Wednesday, September 7, 2022

సెప్టెంబర్ గండం.... గ్రేటర్ వాసుల.... వెన్నులో వణుకు

*సెప్టెంబర్ గండం.... గ్రేటర్ వాసుల.... వెన్నులో వణుకు*

*ఏటా ఈ మాసంలోనే కుండపోత వర్షాలు*

*1908లో మూసీ వరదలు ఈ నెలలోనే*

*గత చరిత్రను పరిశీలిస్తే సుస్పష్టం*

*నిండా మునుగుతున్న బస్తీలు, కాలనీలు*
హైదరాబాద్‌: సెప్టెంబర్‌ వస్తోందంటేనే గ్రేటర్‌ వాసుల వెన్నులో వణుకు పుడుతోంది. ఏటా ఇదే నెలలో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీలు, ప్రధాన రహదారులను నిండా ముంచుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసీ మహోగ్రరూపం దాల్చి నగరంలో సగభాగం తుడిచిపెట్టేసిన వరదలు కూడా ఇదే నెలలో.. సెప్టెంబర్‌ 28న సంభవించినట్లు చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇక 2000, 2016 సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు సిటీని అతలాకుతలం చేశాయి.

*చరిత్ర పుటల్లో హైదరాబాద్‌ వరదల ఆనవాళ్లివీ....*
1591 నుంచి 1908 వరకు 14సార్లు వరద ప్రవాహంలో నగరం చిక్కుకుంది.
►1631, 1831, 1903లలో భారీ వరదలతో సిటీలో ధన, ప్రాణ నష్టం సంభవించాయి.
►1908 సెప్టెంబరు వరదలతో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి.15 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల పాటు జనజీవనం స్తంభించింది.
►1631లో కుతుబ్‌ షాహీ ఆరో పాలకుడు అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో సంభవించిన వరదలకు నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి.
►1831లో అసఫ్‌ జాహీ నాలుగో మీర్‌ ఫరుకుందా అలీఖాన్‌ నాసరుదౌలా పాలనా కాలంలోనూ వరదలు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్‌ వంతెన కొట్టుకుపోయింది.
►ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్‌ నెలలోనే భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ఇక 1968, 1984, 2000, 2007, 2016, 2020లలో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ నిండుగా ప్రవహించింది.
*1908.. సెప్టెంబరు 28న కొట్టుకుపోయిన సిటీ....*
మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహిస్తూ మహోగ్ర రూపం దాల్చింది. కేవలం 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్‌ వద్ద నీటి మట్టం 11 అడుగులు. వరదనీరు ఇటు చాదర్‌ఘాట్‌ దాటి అంబర్‌పేట బుర్జు వరకు.. అటు చార్మినార్‌ దాటి శాలిబండ వరకు పోటెత్తింది. చంపా దర్వాజా ప్రాంతంలోకి చేరడంతో అక్కడే ఉన్న పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో జనం ఎక్కారు. రెండు గంటల్లోనే నీటి ప్రవాహానికి పేట్లబురుజు కొట్టుకుపోయింది. వందల మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సెప్టెంబరు 28న సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. జనం హాహాకారాలు చేశారు. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు.

నాటి పాలకుడు నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కాలినడక జనం మధ్యకు వచ్చారు. వరద బాదితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి మహారాజా కిషన్‌ ప్రసాద్‌ను ఆదేశించారు. నిరాశ్రయులకు తమ సంస్థానంలోని అన్ని భననాలను ప్రజల కోసం తెరిచిఉంచాలని కోరారు. పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్‌ల్లో వైద్య శిబిరాలు, అన్న దానం ప్రారంభించారు. అన్ని «శాఖల సిబ్బందిని వరద బాధితుల సహాయం కోసం పని చేయాలని సర్కార్‌ ఆదేశాలిచ్చింది. నాటి నుంచి సెప్టెంబర్‌ నెల వచ్చిందంటే నగర ప్రజలు వరదలకు భయపడుతూనే ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

