Saturday, October 2, 2021

గ ‘లీజు’ దందా.. వృద్ధ జంట గోడు వినేదెవ‌రంట‌

హైదరాబాద్ : 02/10/2021

గ ‘లీజు’ దందా.. వృద్ధ జంట గోడు వినేదెవ‌రంట‌

-లీజులో రెస్టారెంట్ పేరు.. చేసేవేమో రేవ్ పార్టీలు.

-అగ్రిమెంట్ ముగిసినా.. అడ్డగోలుగా వ్య‌వహారాలు

-వృద్ధ‌ దంప‌తుల‌ను ఇబ్బంది పెడుతున్న స‌న్ బ‌ర్న్ ఫ్రాంచైజ‌ర్

-ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌తో.. రెచ్చిపోతున్న నిర్వాహ‌కులు

సంత‌ జ‌రుగుమంటే.. ఇల్లంతా నాదే” అన్న సామెత‌ను ప్ర‌త్యక్షంగా చేసి చూపించారు ఆ అక్ర‌మార్కులు. “వ్యాపారం చేసుకుంటాం.. కాస్త చోటివ్వండి” అని ఒక‌ప్పుడు కాళ్లావేళ్లాప‌డి.. ఇప్పుడు త‌మ‌కు సాయం చేసిన వారినే కాళ్ల‌రిగేలా చుట్టూ తిప్పించుకుంటున్నారు. దీంతో శేష జీవితాన్ని సంతోషంగా గ‌డ‌పాల‌ని, అమెరికా వ‌దిలి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆ వృద్ధ దంప‌తులు.. అస‌లు తాము ఎందుకు బ‌తికి ఉన్నామా అని కుమిలిపోతూ జీవితంపై విర‌క్తి చెందుతున్నారు. లీజు గ‌డువు ముగిసినా బిల్డింగ్‌ను ఖాళీ చేయ‌కుండా.. అమాయ‌క‌ వృద్ద జంట‌ని వేధిస్తూ.. స‌న్‌బ‌ర్న్ ఫ్రాచైంజ‌ర్ సాగిస్తున్న‌ గ‌లీజు దందా ఇది.


!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 10.. ఈ పేరు విన‌బ‌డితే విలాస‌పురుషుల‌కు గుర్తొచ్చేది జూబ్లి డైన్ రెస్టారెంట్. అందులో ఉండే ప‌బ్స్. పేరుకు అవి రెస్టారెంట్, ప‌బ్బులే కానీ.. అంత‌కుమించి య‌వ్వారం సాగుతుంద‌క్క‌డ‌. చీక‌టి ప‌డితే చాలు.. ఒకదాని వెనుక ఒక‌టి కాస్ట్‌లీ కార్లు వ‌చ్చేస్తాయి. ప‌దుల సంఖ్య‌లో బౌన్స‌ర్లు పోలోమ‌ని దిగిపోతుంటారు. వీవీఐపీల కోసం కొత్త బంగారు లోకం సిద్ధ‌మైపోతుంది. రేవ్ పార్టీలు, మ్యూజిక్ మోత‌లో మునిగిపోయి వ‌చ్చిన‌ వారంతా సేద‌తీరుతుంటే… వారి ప‌ర్సుల‌ను ఖాళీ చేస్తూ, వారు ఇచ్చేకార్డుల‌ను స్మార్ట్‌గా స్వైప్ చేస్తూ నిర్వాహ‌కులు తెగ‌ ఖుషీ అవుతుంటారు. ఈ ర‌ణ‌గొణ శ‌బ్ధాల మ‌ధ్య‌.. ఎవ‌రికీ వినిపించని ఓ వృద్ధ జంట‌ రోద‌న కూడా అక్క‌డ నిత్య‌కృత్యంగా ఉంటుంది. రెస్టారెంట్ కోసం బిల్డింగ్‌ను లీజుకిచ్చిన పాపానికి తెల్ల‌వార్లూ క‌న్నీళ్లుపెడ‌తూ కూర్చునే ఉంటారు వారు. కానీ వారి ఏడుపు ఎవ‌రికీ వినిపించ‌దు. కార‌ణం.. వినేవారు, వినాల్సిన వారు కూడా ఆ నిర్వాహకుల జేబులో బొమ్మ‌లే. పోలీసులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఎవ‌రైనా స‌రే.. ఆ గ్యాంగ్ ఎలా ట్యూన్ చేస్తే అలా ప‌ల‌కాల్సిందే.

