పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదంటూ నిరసన
!! ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయంలో బల్లపై లక్ష్మీదేవి మృతదేహం ఉంచి ఆందోళన చేస్తున్న కుమార్తెలు
ధర్మవరం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం లక్ష్మీదేవి (68) మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మీదేవి మృతదేహాన్ని తహసీల్దారు కుర్చీ ఎదురుగా ఉండే బల్లపై ఉంచి రెవెన్యూ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. బత్తలపల్లి మండలం దంపెట్ల రెవెన్యూ పరిధిలోని జలాలపురం గ్రామానికి చెందిన పెద్దన్న పేరుతో సర్వే నంబర్ 18డిలో 5.18 ఎకరాల భూమి ఉంది. పెద్దన్న మృతి చెందడంతో తన పేరున పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ఆయన భార్య లక్ష్మీదేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు నాగేంద్రమ్మ, లింగమ్మ, రత్నమ్మ తిరుగుతున్నారు. లక్ష్మీదేవి కుమార్తె వద్ద ఉంటూ మంగళవారం మృతి చెందింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో తమ తల్లి మానసిక ఆందోళనకు గురై మృతి చెందిందంటూ కుమార్తెలు తల్లి మృతదేహాన్ని తహసీల్దారు కార్యాలయానికి తరలించి నిరసన తెలిపారు. వీఆర్వో నాగేంద్రను పలుమార్లు కలిసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు ఖతిజున్‌కుఫ్రా, ఎస్‌ఐ శ్రీహర్ష, కార్యాలయానికి చేరుకొని వారితో మాట్లాడారు. ఆరేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితులు వాపోయారు. అధికారులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ విషయంపై బత్తలపల్లి తహసీల్దారు ఖతిజున్‌కుఫ్రా మాట్లాడుతూ గతంలో పనిచేసిన తహసీల్దారు ఒకరు పెద్దన్న పేరుతో 18డి సర్వే నంబరులో 5.18 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారని తెలిపారు. పెద్దన్న మృతి అనంతరం అతని భార్య పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని కోరగా ఆధారాలు తీసుకురావాలని చెప్పామన్నారు. విచారణ చేయగా ఆ భూమి ప్రభుత్వానికి చెందినదిగా రికార్డుల్లో ఉందన్నారు. గతంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఆన్‌లైన్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
No comments:
Post a Comment