నిరుత్సాహపడిన పర్యావరణ ప్రేమికులు

https://youtu.be/GfICqwyQesM                                                                                               #పర్యావరణప్రేమికులు ఎంతో ఆసక్తిగా వేచి చూసిన తెలంగాణ లోకాయుక్త తీర్పు వాయిదా పడడానికి కారణం సంబంధిత #ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం. ఈరోజు ఫైనల్ హియరింగ్ వుంది అని తెలిసి కూడా ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా న్యాయస్థానంలో హాజరు కాలేదు అంటేనే అర్థం అవుతుంది #ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో #ప్రజాప్రయోజనాలమీద..... Bplkm🪶                                                                                                                                                                  Copy to Group link Media                               07/09/2022  prajasankalpam1.blogspot.com

Tuesday, September 6, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్.... హైదరాబాద్ సహా 30చోట్ల.... ఈడీ సోదాలు.....!

*ఢిల్లీ లిక్కర్ స్కామ్.... హైదరాబాద్ సహా 30చోట్ల.... ఈడీ సోదాలు.....!*

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.దిల్లీ, ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌, లఖ్‌నవూ తదితర నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రేమ్‌సాగర్‌, అభిషేక్‌రావు, సృజన్‌రెడ్డి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఇంట్లో సోదాలు నిర్వహించడం లేదని ఈడీ అధికారులు తెలిపారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, September 5, 2022

నకిలీ పత్రాలు సృష్టించుకో..అనుమతులు ఇస్తా

నకిలీ పత్రాలు సృష్టించుకో..అనుమతులు ఇస్తా..

నకిలీ పత్రాలు సృష్టించుకో..అనుమతులు ఇస్తా..


( అక్రమార్కులకు నిస్సిగ్గుగా వంత పాడుతున్న అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత.. )

- అమీన్ పూర్ మున్సిపల్ కేంద్రంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు..
- అమ్యామ్యాలు ఇస్తే చాలు అధికారులు ఆ వైపు చూడరు.. 
- జిల్లా రెవిన్యూ అధికారి కస్టడీలో ఉండాల్సిన భూములు కనుమరుగు.. 
- ఏ.ఆర్ డెవలపర్స్ పేరుతో పాగా వేస్తున్న వైనం..  
- వక్ర మార్గంలో నిర్మాణ అనుమతులు..
- అక్రమార్జనే ద్యేయంగా మున్సిపల్ కమిషనర్ సుజాత..   
 - బోగస్ పత్రాలతో  తెరపైకి వస్తున్న అక్రమ వెంచర్లు..
- ప్రభుత్వ ఖజానాకు భారీ గా గండి..  
-  గ్రామ పంచాయితీ అనుమతులతో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు..   
-  రెవిన్యూ అధికారుల అధీనంలో ఉన్న భూమి మాయం..         
- సర్వే నెంబర్ 1003,1004,1057,1060,1062,1063 లలో 
   అక్రమ నిర్మాణాలతో పేట్రేగిపోతున్న నిర్మాణ సంస్థ.. 
- కాసులకు కక్కుర్తి పడి సర్కారీ భూమిలో నిర్మాణ అనుమతులు 
   ఇచ్చిన అధికారులు 
- గడప దాటని సీడీఎంఏ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ.. 
 
ఒక అవినీతి అధికారిణి నిస్సిగ్గుగా నకిలీ పత్రాలు సృష్టించిన నిర్మాణ సంస్థలకు, లంచాలు అందుకుంటూ అడ్డగోలుగా అనుమతులు జారీ చేస్తుంటే.. వాటిని నిలువరించి చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ . సత్యనారాయణ కూడా అవినీతి ఆఫీసర్ సుజాతకు వత్తాసు పలుకుతూ..  తాను కూడా ఆమె పాపంలో పాలుపంచుకోవడం ఎంతో దుర్మార్గం.. ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను మోసం చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడి తాము విధులు నిర్వహిస్తున్న స్థాయికి కళంకం అంటగడుతున్నారు.. ఇలాంటి అవినీతిపరులైన అధికారుల వలన ప్రభుత్వానికి, సంబంధిత శాఖా మంత్రి కేటీఆర్ కు చెడ్డపేరు వస్తోంది.. ఇలాంటి అక్రమ వ్యవహారాలపై మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టాలని అమీన్ పూర్ స్థానికులు కోరుతున్నారు.. 
 
