Tuesday, October 26, 2021

లిఫ్ట్ చేసి తెచ్చే నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా..?- ఆర్ఎస్ ప్రవీణ్

లిఫ్ట్ చేసి తెచ్చే నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా..?- ఆర్ఎస్ ప్రవీణ్

వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ అనడం తన పరిధికి మించి మాట్లాడటమేనన్నారు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మెదక్ లో పర్యటించిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి పుష్కలమైన నీరు రైతులకు అందించి ఇప్పుడు వరి వద్దంటే రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు.

కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ప్రతీ సంవత్సరం మూడు నుంచి నాలుగు వేల కరెంట్ బిల్లులు కడుతూ ఇప్పుడు వరి వేయకూడదు అంటే రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యగానే దీన్ని భావిస్తామని చెప్పారు ప్రవీణ్ కుమార్. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరలు చూపించకుండా వరి వేయకూడదు అనే ఆలోచనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో మక్కల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన… పత్తికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ మిల్లులు లేవన్నారు. చెరుకు మిల్లులు, ఫుడ్ పరిశ్రమలు లేవని చెప్పారు. కేసీఆర్ మాత్రం తన బాగు కోసం ఫాంహౌస్ లో 365 రోజులు నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టించుకున్నారని విమర్శించారు. కరీంనగర్ ముంపు గ్రామాలలో వందలాది ఎకరాలు మునిగిపోయాయని ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదని నిలదీశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

మరోవైపు ట్విట్టర్ వేదికగా కూడా విమర్శలు చేశారు ప్రవీణ్. ‘‘ముఖ్యమంత్రి మాటలు మూర్ఖంగా విని 50TMCల మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 20 గ్రామాలను ముంచేసి ప్రజలను నిర్వాసితులను చేసిన సిద్దిపేట కలెక్టర్.. ఇప్పుడు వరి విత్తనాలు అమ్మేవాళ్లను శిక్షిస్తా అంటున్నాడు. లిఫ్ట్ చేసి తెచ్చిన నీళ్లు ప్రగతి భవన్ లో పోసుకుంటారా..?’’ అంటూ ప్రశ్నించారు.

No comments:

Post a Comment