Sunday, October 24, 2021

అక్రమార్కులకు GHMC....జలక్ అనుమతి లేని భవనాలకు... ఉచిత నీరు బంద్.....!

హైదరాబాద్ : 24/10/2021

*అక్రమార్కులకు GHMC....జలక్ అనుమతి లేని భవనాలకు... ఉచిత నీరు బంద్.....!*

హైదరాబాద్‌: అక్రమ భవనాలకు జలమండలి షాక్‌ ఇచ్చింది.నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా నిర్మించిన భవనాలు, ఇళ్లకు ఉచిత నీటి పథకం వర్తింపచేయకూడదని నిర్ణయించింది. త్వరలో ఈ భవనాలకు కూడా నీటి బిల్లులు జారీ కానున్నాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. 40 గజాల్లో సైతం మూడు, నాలుగు అంతస్తులు వేస్తున్నారు. స్థానిక అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. కింద నుంచి పైవరకు ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి అక్రమ భవనాలకు నీటి కనెక్షన్ల విషయంలో జలమండలి కఠినంగా వ్యవహరిస్తోంది. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం, లేదంటే 7 మీటర్ల ఎత్తు(జీప్లస్‌1 కంటే ఎక్కువ) నిర్మించే భవనాలకు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. ఒకవేళ ఆక్సుపెన్సీ లేని ఇళ్లు, భవనాలకు నీటి కనెక్షన్‌ జారీ చేయాలంటే మూడురెట్లు నీటి బిల్లులు చెల్లించాలని నిబంధన విధించింది. తాజాగా గ్రేటర్‌ వ్యాప్తంగా ఉచిత తాగునీటి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 6 లక్షల కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. మరో 3 లక్షల ఇళ్లు ఇంకా నమోదు కావాల్సి ఉంది. నమోదు గడువు ముగియడంతో పథకానికి అనర్హులైన వారికి బిల్లులు జారీ చేసేందుకు జలమండలి రంగం సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో ఆక్సుపెన్సీ లేని భవనాలకు బిల్లుల రూపంలో షాక్‌ ఇవ్వనుంది. తమకు కూడా ఉచిత పథకం అమలు చేయాలని పెద్దఎత్తున ఒత్తిడిలు వచ్చినా సరే.. అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు.
60-70 వేల భవనాలకు నో..
గ్రేటర్‌ వ్యాప్తంగా ఆక్సుపెన్సీ లేని భవనాలు, ఇళ్లు 60-70 వేల వరకు ఉన్నట్లు జలమండలి చెబుతోంది. ఇవి అక్రమ కట్టడాల కిందకు చేరడంతో ఉచిత నీటికి కూడా అనర్హులుగా తేల్చింది. ఆధార్‌తో అనుసంధానం చేసుకునే క్రమంలో ఇలాంటి వాటికి చెక్‌ పెట్టింది. వీరు ఇక నుంచి మూడు రెట్లు నీటి బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది నవంబరు వరకు దాదాపు ఏడాది బిల్లులు త్వరలో ఒకేసారి జారీ చేయనున్నారు. భారీ అపార్ట్‌మెంట్లు, భవంతులకు రూ.లక్షల్లోనే బిల్లులు అందనున్నాయి. గతంలో జలమండలి సిబ్బందితోపాటు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు నీటి బిల్లులను ఇంటింటికి అందించేవి. ఇందుకు ఏటా రూ.15-20 కోట్లు కమీషన్‌ కింద పోయేది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఉచిత నీటి పథకం అమల్లోకి రావడంతో ప్రైవేటు ఏజెన్సీల అవసరం తగ్గిపోయింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏజెన్సీలను తొలగించి ఆ బాధ్యతలు జలమండలి సిబ్బందికే అప్పగించనున్నారు. ప్రతి మూడు నెలలకోసారి రీడింగ్‌ పరిశీలించి బిల్లులు జారీ చేయనున్నారు. నెలకు 20 వేల లీటర్ల చొప్పున్న మూడు నెలలకు 90 వేల లీటర్ల వరకు వాడుకుంటే ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కమర్షియల్‌ నల్లాలకు మాత్రం నెలనెలా బిల్లులు పంపిణీ చేయనున్నారు

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment