లా. వృత్తిరీత్యా హైదరాబాద్లో స్థిరప డ్డారు. 1969 నుంచి 1983 వరకూ సుదీర్ఘకాలం అడ్వకేటుగా సేవలందించారు.

బాక్స్:
*ఆనాడు ఏం జరిగింది.?*
(నాటి 'ఆదాబ్ హైదరాబాద్' కథనం యధాతథంగా..)
న్యాయదేవత సాక్షిగా...
జస్టిస్ సంజయ్ పై కుట్ర..!
◆ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
◆ బదిలీ వెనుక ఏం జరిగింది..?
◆ మరోవైపు 'సామాజిక' పంచాయతీ
*_(హిస్టరీలో మిస్టరీ కథనాలు-15)_*
(అనంచిన్ని వెంకటేశ్వరరావు ఆదాబ్ హైదరాబాద్)
*_సాక్షాత్తూ న్యాయదేవత చెంతనే ఓ అన్యాయం జరుగుతోంది. న్యాయస్థానాలలో వాదించాల్సిన న్యాయవాదులు రోడ్లు ఎక్కుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 'అక్కడ ఏం జరుగుతుంది' అంటే అందరికీ తెలుసు. అయితే 'అసలు విషయం' గురించి బహిరంగంగా మాట్లాడాలంటే నిశ్శబ్ద భయం. కానీ.. కానీ.. ఫోర్త్ ఎస్టేట్ లో ఎవరూ మాట్లాడడానికి సాహసించని ఆ అసలు నిశ్శబ్ద విషయాన్ని... 'ఆదాబ్ హైదరాబాద్' సగౌరవంగా.. సగర్వంగా, సవివరంగా నిశ్శబ్దాన్ని పటాపంచలు చేయాలని భావించి ఇస్తున్న 'సంచలన పరిశోధన కథనం' మీకోసం ప్రత్యేకం._*

*అసలేం జరిగింది..:*
తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. విధులను బహిష్కరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లాలోని న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. సంజయ్‌ కుమార్‌ ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

*బహిరంగ రహస్యం - భయంకర నిజం..?:*
జస్టిస్ సంజయ్ కుమార్ ది సాధారణ బదిలీ అయితే ఇంత పెద్ద ఎత్తున న్యాయవాదులు రోడ్లు ఎక్కి పోరాటం చేయరు. గత వారం రోజులుగా తెలంగాణ హైకోర్టుతో సహా జిల్లా న్యాయస్థానాలలో న్యాయపరమైన సేవలు నిలిచిపోయాయి. అందరికీ అన్నీ తెలుసు. ఎక్కడా.. బహిరంగంగా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని ఓ రకమైన తెలియని భయం.

*ఆయనే చీఫ్ జస్టీస్..?:*
జస్టిస్ సంజయ్ కుమార్ తండ్రి అడ్వకేట్ జనరల్ గా సుమారు రెండు దశాబ్దాలు సేవలందించారు. ఆయన వారసత్వం పుణికి పుచ్చుకున్న జస్టిస్ సంజయ్ కుమార్ ఆగస్టు 14, 1963న జన్మించారు.1988లో నిజాం కాలేజీ చదువు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 'లా' పట్టభద్రుడయ్యాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో సుధీర్ఘ కేసులపై విలక్షణమైన, నిక్కచ్చిగా తీర్పులు ఇచ్చారు. హైకోర్టు విభజన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి ఉంటే తప్పకుండా చీఫ్ జస్టీస్ అయ్యేవారు.! కానీ తెలంగాణ ప్రాతానికి చెందిన వాడు కావడంతో తెలంగాణలో ఉండాలని ఆయన భావించారు. ఆ మేరకే కట్టుబడి ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో సీనియర్ జస్టీస్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడున్న సీనియార్టీ ప్రకారం ఆయన చీఫ్ జస్టీస్ తర్వాత స్థానం ఆయనదే. అన్నీ అనుకున్నట్లు కొనసాగితే మరో రెండు, మూడు సంవత్సరాలలో ఆయన తెలంగాణ చీఫ్ జస్టిస్ అయ్యేవారు.

