*సీజ్ చేసిన.... తుపాకులెలా వాడారు.....?*
*దిశ'ఎన్‌కౌంటర్‌పై తొలిసారి సజ్జనార్‌ను ప్రశ్నించిన సిర్పుర్కర్ కమిషన్*
*స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేయక ముందే మీడియాకు వివరాలెలా చెప్పారు?*
*ఆయుధాలు, 'దిశ'కేసు విచారణపై పలు ప్రశ్నలు సంధించిన కమిషన్*
హైదరాబాద్: 'దిశ'ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ముందు సోమవారం హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ తరఫున న్యాయవాది కే. పరమేశ్వర్ విచారించారు.
*త్రిసభ్య కమిటీ సజ్జనార్‌ను అడిగిన ప్రశ్నలలో* *ప్రధానమైనవి*
*కమిషన్: *
నందిగామ, ఆమన్‌గల్ పోలీస్‌స్టేషన్ల సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐ)లు వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ 2019, డిసెంబర్ 3న సీజ్ చేశారని రిమార్క్స్ కాలమ్‌లో నమోదు చేశారు. కానీ, డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్‌లో ఇదే పిస్టల్‌ను వినియోగించారని తేలింది. ఇదెలా సాధ్యమైంది.?
సజ్జనార్: తనిఖీ చేశాక సమాధానం ఇస్తా.
కమిషన్: నిందితుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది 2019, నవంబర్ 29 రాత్రి 10 గం.కు అయితే.. మీరెలా 3 గంటల ముందే (7 గం.) మీడియాకు నేరం జరిగిన తీరును వివరించారు?
సజ్జనార్: 2019, నవంబర్ 29న శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ సమస్యలపై స్టడీ ఉంటే వెళ్లా. అక్కడ్నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వస్తుంటే శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. డీసీపీ కార్యాలయానికి రావాలన్నది ఫోన్ సారాంశం. అక్కడికి వెళ్లిన నాకు నిందితుల అరెస్ట్ గురించి డీసీపీ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు చెప్పమన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు మీడియాకు వివరాలను తెలియజేశా. నేను ప్రత్యేకంగా ఈ కేసును పర్యవేక్షించలేదు. మార్నింగ్ బ్రీఫింగ్‌లో పాల్గొనేవాడిని. 'దిశ'కేసుపై ఏర్పాటు చేసిన 9 బృం దాలకు శంషాబాద్ డీసీపీ నేతృత్వం వహించారు.
కమిషన్: నిందితుల కస్టడీ విచారణకు ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించారా?
సజ్జనార్: నిందితుల కస్టడీ విచారణ సమయంలో అదనపు బలగాలు కావాలని 2019, డిసెంబర్ 2న డీసీపీ అభ్యర్థిస్తే.. అదనపు డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసులను అపాయింట్ చేశా. నిందితుల తరలింపునకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆ విభాగాన్ని ఆదేశించా. డీసీపీ అభ్యర్థన మేరకే ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఆయుధాలు కేటాయించాం.
కమిషన్: ఆ 9 ఎంఎం పిస్టల్ ఎవరిది?
సజ్జనార్: ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్ నందిగామ సబ్‌ఇన్‌స్పెక్టర్ నర్సింహకు జారీచేశారు. కానీ, ఆ సమయంలో నందిగామ పీఎస్‌కు వెంకటేశ్వర్లు ఎస్‌ఐగా పోస్టింగయ్యారు. దీంతో ఆ పిస్టల్ వెంకటేశ్వర్లు చేతికి వెళ్లింది.
కమిషన్: స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ)ను ఎలా ఎంపిక చేస్తారు? వీళ్లు సీపీకి రిపోర్ట్ చేస్తారా?
సజ్జనార్: సివిల్ ఫోర్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన పోలీసులను ఎస్‌ఓటీలో నియమిస్తారు. సందర్భాన్ని బట్టి సీపీకి, స్థానిక స్టేషన్లలో రిపోర్ట్ చేస్తుంటారు.
కమిషన్: సైబరాబాద్ సీపీ పరిధిలోనూ ప్రత్యేక ఆయుధాల నమోదు రిజిస్టర్ ఉంటుందా?