ప‌బ్ వైర‌స్‌తో మొద‌టి త‌రం సాఫ్ట్ వేర్ విలవిల

ప‌బ్ నిర్వాహ‌కులకు బలైన ఆ వ్య‌కే గాంధీ. బాంబే ఐఐటీలో సాప్ట్ వేర్ మొద‌టి బ్యాచ్. ఆమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేసి… సాఫ్ట్‌వేర్ రంగాన్ని ప‌ట్టి పీడించిన ఎన్నో వైర‌స్‌ల‌కు యాంటి వైరస్‌లు రూపొందించిన ఘ‌న‌త పొందారు. ఏళ్ల‌త‌ర‌బ‌డి ప‌నిచేసి, రిటైర్డ్ వ‌య‌స్సులో హాయిగా ఇండియాలో ఉందామ‌ని భార్య‌తో స‌హా హైద‌రాబాద్ వ‌చ్చారు. కానీ క్ష‌ణం కూడా మ‌నఃశాంతి లేకుండా పోయింది వారికి. కంప్యూట‌ర్ల‌కు యాంటీ వైర‌స్‌లు క‌నిపెట్టారు కానీ.. మ‌నుషులను ఎదుర్కోలేక ఎదురుదెబ్బ తింటున్నారు.

కాస్ట్లీ ఎరియా, త‌క్కువ అద్దె, వెన‌కా ముందు గ‌ట్టిగా ఎవ‌రూ లేని వృద్ధ దంప‌తులు.. ఇదే మంచి అవ‌కాశం అనుకున్నారు స‌న్ బ‌ర్న్ ఫ్రాంచైజ‌ర్లు సాయికిర‌ణ్ రెడ్డి, అత‌ని బావ సంతోష్ రెడ్డి . లీజ్ కోసం మొద‌ట గాంధీ కాళ్లావేళ్ల ప‌డ్డారు. మీ కొడుకు లాంటి వాడిని.. బిల్డింగ్ లీజుకు ఇచ్చి వ్యాపారానికి సాయ‌ప‌డితే జీవితాంతం త‌లుచుకుంటామ‌న్నారు నిర్వాహ‌కులు. అతి విన‌యంతో అడిగేస‌రికి స‌రే అన్నారు. 2017లో జూబ్లి డైన్ రెస్టారెంట్ కి 1550 గ‌జాల భూమి లో 1800 చ‌ద‌ర‌పు అడుగులు ఉన్న భ‌వంతిని నాలుగేళ్ల పాటు లీజుకు ఇస్తున్న‌ట్టు అగ్రిమెంట్ చేశారు. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబ‌ర్ 10 లో ఉండ‌టం వారికి బాగా క‌లిసి వ‌చ్చింది. వీవీఐపీలు క్యూ క‌ట్ట‌డంతో.. వారి అట్రాక్ట్ చేసేందుకు మెల్ల‌గా రేవ్ పార్టీలు ఏర్పాటు చేశారు. క‌ట్ చేస్తే ఒక్క రాత్రిలో వంద‌లాది కార్లు వ‌చ్చేవి. ఇంకేముంది నిర్వాహ‌కులు మ‌రింత బరితెగించారు. చుట్టుప‌క్క‌ల అంతా రెసిడెన్షియల్ ఏరియా అయినా స‌రే ప‌ట్టించుకోకుండా రోడ్లు బ్లాక్ చేయ‌డం చేస్తూ వ‌చ్చారు. రానురాను ఆగ‌డాలు శృతిమించిపోయాయి. అర్ధ‌రాత్రి న్యూసెన్స్ త‌ట్టుకోలేక స్థానికులు.. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఓన‌ర్ కి నోటీసులు ఇచ్చారు. అప్ప‌టికే రెస్టారెంట్‌ని లీజుకు తీసుకున్న‌వారు గ‌లీజ్ ప‌నులకు తెర లేపార‌ని అర్థం చేసుకున్న ఓనర్.. వారిని ఖాళీ చేయాల‌ని కోరాడు. కానీ సంపాద‌న‌కు అల‌వాటు ప‌డిన ఆ అక్ర‌మార్కులు.. ఆయ‌న మాట విన‌కపోగా.. మ‌రింత బరితెగించారు.

అనుమ‌తులు లేకుండానే 8 వేల చ‌. అ. నిర్మాణం

సాధార‌ణంగా న‌రంలో అక్ర‌మంగా చిన్న‌ కాంపౌండ్ వాల్ క‌ట్టినా వెంటనే కూల్చేస్తుంది. కానీ ఇక్క‌డ లీజుకు తీసుకున్న‌వారు ఎంత‌కు తెగించినా ప‌ట్టించుకోలేదు. 1800 అడుగుల నిర్మాణాన్ని కాస్తా.. 10 వేల అడుగులకు పెంచారు. మొద‌ట‌గా బ‌ర్త్ డే ఫంక్ష‌న్స్ కోసం ఈ షెడ్స్ వేసుకుంటామ‌ని య‌జ‌మాని గాంధీ కుటుంబాన్ని న‌మ్మించారు. ఎప్పుడంటే అప్పుడు తొల‌గించేలా నిర్మాణం చేస్తామ‌ని చెప్పారు. కానీ ఆయ‌న‌ క‌ళ్లుగ‌ప్పి అంత‌స్తుల‌కు అంత‌స్తులే లేపారు. క‌ట్ చేస్తే.. ఒక్క రెస్టారెంట్ కాస్త.. నాలుగింటికి వేదిక‌గా మారింది. ఆపై స‌న్ బ‌ర్న ప‌బ్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ఎఫైర్ ప‌బ్,టాట్ ప‌బ్, లా సోసైటి పేర్ల‌తో చీక‌టి దందాకు తెర‌లేపారు. తొలుత వీరి అక్ర‌మాల‌పై కేసులు న‌మోదు చేసిన పోలీసులు.. ఏమైందో తెలియ‌దు కొన్నాళ్ల‌కు పూర్తిగా మారిపోయారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సివిల్ మ్యాట‌ర్ , ప‌ర్మిష‌న్స్ ఉన్నాయంటూ కాకమ్మ క‌థ‌లు చెబుతున్నార‌ని స్థానికులు అరోపిస్తున్నారు. మ‌రోవైపు జీహెచ్ఎంసీ నోటీసులు ఇస్తే.. కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్టామని, కూల్చివేయ‌కుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

తొలివెలుగుతో గోడు వెళ్ల‌బోసుకున్న గాంధీ

ఈ ఏడాది జూన్‌లో లీజు గ‌డువు ముగిస్తుంది.. ఖాళీ చేయాల‌ని ఏడాది క్రితం నుంచే చెప్పుకొస్తోంది గాంధీ కుటుంబం. కానీ ఏరియా క‌లిసిరావ‌డం.. కాసుల వ‌ర్షం కుర‌వ‌డం.. ఒకే లీజుపై నాలుగు సెంట‌ర్స్ న‌డ‌వ‌డంతో నిర్వాహ‌కులకు దుర్బుద్ధి పుట్టింది. ఆపై లీజును పొడిగించుకునేందుకు అన్ని అడ్డ‌దారులు తొక్కుతూ వ‌చ్చారు. నోటి మాట‌తో గ‌డువు పొడిగిస్తా అని హామీ ఇచ్చార‌ని.. సిటి సివిల్ కోర్టులో ఇంజ‌క్ష‌న్ ఆర్ద‌ర్ తెచ్చుకున్నారు. మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటాం.. సైట్ వ‌ద్దకు ఎవ‌రూ రావ‌ద్ద‌ని ఎక్స్ పార్టీ అర్డ‌ర్ తెచ్చుకున్నారు. అన్ని త‌మ‌కు అనుకూలంగా మారాక‌.. ఇప్పుడు గాంధీ కుటుంబాన్ని బెదిరించ‌డం మొద‌లుపెట్టారు. మ‌రో 5 ఏళ్లు పొడిగింపు ఇవ్వ‌కపోతే.. 10 ఏళ్లు కోర్టు చుట్టూ తిప్పుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 10 ఏళ్లు ఇలానే ప‌బ్ న‌డుపుకుంటామ‌ని అగ్రిమెంట్ చేసుకోవాల‌ని.. బెద‌రిస్తున్నార‌ని 69 ఏళ్ల గాంధీ తొలివెలుగుతో వాపోయారు.

అల్లుడితో ఆస్ప‌త్రి పెట్టించాల‌ని కోరిక‌

గాంధీ అల్లుడు ఎయిమ్స్ ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్. అమెరికాలో మంచి పేరున్న కిడ్నీ స్పెష‌లిస్ట్. అటు త‌ల్లిండ్రులు, ఇటు అత్త‌మామ‌లు వృద్ధాప్యానికి చేరుకోవ‌డంతో.. అమెరికా నుంచి హైద‌రాబాద్ కి రావాల‌నుకున్నాడు. గాంధీ లీజుకు ఇచ్చిన హోట‌ల్ అగ్రిమెంట్ ముగిసిన త‌ర్వాత.. అక్కడ మంచి ఆస్ప‌త్రి పెట్టి సేవ‌లందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇదంతా చూసి ఆయన కూడా భ‌య‌ప‌డిపోతున్నారు. దీంతో ఆ వృద్ధ జంట‌ల‌.. న్యాయం చేయాలని కోరేందుకు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి , ఎంపీ. రంజిత్ రెడ్డిని క‌లిశారు. త‌మ‌ గోడు వెళ్ల‌బోసుకున్నారు. కానీ ప‌బ్స్ మాఫియా ముందు వారి మాట‌లు చెల్లుబాటు కాలేదు. డీసీపీకి , ఏసీపీకి ఫిర్యాదులు చేస్తే.. సివిల్ మ్యాట‌ర్ లో తాము ఎంట‌ర్ కాలేమ‌ని చేతులు ఎత్తేశారు. దీంతో ఆ పండుటాకులు తొలివెలుగుని ఆశ్ర‌యించారు. బాధితుల ప‌క్షాన నిల‌బ‌డిన తొలివెల‌గు.. ప‌బ్ య‌జ‌మాన్యానికి వాట్సాప్‌లో మెస్సెజ్ చేసి వివ‌ర‌ణ కోరింది కానీ రిప్లై లేదు.

చ‌ట్టాల్లో ఉండే చిన్న‌పాటి లొసుగుల‌ను అసరాగా చేసుకుని లీజ్ ముగిసింద‌నే విష‌యాన్ని తొక్కి పెట్టి.. ఇబ్బందుల పాలు చేస్తున్నారు సాయికిర‌ణ్ రెడ్డి, అత‌ని బావ సంతోష్ రెడ్డి . దేశం కాని దేశ‌మైనా స‌రే అమెరికాలో ఎంతో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో బ‌తికామ‌ని, కానీ తాము పుట్టిన దేశంలో పుట్టెడు క‌ష్టాలు అనుభ‌విస్తున్నామ‌ని గాంధీ దంప‌తులు కన్నీరుమున్నీరవుతున్నారు

No comments:

Post a Comment