*తెర వెనుక ఏం జరిగింది..?:*
సుధీర్ఘ అనుభవం ఉన్న జస్టిస్ సంజయ్ కుమార్ కు వాస్తవంగా పదోన్నతి ఇచ్చి గౌరవించాలి. కానీ కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ పివి.సంజయ్ కుమార్ ను పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని, కేంద్రాన్ని సిఫారసు చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్ణయించింది. కేంద్రం తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. బదిలీ కారణంగా...జస్టిస్ సంజయ్ కుమార్ పంజాబ్, హర్యానా హైకోర్టు సీనియారిటీ జాబితాలో 12వ స్థానంలో ఉంటారు. అదేమిటో మొదట స్థానంలో ఉండాల్సిన ఆయన 12వ స్థానానికి చేరారు. ఇక్కడే ఏదో మతలబు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

జస్టిస్ సంజయ్ కుమార్ కు మరో 12 ఏళ్ళు ఇంకా కొనసాగుతారు. అంటే తప్పకుండా సుప్రీంకోర్టులో ఆయన కీలకంగా కొనసాగే అవకాశం ఉంది. అంటే ఆయన పదోన్నతులను ఓ పక్కా పథకంతో దెబ్బకొట్టారని తెలుస్తోంది.

*ఇదే(0) నిరసన..:*
జస్టిస్ సంజయ్ కుమార్ బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో జస్టిస్ సంజయ్ కుమార్ ను పంజాబ్, హర్యానా హైకోర్టు  న్యాయమూర్తిగా బదిలీ చేయడాన్ని ఖండిస్తూ అసాధారణ తీర్మానాన్ని ఆమోదించింది. అంతే కాకుండా ఏదైనా హైకోర్టులో  అతన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియాన్ని అసోసియేషన్ కోరింది. అయితే ఆశ్చర్యకరంగా జస్టీస్ సంజయ్ కుమార్ విషయంలో తెరవెనుక  జరిగిన అసలు మతలబు గురించి ఎక్కడా పేర్కొనలేదు. ఎందుకు వెళ్ళలేదనే విషయం లోపలి అంచుల్లోకి 'ఆదాబ్' తొంగిచూడాలని భావించడం లేదు.

*చివరిగా..:*
హిస్టరీలో ఓ న్యాయమూర్తి కోసం రోడ్లపైకి న్యాయవాదులు ఇప్పటిదాకా రాలేదు. అంతేకాదు అందులో ఉన్న అసలు సమస్య గురించి బహిరంగంగా మాట్లాడలేక పోవడం ఓ మిస్టరీ.
----------------------
*హైకోర్టులో 'సమాజిక' ధర్నా..*
ఒకవైపు జస్టీస్ సంజయ్ కుమార్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతుండగా.. మరో వైపు సామాజిక న్యాయం పేరిట ఓ చిరు ఆందోళన జరిగింది. హైకోర్టు జడ్జీల నియమకాలలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ న్యాయవాదులను దామాషా ప్రకారం జడ్జీలుగా నియమించాలని 'బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సీనియర్ న్యాయవాదుల' పేరిట హైకోర్టు బయట ఆందోళన జరిగింది.
----------------------
*అంకితం:*
'హిస్టరీలో మిస్టరీ' 15 వరస కథనాలను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఈ  కథనాలు మహనీయులు, భారతరత్న అబ్దుల్ కలాంకు అంకితం ఇస్తున్నాం.

Tuesday, December 13, 2022

#చట్టాలు అంటే చులకన అయిపొయింది


తెలంగాణ ప్రభుత్వం అడ్డదారిలో ఆదాయాన్ని సంపాదించుకోవడానికి మున్సిపల్ చట్టాలను ఉల్లంగించిన #అక్రమార్కులకు వెసులుబాటు కల్పించడం సిగ్గుచేటు.