సజ్జనార్: ఉంటుంది. ట్రాఫిక్, క్రైమ్ విభాగాల్లానే సైబరాబాద్ సీపీలో ఆర్మ్స్ రిజర్వ్ వింగ్ కూడా ఉంటుంది.
కమిషన్: నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్ గురించి సైబరాబాద్ సీపీ రిజిస్టర్‌లో నమోదు చేశారా?
సజ్జనార్: ఆయుధాల నమోదు ప్రక్రియకు ప్రత్యేకంగా సీఏఆర్ వింగ్ ఉంది. కొన్ని సందర్భాల్లో సీఏఆర్ నేరుగా స్టేషన్లకు ఆయుధాలను జారీ చేస్తుంది.
కమిషన్: నందిగామ, ఆమన్‌గల్ స్టేషన్లకు కేటాయించిన ఆయుధాలను చివరిసారిగా ఎప్పుడు తనిఖీ చేశారు? ఎలాంటి నిర్ధిష్టమైన విధుల కోసం ఆయుధాలను కేటాయించారు? ఆయా వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేశారా?
సజ్జనార్: ఆయుధాల జారీ, తనిఖీ అంశాలను పర్యవేక్షించడానికి అదనపు డీసీపీ, సీఏఆర్ నేతృత్యంలో ప్రత్యేక వింగ్ ఉంది.
కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో షాద్‌నగర్ ఏసీపీ వీ. సురేందర్‌తో సమావేశమయ్యారా?
సజ్జనార్: కాలేదు.
కమిషన్: 2019, డిసెంబర్ 1న రాత్రి సమయంలో శంషాబాద్ డీసీపీ కాన్ఫరెన్స్ హాల్‌లో మీరు సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేశారు. దీనిపై మీరేమంటారు?
సజ్జనార్: లేదు, ఇది జరిగింది 2019, నవంబర్ 30న.
కమిషన్: అంటే.. ఈ ఎంట్రీ తప్పంటారా?
సజ్జనార్: దీనికి సురేందరే సమాధానం చెప్పాలి.
కమిషన్: ఎస్కార్ట్ పోలీసులకు 6 పొడవైన ఆయుధాలను కేటాయించే ముందు వాటి అవసరం ఏముందని ప్రశ్నించారా?
సజ్జనార్: లేదు, శంషాబాద్ డీసీపీ కోరితేనే జారీచేశా.
కమిషన్: గతంలో మీరెప్పుడైనా అత్యాచారం, హత్య కేసుల్లో ఎస్కార్ట్ డ్యూటీ పోలీసులకు ఇలాంటి ఆయుధాలను జారీ చేశారా?
సజ్జనార్: ఒకసారి తనిఖీ చేసుకొని సమాధానమిస్తా.
కోర్టుకు హాజరుకాకుండానే కస్టడీకి అనుమతి..
'దిశ'నిందితులు మహ్మద్ ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదని అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ షాద్‌నగర్ పీ.శ్యాంప్రసాద్.. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల భౌతిక హాజరు అత్యవసరమని తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 2న మధ్యాహ్నం సమయంలో పోలీసులు నిందితుల కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, అదే రోజు సాయంత్రం అనుమతి ఇచ్చామని తెలిపారు. అలాగే నిందితుల పంచనామాలు, సాకుల స్టేట్‌మెంట్లు కూడా తనకు సమర్పించలేదని, తహసీల్దార్‌కు సమర్పించారని స్పష్టం చేశారు.
తహసీల్దార్ రిమాండ్ రిపోర్ట్‌ను అనుసరించే పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చానని వివరించారు. కాగా.. ఈ కేసులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిందితులను 7 రోజుల కస్టడీకి అనుమతించగా.. పోలీసులు 15 రోజులు కస్టడీలో ఉంచుకున్నారన్నారు. చర్లపల్లి జైలర్ నిందితుల సంతకాలను అటాచ్ చేశాడు కాబట్టి.. తాను ఆ సంతకాలను నిర్ధారించుకోలేదని కమిషన్‌కు తెలిపారు. నిందితుల తరఫు నుంచి తనకి ఎలాంటి న్యాయపరమైన సలహా లేదా కస్టడీని వ్యతిరేకిస్తూ దరఖాస్తు అందలేదని వెల్లడించారు.
*link Media ప్రజల పక్షం🖋️*
No comments:
Post a Comment