ధర్మము అంటే ఏమిటి?
ధర్మము అంటే ఏమిటి? ఎన్ని రకాలు? శాస్త్రము ధర్మము గురించి ఏమి చెపుతుంది? ధర్మబద్దముగా జీవించటం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అన్న అనేక విషయాలను పూర్వకాలములో మునులు పురాణాలలో వివరించారు. అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. పురాణాలు మనకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపిన పుణ్యపురుషులు జీవితాలను వివరిస్తాయి. రామాయణము ఆ కోవకు చెందినదే.
ముందు ధర్మానికి ఉండవలసిన లక్షణాలను తెలుసుకుందాము. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితములో అన్నింటిని జయించినట్లే అని పెద్దలు చెపుతారు. ఆ లక్షణాలు మొత్తము పది ఉన్నాయి. అవి ధృతి, క్షమ, దమం, అస్తేయం, శౌచము, ఇంద్రియ నిగ్రహము, సిగ్గు, విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణాలను కలిగి ఉన్నది ధర్మం అని శాస్త్రము చెపుతుంది. ఈ ధర్మాలలో కూడా రకాలు ఉంటాయి కాబట్టి ఈ రకమైన పది లక్షణాలను శాస్త్రవేత్తలు చెప్పారు.
తండ్రి పట్ల నిర్వర్తించే ధర్మాన్ని పుత్ర ధర్మాలు అంటారు, అలాగే కుటుంబ సభ్యులపట్ల నిర్వర్తించవలసిన ధర్మము, స్నేహితుల పట్ల నిర్వర్తించవలసిన స్నేహధర్మము, కుటుంబము పట్ల చూపవలసిన ధర్మము, రాజ్యములో పౌరుడిగా నిర్వర్తించవలసిన పౌర ధర్మము, ఇలా చాలా రకాల సామాన్య ధర్మాలు మన జీవితములో నిర్వర్తించవలసి ఉంటుంది.
ఇప్పుడు పైన ప్రస్తావించిన పది లక్షణాలను గురించి తెలుసుకుందాము.
- ధృతి: మానవుడు తనకు లేదా కుటుంబానికి, లేదా సమాజానికి సంబంధించిన పనిని ప్రారంభిస్తాడు. మొదట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కానీ ప్రారంభించిన కొన్ని రోజులకే అనేక సమస్యలు ఎదురవుతాయి. చుట్టుపక్కల వారి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అడ్డంకులు విమర్శల వల్ల నిరాశ మొదలవుతుంది. అటువంటప్పుడే ఆత్మబలంతో, అకుంఠిత దీక్షతో ధృతి చెడకుండా ముందుకి సాగి ఆ కార్యాన్ని పూర్తి చేయటము ధర్మము.
- క్షమ: మనిషి ఏ విషయములోనైనా ఏ పనిలోనైనా, ఓర్పు కలిగి ఉండాలి. క్షమా గుణముతో ఉండాలి. ప్రతిదానిని, ప్రతి వారిని ప్రతి విషయాన్నీ క్షమా శక్తితో ఎదుర్కోవాలి. ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు. ఓర్పు ఉన్నవారిని ఏ శక్తి ఏమి చేయలేదు, ఇది ధర్మము.
- దమం: మనము ఏదైనా పనిచేసేటప్పుడు మన మనస్సును పూర్తిగా ఆ విషయము పైననే లగ్నము చేయాలి, చేస్తున్నపని కాకుండా ఇతరము లపై మనస్సును మళ్ళించకూడదు. అంటే మనస్సును పరిపరి మార్గాలపైకి పోనివ్వకుండా ఉండాలి.
- అస్తేయం: మనకు తెలియని విషయాలను స్వయముగా తెలుసుకోకుండా, పెద్దలు చెప్పిన దానిని అంగీకరించకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనలేక, నిస్తేజముగా నిరాశగా, నియమరహితుడుగా ఉండకూడదు.
- శౌచము: మనిషి ఎప్పుడు మనస్సును, శరీరాన్ని ఆలోచనలను, మాటలను, ధరించే వస్త్రాలను పరిశుభ్రముగాను శుచిగాను ఉంచుకోవాలి.
