రాహుల్ గాంధీ: విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి తప్పించగలరా? కాంగ్రెస్‌కు కొత్త రూపం ఇవ్వడం సాధ్యమేనా?
- భూమికా రాయ్
- బీబీసీ కరస్పాండెంట్ సౌజన్యంతో
''భయపడేవారు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. భయంలేని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఆవల చాలామంది ఉన్నారు. వాళ్లంతా రావాలి. బీజేపీకి భయపడే కాంగ్రెస్ నేతలకు బయటకు వెళ్లే మార్గం చూపాలి. ఆరెస్సెస్ సిద్ధాంతాలను నమ్మే వ్యక్తులు మాకు అవసరం లేదు. భయం లేని నాయకులు రావాలి. ఇదే మా సిద్దాంతం''
కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ వలంటీర్లను ఉద్దేశించి ఈ ఏడాది జూలై 16న రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు.
అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్దపెద్ద మార్పులు కూడా కనిపించాయి. రాహుల్ గాంధీ ఆలోచనల ఫలితమే ఈ మార్పులని బహిరంగంగానే చెబుతున్నారు.
నాయకుడు లేని కాంగ్రెస్‌కు దారి చూపుతున్నారా?
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదు. సోనియా గాంధీ కూడా తాత్కాలిక అధ్యక్షురాలే. అయినా, పార్టీలో ప్రతి మార్పును రాహుల్ గాంధీ ఓకే చేసిన తర్వాతే అమలు చేస్తున్నారు.
కొన్ని రోజుల కిందట పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఇదే అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. "కాంగ్రెస్‌కు ఎన్నికైన అధ్యక్షుడు లేరు. ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో మాకు తెలియదు" అని ఆయన అన్నారు.
కపిల్ సిబల్ నాయకత్వ లేమి గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, ఇటీవలి పరిణామాలు కాంగ్రెస్ పార్టీపై రాహుల్ ముద్రను స్పష్టంగా చూపుతున్నాయి.
జిగ్నేష్ మేవాని, కన్హయ్య కుమార్‌లు పార్టీలో చేరినప్పుడు రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన ప్రకటనలో రాహుల్, ప్రియాంక గాంధీలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.
సచిన్ పైలట్ గత నెలలో 10 రోజుల్లోనే రాహుల్ గాంధీతో మూడుసార్లు సమావేశమయ్యారు. ఆగస్టు 24 న, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి టి.ఎస్.సింగ్ దేవ్‌లు తమ మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రాహుల్ గాంధీని కలిశారు.
అటువంటి పరిస్థితిలో, పార్టీ అధ్యక్షుడిగా లేనప్పటికీ, రాహుల్ గాంధీ అదే 'పాత్ర' పోషిస్తున్నారని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
అందుకే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారా అనే సందేహం కూడా వస్తుంది
మార్పు మొదలైందా ?
''కాంగ్రెస్ పార్టీలో మార్పు కోసం రాహుల్ గాంధీ కచ్చితంగా ప్రయత్నిస్తున్నారు'' అని కాంగ్రెస్ రాజకీయాలపై అవగాహన ఉన్న సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ అన్నారు.
''పార్టీలో మార్పు గురించి రాహుల్ గాంధీ 2014 జైపూర్ సమావేశంలోనే చెప్పారు. ఆ సమయంలో ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటున్నానని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు'' అని కిద్వాయ్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల మనుషులున్నారని కిద్వాయ్ అన్నారు.
''విధేయత పేరుతో వేలాడేవారు, లేదంటే ఎన్నికల్లో గెలవని వారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు లేకపోవడం ఇందుకు ఉదాహారణ. 2014, 2019లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అందుకే రాహుల్ గాంధీ బయటి వ్యక్తులను ఆహ్వానిస్తున్నారు'' అన్నారాయన.
పార్టీలోకి కొత్త ముఖాలను, ముఖ్యంగా మహిళలను రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నారని, రాజకీయ నేపథ్యం లేని వారికి కూడా అవకాశం ఇస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షమా మొహమ్మద్ అభిప్రాయపడ్డారు.
''ప్రతి పార్టీలోనూ అసంతృప్తి, గందరగోళం, ఒడిదొడుకులు ఉంటాయి. మా పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా అసంతృప్తి వ్యక్తం చేయడానికి అవకాశం ఇస్తాం'' అన్నారు షమా మొహమ్మద్.
సీనియర్ జర్నలిస్ట్ స్మితా గుప్తా కూడా రాహుల్ గాంధీ పార్టీలో మార్పులు చేయాలనుకుంటున్నారని, చేసి తీరతారని బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కొత్త తరానికి అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయబోతున్నారని గుప్తా అన్నారు.
"పాత తరం స్థానంలో కొత్త తరాన్ని నింపాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరీందర్ సింగ్‌ను తొలగించడంలో అర్థం లేదు. కానీ, రాహుల్ గాంధీ మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది" అన్నారామె.
అయితే, ఆయన కొత్త తరాన్ని తీసుకురావాలని అనుకుంటున్నప్పటికీ, ఇటీవల పార్టీని వీడిన వారిలో చాలామంది కొత్తతరం నేతలున్నారన్నది మర్చి పోకూడదని స్మిత అన్నారు.
"రాహుల్ గాంధీ తీసుకుంటున్న ఈ మార్పు నిర్ణయాలను కొంతమంది ఇందిరాగాంధీ కాలంతో పోల్చి చూస్తున్నారు. కానీ అప్పుడు ఇందిరా గాంధీ అధికారంలో ఉన్నారన్నది గుర్తు పెట్టుకోవాలి. పార్టీ సీనియర్ నాయకుల విషయంలో ఆమె చేసిన మార్పులు, వాటికి సైద్ధాంతిక ప్రాతిపదికలు, ఇక్కడ రాహుల్ ప్రయత్నాలకు పోలిక లేదు. రాహుల్ గాంధీని ఆదర్శప్రాయుడైన నేత అనవచ్చు కానీ, సైద్ధాంతికంగా ఆయన ఎంత స్పష్టంగా ఉన్నారో తెలియదు'' అన్నారు స్మిత గుప్తా.
సీనియర్ నేతల ఆందోళన
ఇటీవలి పరిణామాలతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఆందోళన చెందుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా తమ బాధను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.
జి-23 నేతలు (సోనియా గాంధీకి లేఖలు రాసిన 23 మంది కాంగ్రెస్ నాయకులు) తమ బలమైన వాదన వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని రషీద్ కిద్వాయ్ అన్నారు.
''సోనియా గాంధీతో సమావేశంలో వారు పైకి అంతా ఓకే అంటారు. కానీ బైటికొచ్చి వేరే మాట్లాడతారు'' అన్నారు కిద్వాయ్.
సోనియా గాంధీకి జి-23 నాయకులు రాసిన లేఖను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నాయకత్వాన్ని సవాలు చేసే రాజ్యాంగపరమైన హక్కును వారు ఇంకా వినియోగించుకోలేదని కిద్వాయ్ అన్నారు.
వాళ్లంతా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అది జరగడం లేదు. ఇది వాళ్లకు నచ్చడం లేదు. వాళ్లలో రాహుల్ గాంధీకి నచ్చనిది కూడా అదేనని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.
''మీ అమ్మతో పని చేశాం, నాన్నతో పని చేశాం, నాన్నమ్మతో పని చేశామని చెప్పుకుంటున్నారు. వీళ్లంతా నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ గాంధీకి అడ్డుపడుతున్నారు'' అన్నారాయన.
రాహుల్ ప్రయత్నాలు
కాంగ్రెస్ పార్టీలో తన స్థాయిని బట్టి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్లడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని రషీద్ కిద్వాయ్ అంగీకరిస్తున్నారు.
"రాహుల్ గాంధీ ఇంతకు ముందు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రులను ఎన్నుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విరమించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రాతిపదికన కమల్‌నాథ్‌ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ,సింధియాకు కోపం వచ్చింది. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కూడా వదిలేసి వెళ్లిపోయారు. చివరకు ప్రభుత్వం కూడా పడిపోయింది. రాజస్థాన్, పంజాబ్‌లో కూడా అదే పరిస్థితి ఉంది'' అని కిద్వాయ్ చెప్పారు.
‘రాహుల్‌లో స్పష్టత లేదు’
అయితే, రాహుల్ ఇటీవల ప్రజాస్వామ్యయుత నిర్ణయాలు తీసుకుంటున్నారు అనడాన్ని స్మితా గుప్తా ఒప్పుకోవడం లేదు.
"కాంగ్రెస్ పార్టీలోని వారంతా అధ్యక్షుడు గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాలని కోరుకుంటారు. రాహుల్ గాంధీ కూడా అధ్యక్షుడయ్యారు. కానీ ఆయనే ఆ పదవిని విడిచిపెట్టారు. రెండు లోక్‌సభ ఎన్నికలు కూడా ఆయన నాయకత్వంలోనే జరిగాయి. పార్టీ ఓడిపోయినా ఆయనే అధ్యక్షుడిగా ఉండాలని నేతలు కోరుకుంటున్నారు. కానీ, ఆయన ఒప్పుకోవడం లేదు. మళ్లీ పార్టీలో అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారు. అధ్యక్షుడు కానప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు" అని స్మితా గుప్తా ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఏం చేసినా పార్టీ మంచి కోసమే చేస్తున్నారనడంలో సందేహం లేదని, కానీ ముందు ఆయన తన పాత్రను స్పష్టం చేయాల్సి ఉంటుందని రషీద్ కిద్వాయ్ అన్నారు.
అయితే, ఈ వాదనతో షమా మొహమ్మద్ విభేదిస్తున్నారు. ''బీజేపీ అధ్యక్షుడు ఎవరు? జేపీ నడ్డా. కానీ, అమిత్ షా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు'' అని ఆమె ప్రశ్నించారు.
మీడియా కూడా దీన్ని వక్రీకరించి చూపేందుకు ప్రయత్నిస్తోందని, సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలని, ఆమెకు రాహుల్, ప్రియాంకలు సహాయంగా నిలబడుతున్నారని షమా అన్నారు.
సంజయ్ అడుగుజాడల్లో రాహుల్
''సంజయ్ గాంధీ కూడా తన కాలంలో కాంగ్రెస్‌ను పూర్తిగా మార్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే పని చేస్తున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అప్పట్లో ఆయన పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు లేదు'' అన్నారు కిద్వాయ్
''యువరాజు హోదాను పూర్తిగా వినియోగించుకోవాలంటే పార్టీ అధికారంలో ఉండాలి. ఇందిరాగాంధీ సంజయ్ గాంధీకి పార్టీ పగ్గాలు ఇచ్చినప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది. రాజీవ్ గాంధీ కాలంలో కూడా అదే జరిగింది. కానీ రాహుల్ నాటికి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అలాంటప్పుడు సవాళ్లు కూడా ఉంటాయి" అన్నారు కిద్వాయ్.
కన్హయ్య కుమార్, జిగ్నేశ్ లాంటి వారిని పార్టీలోకి తీసుకోవడం లాంటివి రాహుల్ తీసుకున్న మంచి నిర్ణయాలని స్మితా గుప్తా అన్నారు. అయితే, కొన్ని మంచి నిర్ణయాల ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
"పంజాబ్‌లో చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం చేయడం ద్వారా పంజాబ్‌కు మొదటి దళిత ముఖ్యమంత్రిని అందించారు. దళితులకు ఏదో ఒకటి చేయడానికి పదవి ఇచ్చారు. కానీ, చేసే సమయం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దళితులను ఆకర్షించడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఇలాంటి నిర్ణయాలు సరైనవని రుజువు చేయడం కష్టం. ఎన్నికల ఫలితాల ద్వారానే ఇది తేలుతుంది'' అన్నారు స్మితా గుప్తా.
No comments:
Post a Comment