గులాబీనగరం.. రూల్స్ సామాన్యులకేనా..?
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
హైదరాబాద్ గులాబీమయంగా మారుతోంది. టీఆర్ఎస్ 20ఏళ్ల ఉత్సవం, ప్లీనరీ, విజయ గర్జన సభల నేపథ్యంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, తోరణాలే కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు దీటుగా ఎదుగుతున్న ఈ సమయంలో పార్టీ బలనిరూపణకు ఈ కార్యక్రమాలనే వేదికగా మార్చుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్. నగరంలో ఎటుచూసినా గులాబీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్ స్మైలీ ఫోటోలతో టీఆర్ఎస్ నేతలు ఇంకా బ్యానర్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి నగరంలో అనుమతులు లేకుండా ఎక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. కానీ.. ఏకంగా పెద్దపెద్ద కటౌట్లే పెడుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ కార్యక్రమాలకు అడ్డురాని రూల్స్ తమకే ఎందుకని జీహెచ్ఎంసీని నిలదీస్తున్నారు ప్రజలు. ఇంటికి టూలెట్ అని బోర్డు పెట్టుకున్నా రూ.వెయ్యి ఫైన్ వేస్తున్నారు అధికారులు. ఆఖరికి రోడ్డుపై షాపు యజమానులు పెయింటింగ్ బోర్డు అమర్చినందుకు రూ.5 వేల జరిమానా వేస్తున్న పరిస్థితి. ఇలా చెప్పుకుంటూపోతే సామాన్యుడి నడ్డి విరిచేలా ఎన్నో చలానాలు విధిస్తున్నారు. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని మండిపడుతున్నారు ప్రజలు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూటే సపరేట్. గులాబీ నేతల చేష్టలు కనిపించడం లేదా అని ట్విట్టర్ ద్వారా నిలదీస్తేనే ఫైన్స్ విధిస్తుంది. గుర్తు చేయకపోతే ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకున్నా ఎలాంటి చర్యలు ఉండవు. అదే సామాన్యుడుపై అయితే రోజుకు 400 ఫైన్స్ వేస్తున్నట్లు వెబ్ సైట్ లో కనిపిస్తోంది. రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కేవలం బోర్డులు, వాల్ పోస్టర్లు, జెండాలకే వసూలు చేస్తోంది. అక్టోబర్ 2, 2019 నుంచి అన్ లైన్ లో చెల్లింపు ప్రారంభమైంది. అప్పటి నుంచి సెప్టెంబర్ 2, 2021 వరకు 2.85 లక్షల చాలానాలు విధించారు. సగటున రూ.10 వేల చొప్పున అనుకున్నా ఈ రెండేళ్లలో రూ.285 కోట్లు వసూలు చేసినట్లే. ఇదంతా జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లోనే ఉంది. కరోనా సమయంలో కూడా చలానాలు వేశారంటే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ భవన్ లో నియోజకవర్గాల వారీగా జరుగుతోన్న సమావేశాల్లో అగ్ర నాయకులకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చినట్లు కనిపిస్తోంది. నగరమంతా గులాబీమయంగా మారాలని, ఎక్కడ చూసినా తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు కనిపించేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించినట్లుగా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, జూబ్లీ చెక్ పోస్ట్ మార్గంలో కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు ఏర్పాటు చేశారు. పలు ఏరియాల్లో అధినాయకుడి ఫొటోలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేలా ఫ్లెక్సీలు పెడుతున్నారు. బస్ షెల్టర్లు, టాయిలెట్ల యాడ్ స్పేస్ నూ టీఆర్ఎస్ పార్టీ బుక్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయగానే జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారని సమావేశాల్లో పార్టీ నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా… ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను చూసుకుంటాను హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్లీనరీ అయిపోయాక కూడా మరో మూడు రోజుల వరకు ఫ్లెక్సీలు తొలగించకుండా ఉండాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయట. దీంతో కొంతకాలంగా ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపించడం లేదన్న బాధతో ఉన్న నాయకులు ఉత్సాహాంతో వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాదిన్నరగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నా నేతలు భయపడే పరిస్థితి. పార్టీ సమావేశాలు, పాదయాత్రల సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న ఫ్లెక్సీలు, కటౌట్లను జీహెచ్ఎంసీలోని ఎన్ ఫోర్స్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ట్విట్టర్ లో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా జరిమానాలూ విధిస్తున్నారు. అయితే అధికార పార్టీ ప్లీనరీ నేపథ్యంలో నగరమంతా గులాబీమయం అవుతోంది. అయినా.. పెద్దగా చర్యలు ఏవీ లేవనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ అధికారులు లాలుచీగా వ్యవహారించడంపై మండిపడుతున్నారు ప్రజలు. తమకేమో ఇష్టం వచ్చినట్లు జరిమానాలు వేసి.. టీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రం పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు.
No comments:
Post a Comment