ఓట్ల కోసం కేసీఆర్ పాట్లు.. పోలీసులతో బెదిరింపులు..?
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. ఇది సినిమా డైలాగే అయినా.. దానిలోని అర్థం చిన్న విషయం కాదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా భయంలోనే ఉన్నారు. ఆయన్ను వెంటాడుతున్న భయం పేరు హుజూరాబాద్. ఇదేం అంత ఎన్నిక కాదు.. లైట్ తీసుకున్నాం.. విజయం వన్ సైడే.. అదికూడా మావైపే అంటూ పైకి ఎన్ని కబర్లు చెప్పినా.. సర్వేలు మాత్రం షాకిస్తున్నాయి. ఆఖరికి దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సర్వేల్లో ఎలాంటి మార్పు లేదు. ఏం చేద్దామా అని ఆలోచించి కేసీఆర్ ఖాకీలను రంగంలోకి దించారని అంటున్నాయి ప్రతిపక్షాలు.
గెలుపు దారులన్నీ మూసుకుపోవడం.. రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పోలీసులతో వ్యవహారాన్ని చక్కబెడుతోందట గులాబీ గ్యాంగ్. గ్రామాల్లో గతంలో ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో లిస్ట్ తీశారని అంటున్నారు. చిన్నపాటి కేసులను కూడా వదలకుండా వాటి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ టీఆర్ఎస్ గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు ప్రతిపక్ష నేతలు. మర్డర్ కేసుల్లో కూడా మభ్యపెడుతూ.. టీఆర్ఎస్ కోసం పని చేయాలని ఒత్తడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత ప్రభుత్వ అధికారి హత్య కేసులో ప్రధాన నిండుతుడుగా ఉన్నాడు. అతడి రౌడీయిజాన్ని చూసి పార్టీ నుంచి గతంలోనే ఈటల రాజేందర్ సస్పెండ్ చేశారు. అయితే ఈటల రాజీనామా తరువాత పోలీసుల సహకారంతో మళ్లీ అతడికి వెల్ కమ్ చెప్పారట టీఆర్ఎస్ నేతలు. ఈ కేసుని వీక్ చేసేందుకే పోలీసులు అధికార పార్టీతో చేతులు కలిపారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మరో గ్రామ సర్పంచ్ భర్తపై హత్యాయత్నం కేసు ఉంది. రిమాండ్ కి వెళ్లి వచ్చాక ఈటలకి దగ్గరగా ఉన్నాడని కేసుని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. భయపెట్టి కండువా కప్పేశారు. ఇలా కేసులను అడ్డు పెట్టుకొని పోలీసులు అంతా చక్కబెడుతున్నారని అంటున్నారు బీజేపీ నేతలు. కేసు తీవ్రతను బట్టి అవసరమైతే ఈటలపై దుష్ప్రచారం వీడియోలు తయారు చేసి పెట్టాలని ఉసిగొల్పుతున్నారని చెబుతున్నారు.
మరోవైపు వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వడం లేదంట పోలీసులు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ స్టేషన్ కి పిలిచి యువతను భయపెడుతున్నారని అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. కౌన్సెలింగ్ పేరుతో టీఆర్ఎస్ లో జాయిన్ కావాలని.. లేకపోతే కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తామని బెదిరిస్తున్నారని చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప్పల్ గ్రామంలో రోడ్డు ప్రమాదానికి కారణం బాల్క సుమన్ అనుచరుడని.. తప్పతాగి ఢీ కొట్టాడని స్టేటస్ పెట్టుకుంటే సీఐ ఫోన్ చేసి స్టేషన్ కి రావాలని ఒత్తిడి తెచ్చాడట. హుజూరాబాద్ ఓటర్లు దేనికీ లొంగకపోవడంతో ఇలా పోలీసులను రంగంలోకి దింపి.. బెదిరింపులకు పాల్పడి ఓట్లు రాబట్టుకునే ప్లాన్ లో గులాబీ గ్యాంగ్ ఉందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. పోలింగ్ దగ్గర పడేకొద్దీ ఇలాంటి అరాచకాలు ఇంకా పెరిగిపోతాయని.. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శిస్తున్నాయి.
No comments:
Post a Comment