Bplkm🪶



Monday, December 12, 2022

కేసీఆర్ వైఖరే.. బెటర్ అనుకుంటున్న సన్నిహితులు

*_టార్గెట్ కేటీఆర్_*
_● నెంబర్ 2పై సెంట్రల్ నిఘా..!_
_● ఎక్కడా దొరకని యువరాజు!_
_● మత్తు నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు జల్లెడ_
_● బినామీలంటున్నా.. దొరకని తీగ_
_● పేరు వాడకంలో దేశ ముదుర్లుగా బిల్డర్స్, నేతలు, అధికారులు_
_● పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడ్డ వారి లిస్ట్ రెడీ.?_
_● కేసీఆర్ వైఖరే.. బెటర్ అనుకుంటున్న సన్నిహితులు_
_● తీరు మార్చుకుంటేనే.. ఫ్యూచర్.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం, 9440000009)_*

*_ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అక్రమ ఆస్తులపై ఈడీ రైడ్స్ పూర్తి. ఇక 'కవితక్క', సిబిఐ 'తైతక్క' పూర్తయింది. ఇక నెక్స్ట్ ఎవరు.? ముసుగులో గుద్దులాట ఎందుకు..? ఇక కేటీఆర్ టార్గెట్ గా కేంద్రం పావులు కదుపుతోందా.? అంటే... ఎవరో ఒకరు 'హైడ్రామా'కు కావాలి కదా.? ఇక కేసీఆర్ కి కేటీఆర్ కి తేడా ఎంటో ఇప్పుడిప్పుడు అర్థం అవుతోంది కుటుంబ సభ్యులకి. కేంద్ర దర్యాప్తు బృందాలు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తుండటంతో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేటీఆర్ అక్రమాలను, అవినీతిని ఎండగట్టేందుకు బీజేపీకి, కాంగ్రెస్ కి బలమైన సాక్ష్యాధారాలు ఉండటం లేదని తెలుస్తోంది._*

*_ఎన్నో ప్రయత్నాలు..ప్చ్.!:_*
ఆరు నెలలుగా ఐటీ, ఈడీ, సీబీఐ, ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి. ఆయన చేసిన అక్రమాలంటూ.. ఇచ్చిన లెటర్స్ ని లోతుగా దర్యాప్తు చేశాయి. కానీ, ఎక్కడా దొరకడం లేదు. స్నేహితుల రూపంలో ఉన్నారని పసిగట్టినా.. నమ్మలేని పరిస్థితి. తనకు దగ్గరగా ఉంటూనే.. ఏదైనా ఒక పని కోసం చెబితే వంద పనులు చేయించుకున్న ఘనులు ఉన్నారు. లోకల్ లీడర్స్ అయితే తమ సొంత పార్టీ నేతలకు, ప్రత్యర్ధులకు కూడా.. కేటీఆర్ దే అంతా అన్నట్లుగా ప్రచారం చేశారు. దీంతో తెలంగాణలో ఎక్కడ 100 ఎకరాలకు పైగా ఒకే బిట్ భూమి కనిపించినా.. ఇదంతా 'కేటీఆర్ దే' అంటూ జోరుగా వదంతులు నడిచాయి. కానీ, అక్కడ 'లిటిగేషన్'ని క్లియర్ చేసుకోవడం కోసమే ఆయన పేరు వాడినట్లు తెలుస్తోంది. ఆంధ్రా బిల్డర్స్ అయితే.. మొత్తం నాకేశారు. బ్యూరో క్రాట్స్ కి ఎప్పుడు లాబీయింగ్ చేసే ఆంధ్రా టీం.. కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ అన్నీ చేశారు. సార్ చెప్పారంటూ.. నగరంలో భారీగా లిటిగేషన్ భూములను క్లియర్ చేసుకున్నారు. అధికారులు సందట్లో సడేమియా అనుకుని వందల కోట్లు పోగేసుకున్నారంటే అశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓ కలెక్టర్ అయితే ఎవరు వెళ్లినా.. బేరం ఆడటమే అలవాటుగా చేసుకున్నారు. దీంతో చెప్పిందేంటి..? చేసిందేంటి అంటూ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం.

*_తండ్రి తీరే బెటర్.!:_*
కేసీఆర్ వర్కింగ్ స్టైల్ కేటీఆర్ కి రాదు. వచ్చినా.. అర్థిక సంబంధాలే అనుకున్నా.. ఎక్కడో ఒక దగ్గర దొరికేసేవారు. అయితే.. కేసీఆర్ 'ఎవరినీ కలవరు. ఏం పని చేయరు' అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అధికారంలో ఉండి నిత్యం కలిస్తే ఎలా వాడుకుంటారో తెలిసి అలా దూరం పెడుతారని టాక్. కానీ, కేటీఆర్ అలా కాదు. మార్కెటింగ్ కంపెనీకి 'సీఈవో'లా ఎలా ప్రచారం చేసుకోవాలో..? ఎవరితో..? ఎలా..? పరిచయాలు పెరుగుతాయో అనుకుంటూ అందరికీ ప్రయార్టీ ఇస్తుంటారు. ఏదైనా పని కావాలంటే.. వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తారు. ఇలా చేయడంతో ఆ పేరును అవినీతి తిమింగలాలు బాగా వాడేసుకున్నాయి. తెలిసినా లైట్ తీసుకోవడంతో ఇప్పుడు అదే ప్రచారం జోరుగా ఎక్కడ ఏ భూములు, ఏ హాస్పిటల్, యూనివర్సిటీలు ఉన్నా.. ఇందులో 'కేటీఆర్ ఉన్నారట' అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

*_చెక్ లిస్ట్..!:_*
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడంతో గులాబీ నేతలకు కొత్త బాధ్యతలు రానున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని తతంగాలు నడిపించినా.. అందరితో సఖ్యత ఉండటం నడిచిపోయింది. కానీ, ఇప్పుడు అలా కాదు. ప్రతీది జవాబుదారీతనం అవసరం. లేదంటే ప్రజల్లో ఇట్టే తేలిపోతారని తెలుసుకుంటున్నారు. దీంతో తన పేరును ఎక్కడెక్కడ ఎవరెవరు వాడుకుంటున్నారో ఎలాంటి ప్రయోజనం లేకుండానే విచ్చలవిడి ప్రచారం చేసుకుంటున్నారో లిస్ట్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేకత రావడానికి కారణం ఇలాంటి ప్రచారమేనని తెలుసుకున్నారు. పార్టీ నేతలు ఎవరైనా పేరు వాడుకుంటే.. ఇక నుంచి తీవ్ర మందలింపులు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

*_ఇన్నాళ్ల అక్రమాలపై ఆధారాలు ఎలా..?:_*
తెలంగాణ సంపద అంతా కేసీఆర్ కుటుంబం మింగేసిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తోంది. కానీ, ఇప్పటికీ బలమైన ఆధారాలు ప్రజల ముందు ఉంచలేకపోయారు. కాళేశ్వరం 'ఏటీఎం' అని చెబుతున్నా.. ఏడాదిగా ఎక్కడా నిరూపించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపెట్టారు. కానీ, ఇక్కడ ధరణీ భాగోతం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం లేదు. రియల్ ఎస్టేట్ స్కాంలు అంటున్నా.. అది పార్టీలన్నింటికీ ఆదాయం పెంచే మార్గమేనని అంటున్నారు. ప్రైవేట్ ఆస్తుల పెరుగుదల ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. భారీ స్కాంలకు పాల్పడ్డారని ఇప్పటికీ సరైన విధంగా బయటపెట్టడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. ఒకరిద్దరూ ఫైట్ చేసినా.. వ్యవస్థలు అన్నీ కలిసి బూడిదలో పోసిన పన్నీరులా తయారు చేస్తుడటంతో 'క్లీన్ చిట్' వస్తోందని సమాచారం.

*_చివరిగా..:_*
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవు. అయితే కుటుంబంలో పోటీ పడే కవిత ఇక నుంచి బరిలో లేనట్లే..!

Sunday, December 11, 2022

తెలంగాణలో 1,309 మంది రైతులు మృత్యువాత పడ్డారు

*_ఉరికొయ్యకు రైతన్న_*
_● ఐదేళ్లలో దేశవ్యాప్తంగా  41,369 మంది_
_● తెలంగాణలో గత 3ఏళ్లలో 1,309_
_● ఏపీలో 1,673మంది రైతుల ఆత్మహత్య_
_● అధిక శాతం కౌలు రైతులే.!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం, 9440000009)_*

*_స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు. ఇంకా రైతుల ఆత్మహత్యలు అంటే.. ఎక్కడో లోపం ఉంది. అది పసిగట్టలేని పాలకులు 'రాజకీయ పాచికలు' ఆడటం తప్ప లోతైన శోధన చేయడం లేదు. 'రైతు బంధు' అమలు చేస్తున్న తెలంగాణలో సైతం 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో 1,309 మంది రైతులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనికి అంతం ఎప్పుడు.? అస్సలు అంతం ఉందా..? లేదా..?_*

*_అసలేం జరిగిందంటే..?:_*
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు.

*_నివేదికలో ఏముంది.?:_*
2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

*_తెలంగాణలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు:_*
దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు సంభవించాయని తెలిపింది. 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. 2017, 2018 సంవత్సరాలతో పోల్చితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2017లో తెలంగాణాలో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 352 కు తగ్గిందని పేర్కొంది. దక్షిణ భారతంలో అధిక ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉంది. కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రం తెలిపింది.

*_దేశవ్యాప్తంగా..:_*
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రాష్ట్రంలో 41,369 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. 2019లో రాష్ట్రంలో 7,675 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2020నాటికి ఆ సంఖ్య 8058కి, 2021లో 10,171కి పెరిగినట్టు తెలిపారు.

*_సిగ్గుగా లేదూ..:_*
అందరికీ అన్నం పెట్టే రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించే తీరిక లేదా..? ఆత్మహత్యలు తగ్గుతున్నాయని చెప్పి చంకలు గుద్దుకోవడం కాదు. అస్సలు లేవని చెప్పే రోజు రావాలని ఆశిద్దాం. దానికోసం ఉద్యమించాల్సిన తరుణం ఇదే..! జై కిసాన్..

బాక్స్:
*_గుర్తించిన అంశాలు_*
* ఆత్మహత్యకు పాల్పడిన వారిలో దాదాపు అందరూ కౌలు రైతులే.
* చేసిన అప్పు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
* జీఓ 43 ప్రకారం వీరెవరికీ ఆర్థిక సాయం, పునరావాస ప్యాకేజీ అందలేదు. ఆర్డీవో, వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ), డీఎస్పీ గ్రామాలను సందర్శించలేదు. చాలా కేసుల్లో తహసీల్దారు, ఏఓ, ఎస్‌ఐతో కూడిన మండలస్థాయి కమిటీ ప్రాథమిక విచారణ జరిపి వివరాలు తీసుకోవడం లేదు.
* ఎక్కువ మంది మిర్చి, పత్తి సాగు చేస్తున్నవారే.
* ఎవరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) లేవు.
* బాధిత కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
* ప్రైవేటు అప్పులే దిక్కయ్యాయి. వీరెవరికీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు అందలేదు.

తెలంగాణలో ఏమి జరుగుతుంది?


తెలంగాణ లో ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వం పరిపాలన చేయడం లేదు

Bplkm🪶

Friday, December 9, 2022

పేరు మారితే జాతీయ పార్టీ కాదు..!

*_ఇదేం పాత్రికేయం.!_*
_● కొత్త జాతీయ పార్టీ ఆప్.._
_● బీఆర్ఎస్ కాదు.._
_● అప్పుడే అంత సీన్ లేదు_
_● సొంత పత్రిక ఓవరాక్షన్.!_
_● మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?_
_● పేరు మారితే జాతీయ పార్టీ కాదు..!_
_● ఇక మిగిలింది ఎవరబ్బా..!!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_*

*_మళ్లీ మళ్లీ అదే పిచ్చిమోత.. పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు 'బబ్రాజమానం భజగోవిందం' తరహా పిచ్చి ప్రచారం.. టీఆర్ఎస్ పార్టీ విధేయ మీడియాలోనూ అదే ధోరణి.. పాత్రికేయాన్ని పాతరేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న వైఖరి.. ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది.. దాని ఓనర్‌కు ప్రధాని కుర్చీ కావాలట..! అదెలాగూ ఆయన సొంత పార్టీ.. తన ఇష్టం.. తను చెప్పిందే వేదం.. తను చేసిందే శాసనం.. మేల్ శివగామి స్టయిల్.. మళ్లీ నాలుగు రోజులకు నో, నో, నా తెలంగాణ, జై తెలంగాణ అంటూ మళ్లీ పేరు మార్చుకున్నా సరే, ఆహాశ్చర్యమే అవసరం లేదు..! దయచేసి మీ 'భ్రమల లోకం'లోకి ప్రజలను లాగకండి..వారిని వారిలాగే ఉండనివ్వండి. లేకుంటే భవిష్యత్తులో 'దేవతావస్త్రాలు' ప్రాప్తిరస్తు.!_*

*_సొంత పత్రిక ఓవరాక్షన్..:_*
ఈరోజు కూడా సారు గారి సొంత పత్రిక ఓవరాక్షన్.. అదేదో గొప్ప రాజకీయ పరిణామం అయినట్టుగా.. నిజంగానే టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోయినట్టుగా.. దేశ రాజకీయ యవనికపై మన జయపతాక అట.! ఎన్నికల సంఘం రాజముద్ర వేయడం జయపతాక ఎగరేసినట్టా..? జాతీయ స్థాయికి 'కొత్త ధ్రువతార కేసీయార్' అంటూ మరో డెక్కు.. మామూలుగా 'ధ్రువతార' అని ఏ సందర్భాల్లో వాడతామో తెలుసా వీళ్లకు అసలు..?

*_ఇదేం ఖర్మ..!:_*
ఒక్క నమస్తే తెలంగాణ మాత్రమే కాదు, దాదాపు కేసీయార్ అదుపాజ్ఞల్లో ఉన్న ప్రతి పత్రిక, ప్రతి టీవీ అంతే.. హబ్బా, జస్ట్, పేరు మారిందే తప్ప, నీకు నువ్వు 'జాతీయ పార్టీ' అని చెప్పుకోవడం తప్ప.. కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను జాతీయ పార్టీ అనడం లేదు బాబూ.., పేరు మార్పుకు 'అంగీకరించాం' అని లేఖ పంపించింది. అంతే..!

*_మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?:_*
పేరులో తెలంగాణ ఉంది కాబట్టి.. అది మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి.. దానికంటూ ఓ కొత్త పార్టీ పెడితే కొన్ని కొత్త చిక్కులు వస్తాయి కాబట్టి.... తెలంగాణతనాన్ని వదిలేసింది. 'భారత రాష్ట్ర సమితి' అని స్వీయ నామకరణం చేసుకుంది. అంతకుమించి ఇప్పటికిప్పుడు జరిగింది లేదు, ఒరిగిందీ లేదు. మరెందుకీ గోబెల్స్ ప్రచారం..?

*_ఇదేం పాత్రికేయం:_*
నిజానికి వార్త అంటే ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం.. హఠాత్తుగా రాత్రికిరాత్రి 'అబ్రకదబ్ర' అని గాలిలో మంత్రదండం ఊపి, జాతీయ పార్టీ అయిపోలేదు అది. పార్టీ పేరు సేమ్. మెల్లిమెల్లిగా ఒక్కో రాష్ట్రానికి అక్టోపస్‌లా చేతులు విస్తరిస్తూ..ఓట్లు సాధిస్తూ.. నిజంగానే జాతీయ పార్టీ అయ్యింది. ఒక్కసారి ఈ వార్త చూడండి.

*_'ఆప్' వెనుక ఎంతో శ్రమ, నిజాయితీ:_*
ఇదీ వార్త. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి. లాస్ట్ ఎన్నికల్లో కనీసం 2 శాతం సీట్లను కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ఆప్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పట్లో గోవాలో 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు గుజరాత్‌లో పది శాతం దాటి ఓట్లు తెచ్చుకుంది. హిమాచల్‌లో పెద్ద రిజల్ట్ లేకపోయినా ఓట్ల శాతం బాగానే పెంచుకుంది.

*_పేరు మారితే జాతీయ పార్టీ కాదు..:_*
సో, జాతీయ పార్టీగా గుర్తింపుకు అర్హత సాధించింది. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్‌కన్నా తన తోక లేదా తను తోకగా ఉన్న మజ్లిస్‌ను జాతీయ పార్టీ అనాలి. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఉనికి ఉంది, కొన్ని ఓట్లు ఉన్నయ్, కొన్ని సీట్లు ఉన్నయ్.! ప్రస్తుతం అధికారికంగా కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీఎంసీ మాత్రమే జాతీయ పార్టీలు. ఆప్ ఎనిమిదో జాతీయ పార్టీ. ఏమో, సరిగ్గా లెక్కలు తీస్తే రాబోయే రోజుల్లో మజ్లిస్ దరఖాస్తు చేసుకోవచ్చునేమో.! అదే రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీఎంసీ తమ జాతీయ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. అంతే తప్ప, మేం 'జాతీయమహో' అని డప్పు చాటుకుంటే జాతీయ పార్టీ కాలేదు ఏ పార్టీ..!!

*_హేమిటో..:_*
అతిశయోక్తులు, అతిభజన నిజమైన నాయకుడిని ఆవిష్కరించలేవు.. ఆచరణ, ఫలితాలే దేనికైనా గీటురాయి.. గతంలో ఇదే నమస్తే తెలంగాణ 'అతిశయోక్తి' అనే పదమే 'అతి' అని అంగీకరించిన తరహాలో ఓ బొమ్మ, ఓ వార్త వడ్డించింది.. జస్ట్, పార్టీ పేరు మార్పిడి పథకానికి గాంధీ క్విట్ ఇండియా మూమెంట్‌కు లంకె పెట్టినట్టుగా... అంత కలరింగ్ ఇచ్చింది పత్రిక.. అప్పట్లో, యాభై ఏళ్ల కింద జయప్రకాశ్ నారాయణ ఇందిర ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన మహోజ్వల ఘట్టంతో పోల్చింది... ఇలా..!

*_ఇక మిగిలింది ఎవరబ్బా..!!_*
జనసేన యుద్దవాహనం సిద్ధమైంది కదా.! ఇక కొండగట్టులో పూజలు చేసి, ఆయుధం పట్టి, యుద్ధభేరి మోగించడమే.! రెండు రాష్ట్రాలు.. అదీ జాతీయ పార్టీయే.. తెలుగుదేశం పార్టీని కూడా జాతీయీకరించేసి, 'భారతదేశం' అని పేరు మార్చేసి, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, అండమాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటడమే.! కేఏపాల్‌ది ఎలాగూ అంతర్జాతీయ పార్టీ..! దానికి ఏ ఫరక్ పడదు.! నిఖార్సయిన తెలంగాణతనానికి నిలువెత్తు ముఖచిత్రం షర్మిలకు జాతీయ సంకల్పాలు, లక్ష్యాలు ఎటూ లేవు..! ఇక మిగిలింది ఎవరబ్బా...!!