హైదరాబాద్, 04 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : 
సంగారెడ్డి జిల్లాలోని, అమీన్ పూర్ మున్సిపాల్టీలో ఏ.ఆర్. డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలకు తెరలేపింది.. సదరు నిర్మాణ సంస్థ చూపించిన సర్వే నెంబర్ల భూమి ఏ.ఆర్. డెవలపర్స్ భూమి కాదని, రెవిన్యూ అధికారులు గతంలోనే ఇచ్చిన రిపోర్ట్ ద్వారా తేట తెల్లమవుతుంది.. సర్వే నెంబర్స్  1003,1004,1057,1060,1062,1063 లకు సంబంధించిన భూములలో వక్ర మార్గంలో పొందిన అనుమతులుతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణ పనులు చేపడుతోంది.. ఆ భూమి జిల్లా రెవిన్యూ అధికారి కస్టడీలో ఉన్నా కూడా డోంట్ కేర్ అంటూ, ప్రభుత్వ భూమి,ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూములను 
కాచేయుటకు ఏ.ఆర్. డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ తన వక్ర బుద్దిని చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఏ.ఆర్. డెవలపర్స్ నిర్మాణ సంస్థతో అమీన్  పూర్ మున్సిపల్ కమిషనర్ లోపాయికారి ఒప్పందం చేసుకుని, అక్రమార్జనే ద్యేయంగా అందిన కాడికి దోచుకొని సదరు నిర్మాణ సంస్థకు వత్తాసు పలుకుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. బోగస్ పత్రాలతో సదరు నిర్మాణ సంస్థ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే..  మున్సిపల్ కమిషనర్ సుజాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారి అవినీతికి అద్ధం పడుతుంది..  క్షేత్ర స్థాయి సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన కమిషనరే, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. మున్సిపాల్టీలలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, సజావుగా జరిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019లో నూతనంగా ప్రవేశ పెట్టిన మున్సిపల్ చట్టం, ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది.. అమీన్ పూర్ మున్సిపాల్టీలో అక్రమనిర్మాణాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడంతో.. ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం బ్రష్టు పడుతుందనే విమర్శలు  వినిపిస్తున్నాయి.. 2018 సంవత్సరంలో అమీన్ పూర్ గ్రామ పంచాయితీ మున్సిపాల్టీ గా ఏర్పడింది.. 2018 సం" లో మున్సిపాల్టీ ఏర్పడ్డది కనుక నిర్మాణ   అనుమతులు పొందాలంటే మున్సిపల్ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోవాలి.. మున్సిపాల్టీ ఏర్పడక ముందు గ్రామ పంచాయితి నుండి తీసుకున్న నిర్మాణ అనుమతులు..  పర్మిషన్ తీసుకున్న తేదీ నుండి రెండు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంటుంది.. కానీ అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 2018లో తీసుకున్న అనుమతులు 2022 వరకు ఎలా చెల్లబాటు అవుతున్నాయనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది..? నకిలీ పత్రాలు సృష్టిస్తే వాటిని గుర్తించి అట్టి నకిలీ పత్రాలను సృష్టించిన వ్యక్తులపై క్రిమనల్ చేపట్టాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతో..  భూ కబ్జాలకు పాల్పడే అక్రమార్కులు కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అవినీతిలో కూరుకుపోయిన మున్సిపల్ కమిషనర్ సుజాత బోగస్ పత్రాలను, అక్రమ వెంచర్లను  పట్టించుకోకుండా, ధనార్జనే ద్యేయంగా..  ఇష్ట్టమొచ్చినట్లు అనుమతులు జారీ చేసి, భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారని  స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.. గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ సుజాత అవినీతి వ్యవహారాలపై వివిధ పత్రికల్లో..  ఆధారాలతో వార్త కథనాలు ప్రచురితమైనా, వివిధ సంఘాల నుండి పిర్యాదులు అందినా  చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్, సంచాలకులు పురపాలక పరిపాలన కార్యాలయ అధికారి సత్యనారాయణ.. ఎలాంటి చర్యలు చేపట్టకుండా  మౌనంగా  ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.. 2018 కంటే ముందు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో పొందిన ఇంటి నెంబర్లుతో  ఏ.ఆర్.  డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ, బోగస్  పత్రాలతో అక్రమ లే అవుట్లను చేస్తుంటే ..  దర్జాగా  దొడ్డిదారిలో అక్రమ నిర్మాణ పనులు చేస్తుంటే..  మున్సిపల్ అధికారులు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.. అమీన్ పూర్ మున్సిపాల్టిలో నిర్మాణ అనుమతులు పొందాల్సిన ఏ.ఆర్. డెవలపర్స్  అనే నిర్మాణ సంస్థ, గ్రామ పంచాయితీ ఇంటి నెంబర్లతో అక్రమ నిర్మాణ పనులు చేస్తుంటే..  వీరికి మున్సిపల్ చట్టం వర్తించదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. ఏ.ఆర్.  డెవలపర్స్  అక్రమ లే అవుట్ కు సంబంధించిన వ్యవహారాలపై, మున్సిపల్ అధికారులు చేస్తున్న అక్రమ ఆగడాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది  
' ఆదాబ్ హైదరాబాద్ '..  ' మా అక్షరం అవినీతిపై అస్రం '..

