సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోరాటం పేరుతో ఢిల్లీ గొంతు పిసికేస్తున్నారంటూ ఆక్షేపించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం లేదా శాంతియుత దీక్ష చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కిసాన్ మహాపంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
అసలు సత్యాగ్రహం నిర్వహించడంలో రైతుల ఉద్దేశ్యం ఏమిటని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మానం ప్రశ్నించింది. ”న్యాయం కోసం మీరు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. కోర్టుపై నమ్మకం ఉంచాలి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా పోరాటాలు చేస్తాం అంటే ఎలా? అంటే న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలని అనుకుంటున్నారా? వ్యవస్థపై నమ్మకం లేదా” అని సుప్రీం నిలదీసింది. అటు ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులను దిగ్బంధించడాన్ని కూడా కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. “ఇప్పటికే ఢిల్లీ నగరం గొంతును నొక్కేశారు.. ఇప్పుడు నగరం లోపలికి రావాలని అనుకుంటున్నారు. మీరు చేసే ఆందోళనతో స్థానికులు సంతోషంగా ఉండగలరా.. ఇలాంటి చర్యలను మానుకోండి” అంటూ సుప్రీం హితవు పలికింది.
మరోవైపు రైతుల ప్రవర్తనను కూడా సుప్రీం తప్పుబట్టింది. ఆందోళనల సమయంలో రైతులు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారని … అదంతా మీడియాలో కనిపిస్తోందని సుప్రీం చెప్పుకొచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కిసాన్ మహాపంచాయత్ కౌన్సిల్ విచారం వ్యక్తం చేసింది. హైవేలు, రోడ్లను బ్లాక్ చేసింది రైతులు కాదని, పోలీసులే ఆ పని చేశారని చెప్పింది. అయితే ఇదే విషయపై రైతులు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోరింది. ఇదిలా ఉంటే గురువారం కూడా రహదారుల దిగ్బంధనంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. న్యాయపోరాటం ద్వారానో పార్లమెంటరీ చర్చల రూపంలోనే ప్రభత్వానికి తెలియజేయాలి అంతేకానీ రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని సుప్రీం స్పష్టం చేసింది.
No comments:
Post a Comment