- ఇంద్రియ నిగ్రహము: చదువు, సంపద, కీర్తి, బలము ఎన్ని ఉన్నా ఇంద్రియ నిగ్రహము లేనివారికి పతనము సంభవిస్తుంది. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి వదలి వేయకుండా అదుపు చేసుకోవాలి. మనస్సును గెలిచినవాడు ఎవరినైనా ఇంద్రుడినైనా గెలుస్తాడు. అటువంటి వారిని భూత ప్రేత పిశాచాలు, దేవతలు భాధించలేరు, కష్ట సుఖాలు వారి అధీనములో ఉంటాయి.
- సిగ్గు (హ్రీమ్): ప్రతి విషయానికి సిగ్గు పడటము, సంకోచపడటము, అనుమాన పడటము, తన్ను తానూ తక్కువగా భావించుకోవాటము తగని పని.
- విద్య: మనిషికి ఆహారము ఱంత ముఖ్యమో వివేకము కూడా అంత ముఖ్యము. వివేకము విద్య వలన వస్తుంది. అంటే విద్యావంతుడు అవ్వాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకము సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవములోకి మళ్ళించుకోవాలంటే విద్య కావాలి. అందుకే పెద్దలు విద్య లేని వాడు వింత పశువు అని చెప్పారు. భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషి వాక్యము.
- సత్యము: ఆకారణముగా ఒకరి మెప్పుకోసమో తన పనిని సాధించుకోవటం కోసమో మరే కారణము కోసమో అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధము వల్ల కలిగే లాభము లేదా సుఖము తాత్కాలికం. అది కలుగజేసే సుఖము అల్పము. ఏదో ఒక నాటికి అబద్ధము అవమానాల పాలు చేస్తుంది. మన కీర్తిని, గొప్పతనాన్ని పాతాళానికి దిగజారుస్తుంది. కాబట్టి మనిషి సత్యధర్మాన్ని పాటిస్తూ సత్యవ్రతుడై ఉండాలి.
- అక్రోధము: పగ, కోపము, ప్రతీకారము, మనిషిని పతనావస్థకు చేరుస్తాయి. మనిషి అభివృద్ధికి అవరోధము కలుగజేస్తాయి. అకారణముగా సాటి వారిని లేదా ప్రాణులను హింసించటం, లేదా భయపెట్టటము వంటి పనులు చేయరాదు. కోపాన్ని జయించితే సమస్యలను అధిగమించి మనుషులను జయించవచ్చు. కోపము ఆత్మీయులను దూరము చేస్తూ జీవితాన్నే పతనం చేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకున్నవాడు ఏదైనా సాధించగలడు.
ఇవి కాకుండా శాస్త్రాలలో చెప్పినవి చెప్పనివి సామాన్య ధర్మాలతో పాటు కొన్ని విశేష ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. తనకున్నా జ్ఞానాన్ని దాచుకోకుండా పక్షపాత ధోరణి లేకుండా శిష్యులకు బోధించటం గురువు ధర్మము. అలాగే భక్తి శ్రద్ధలతో వినయముతో విద్య నేర్చుకోవటం శిష్య ధర్మము. గృహస్తుగా న్యాయమార్గములో సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మము. భర్త సంపాదనను క్రమ పద్ధతిలో వినియోగిస్తూ గృహాన్ని నడపటం ఇల్లాలి ధర్మము. సైనికుడిగా ఉండి దేశాన్ని, ప్రజలను కాపాడటము సైనిక ధర్మము. పుత్రుడిగా కన్న తల్లిదండ్రులను ఆదరించి పోషించటం పుత్ర దర్మము. తన బిడ్డలను ప్రయోజకులుగా చేయటము తండ్రి ధర్మము. తనను కన్నవారికి తన కుటుంబానికి పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డల ధర్మము. వృత్తి ఏదైనా వృత్తిని గౌరవిస్తూ పని చేయటము వృత్తి ధర్మము. నిర్భాగ్యులను నిరాశ్రయులను కాపాడటం మానవతా ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారము చేయకుండా ఉండటం మిత్ర ధర్మం. సోమరితనం లేకుండా కష్టించి పని చేయటము పురుష ధర్మం. తానూ సంపాదించిన దానిని తనవారితో పంచుకు తినటం సంసార ధర్మము.
ఇవండీ మనిషి ఆచరించవలసిన ధర్మాలు.
No comments:
Post a Comment