Sunday, September 4, 2022

నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం బయటపెడుతాను...ఒళ్ళు దగ్గరపెట్టుకో

నా జోలికి వస్తే నీ *చరిత్ర మొత్తం బయటపెడుతాను...ఒళ్ళు దగ్గరపెట్టుకో....రేవంత్ కు... రాజగోపాల్ రెడ్డి వార్నింగ్....!*

నల్గొండ : తెలంగాణలో పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటల దాడి చేస్తున్నారు.హస్తం నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రేవంత్‌ రెడ్డిపై రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్. నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతాను. నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో అన్ని తెలుసు. వాటిని బయట పెడితే ముఖం చూపించుకోలేవు. పోయేకాలం వచ్చిందా రేవంత్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో కూడా అడుగు పెట్టవ్.

సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నది నువ్వు కాదా?. హైదరాబాద్‌లో వంద మందిని బ్లాక్ మెయిల్‌ చేసి ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశావు. డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నావు. నీలాంటి మనిషిని పీసీసీ చేయడమా?. నీది నేర, అవినీతి చరిత్ర నీకు పార్టీ జెండా కావాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలుస్తాను. మునుగోడుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. పోనీలే అని ఇరవై రోజులుగా ఓపికపడుతున్నా. నా మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు. నేను అమ్ముడుపోయినట్లు నీ దగ్గర పత్రాలు ఉంటే మీడియాకు ఇవ్వు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, September 3, 2022

అధికారికంగా హైదరాబాద్, సంస్థాన విమోచన దినోత్సవం

*అధికారికంగా హైదరాబాద్, సంస్థాన విమోచన దినోత్సవం*

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు.

ఈ ఉత్సవాలను హైదరాబాద్‌ స్టేట్‌ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్‌ షా సైనిక వందనం స్వీకరించనున్నారు. సైనిక కవాతుతోపాటు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Friday, September 2, 2022

కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా....? నిర్మలా సీతారామన్ ఫైర్....!

*కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా....? నిర్మలా సీతారామన్ ఫైర్....!*

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్‌లో శుక్రవారం రేషన్‌ షాప్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలా సీతారామన్‌..
రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతని కామారెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే కలెక్టర్‌ తెలియదని సమాధానం చెప్పడంతో.. 'కలెక్టర్‌ అయ్యుండి తెలియదంటారా' అని నిర్మలా మండిపడ్డారు. అరగంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్‌ను ఆదేశించారు.పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 30 రూపాయలు భరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. రేషన్‌ షాప్‌ ఫ్లెక్సీలో మోదీ ఫోటో లేకపోవడం గమనించిన కేంద్ర మంత్రి.. ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని మళ్లీ కలెక్టర్‌ను నిలదీశారు. మోదీ ఫోటో పెట్టకపోతే సాయంత్రం తానే వచ్చి కడతానని నిర్మలా చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం