ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాపర్ తమ వాడేనంటూ శ్రీచైతన్య, నారాయణ సంస్థల ప్రకటనలు, అసలు మృదుల్ అగర్వాల్ ఎక్కడ చదువుకున్నారు?
- బళ్ల సతీష్
- బీబీసీ ప్రతినిధి BBC న్యూస్ తెలుగు సౌజన్యంతో!!
రాజస్థాన్‌కి చెందిన మృదుల్ అగర్వాల్‌కి ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొదటి స్థానం వచ్చింది. అతను తమ విద్యార్థే అనేలా శ్రీచైతన్య సంస్థ ప్రకటనలు ఇచ్చింది.
అందులో శ్రీచైతన్య సంస్థ ఇచ్చిన కోటు వేసుకుని మృదుల్ ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. అతని పేరు కింద మాత్రం చిన్నగా కనిపించీ కనిపించకుండా ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాశారు శ్రీచైతన్య వారు.
మృదుల్ అగర్వాల్ తమ విద్యార్థే అంటూ నారాయణ కాలేజీ కూడా ప్రకటన వేసింది.
రెండు ప్రకటనల్లో ఒకచోట శ్రీచైతన్య వారు రాసినట్టు కనీసం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ వంటి పదాలు కూడా రాయలేదు.
మరోచోట మాత్రం కనిపించీ కనిపించకుండా ఆన్‌లైన్ స్టూడెంట్ అని రాశారు. నేరుగా తమ దగ్గరే చదువుకున్న విద్యార్థి అనే అర్థం వచ్చేలా నారాయణ ప్రకటన కనిపిస్తుంది.
ఇక ఫిట్‌జీ సంస్థ అయితే మృదుల్ తమ సంస్థలో చదివినందుకు కృతజ్ఞతగా రాసిన లేఖను ఉన్నదున్నట్టు ప్రచురిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆ లేఖలో మృదుల్ చేతిరాత, సంతకం కూడా ప్రచురించారు.
ఇక అలెన్ సంస్థ మృదుల్‌తో ఒక వీడియో యాడ్ రూపొందించింది.
ఆ యాడ్స్ చూసినప్పుడు ఆ అబ్బాయి అసలు ఏ కాలేజీలో చదివాడో అర్థం కావడం లేదు.
తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చూస్తే ఈ ఏడాది ఐఐటి ప్రవేశ పరీక్షలో టాపర్ కనీసం నాలుగు కాలేజీల్లో చదివినట్టు అర్థమవుతుంది. ఒక
విద్యార్థి అన్ని కాలేజీల్లో ఎలా చదువుతాడు? నిజంగా అతను నాలుగు కాలేజీల్లో చదివాడా? లేక ప్రతీ కాలేజీ టాపర్ తమవాడేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయా?
తన ర్యాంకు వచ్చినప్పుడు మృదుల్ అగర్వాల్ ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టారు. అందులో తనకు నాలుగేళ్ల పాటూ చదువు పరంగానూ, ఇతరంగానూ మద్దతునిచ్చిన అలెన్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు.
అలెన్ కాకుండా మరో సంస్థ, కాలేజీ పేరును మృదుల్ ప్రస్తావించలేదు. శ్రీ చైతన్య, నారాయణ, ఫిట్‌జీ సంస్థల గురించి మాట వరుసకు కూడా అందులో ప్రస్తావించలేదు.
కానీ ప్రకటనల్లో మాత్రం ఆయా సంస్థల కోటు వేసుకుని, వాళ్ల లోగోల ముందు నుంచుని మృదుల్ ఫోజులు ఇచ్చారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కుమార్ ట్విటర్‌లో ప్రశ్నలు లేవనెత్తారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కుమార్ ట్విటర్‌లో ప్రశ్నలు లేవనెత్తారు.
"విజయాలకు చాలా మంది బాధ్యులుంటారు, అపజయమే అనాథ" అనే అర్థం వచ్చేలా ఉన్న ఇంగ్లిష్ సామెత పెట్టారు.
ఈ సంస్థలు సిగ్గులేకుండా మృదుల్ అగర్వాల్ విజయాన్ని చూపించి జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారని ఆరోపించిన ఆయన, శ్రీచైతన్యకు యాడ్స్ చేస్తోన్న అల్లు అర్జున్‌కి ఈ విషయం తెలుసా'' అంటూ ప్రశ్నించారు.
నిజానికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ పనులు చేస్తూనే ఉన్నాయి.
ఇదే విషయమై బీబీసీ మృదుల్ అగర్వాల్‌తో మాట్లాడింది. తాను నాలుగేళ్లు అలెన్‌లో మాత్రమే చదువుకున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు.
అయితే ఫిట్‌జీ సంస్థ వారి ఇంటెన్సివ్ క్లాస్‌రూం శిక్షణ తీసుకున్నట్టు వివరించారు. అదికూడా 2021 ఫిబ్రవరి తరువాత ఫిట్‌జీ వారి టెస్ట్ అటెండ్ అవడంతో పాటూ వారు ఇచ్చే ఇంటెన్సివ్ క్లాస్ రూమ్ శిక్షణ తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
అయితే తాను శ్రీచైతన్య, నారాయణల్లో మాత్రం ఎలాంటి శిక్షణా తీసుకోలేదనీ, వారి కాలేజీల్లో చదవలేదనీ చెప్పారు మృదుల్.
కేవలం ఆ రెండు సంస్థలూ నిర్వహించిన టెస్ట్ సిరీస్ (మాక్ టెస్టులు వంటివి)లో మాత్రమే పాల్గొన్నట్టు వివరించారు. వారి టెస్టుల్లో పాల్గొనడం తప్ప వారి క్లాసులకు ప్రత్యక్షంగా కానీ, ఆన్‌లైన్‌లో కానీ హాజరు కాలేదని బీబీసీతో స్పష్టంగా చెప్పారు మృదుల్.
మృదుల్ కేవలం టెస్టుకు మాత్రమే హాజరయ్యారు. శ్రీచైతన్య యాజమాన్యం మాత్రం ఆన్‌లైన్ టెస్టుకు హాజరయ్యాడు కాబట్టి ఆన్‌లైన్ స్టూడెంట్ అని చూసేవారు నమ్మేలా ప్రకటనలు ఇచ్చింది.
దీనిపై అలెన్ సంస్థ ప్రతినిధి బీబీసీతో మాట్లాడారు.
రాజస్థాన్ రాష్ట్రం కోట నగరానికి చెందిన అలెన్ సంస్థ తమ జైపూర్ క్యాంపస్‌లో మృదుల్ చదివినట్టు వివరించింది. మృదుల్ నాలుగేళ్ల పాటూ తమ కాలేజీలో తమ క్యాంపస్‌లో రోజూ తరగతి గదికి వచ్చి చదువుకున్న విద్యార్థి అనీ, దానికి సంబంధించిన అన్ని ఆధారాలూ తాము చూపించగలమనీ ఆ సంస్థ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
అయితే మిగతా సంస్థలు మృదుల్ గురించి చెబుతోన్న మాటలపై తాము స్పందించలేమని వివరించారు.
''మృదుల్ మా విద్యార్థి. అది నిజం. ఎలా కావాలంటే అలా నిరూపించగలం. నాలుగేళ్లు మా కాలేజీకి వచ్చి చదువుకున్నాడు. ఇక మిగతా వాళ్ల గురించి మేం మాట్లాడబోము'' అని బీబీసీతో అన్నారు ఆ సంస్థ అడ్మిన్ అధికారి.
అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మృదుల్ కలిసినప్పుడు అలెన్ యూనిఫాం వేసుకున్నాడు. అలెన్ ప్రతినిధులతో కలిసే రాజస్థాన్‌కే చెందిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వీడియో కాల్ మాట్లాడారు.
సాధారణంగా తమ విద్యార్థికి ర్యాంకులు వస్తే వారిని రెండు రాష్ట్రాల రాజకీయ పెద్దల వద్దకు తీసుకొచ్చే కాలేజీలు మాత్రం మృదుల్ విషయంలో ఆ పని చేయలేదు.
మరోవైపు ఈ అంశంపై తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రైం పోలీసులతో పాటూ, విద్యా శాఖ మంత్రికి, కార్యదర్శికి కూడా ఫిర్యాదులు అందించారు. ఈ ప్రకటనలతో పాటూ మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై విచారణ జరపాలని వారు కోరారు.
"ఈ ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. అవి మోసం అని. వారు కోట్లాది మంది పౌరుల్నీ, తల్లిదండ్రులనూ తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మోసం చేస్తున్నారు. వారిలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ప్రతీ ఏటా ఇదే జరుగుతోంది. దీనిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిలో భాగస్వామ్యం అయితే విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకుండా, మిగిలిన వారిపైనైనా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆపకపోతే వీరి తప్పుడు ప్రచారాల వల్ల పేరెంట్స్ మోసపోయే ప్రమాదం ఉంది'' అని వ్యాఖ్యానించారు టిఎస్టిసిఎ అధ్యక్షులు సంతోష్.
అసలు ఎలా జరుగుతుంది?
ఇలా విద్యార్థులను చాలా కార్పొరేట్ సంస్థలు తమ దగ్గర చదువుకున్న విద్యార్థులుగా చెప్పుకోవడానికి పెద్ద ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది.
విద్యా రంగ వ్యవహారాలు సుదీర్ఘం కాలం కవర్ చేసిన ఒక సీనియర్ విలేఖరి ఈ విషయంలో ఆసక్తికర అంశాలు బీబీసీతో పంచుకున్నారు. చట్ట ప్రకారం ఎక్కడా ఇబ్బంది రాకుండా ఎలా ప్లాన్ చేస్తారో వివరించారు.
"జేఈఈ మొదటి పరీక్షలో దేశవ్యాప్తంగా టాప్ వచ్చిన వారి వివరాలు సేకరిస్తారు. వారందరి పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసుకుంటారు. ఎవరెవరి ద్వారా వారిని సంప్రదిస్తే వారు మాట వింటారో చూసుకుంటారు"
"దాంతో పాటూ వారి కుటుంబ సభ్యులకు ముందుగానే డబ్బు ముట్ట చెబుతారు. ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టడానికి కూడా కొందరు ఏజెంట్లు ఉంటారు. వారు తల్లిదండ్రులతో, ఫ్యాకల్టీతో మాట్లాడతారు. ఫలితాల రావడానికి ముందే టాప్ వచ్చే అవకాశం ఉన్న విద్యార్థులతో షూటింగ్ పూర్తి చేస్తారు. అంటే వారికి తమ కాలేజీ కోటు వేసి, తమ కాలేజీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలా ఫోటోలు తీసి, వీడియోలు కూడా రికార్డు చేయిస్తారు"
"అంతే కాకుండా తమ కాలేజీలో ఏదో ఒక చిన్నదో పెద్దదో కోర్సు చేసినట్టుగానో లేదా పరీక్షలకు హాజరయినట్టుగానో కొన్ని రికార్డులు తయారు చేయించి సంతకాలు పెట్టిస్తారు. తల్లిదండ్రులకు ఊహించనంత డబ్బు ఇస్తారు. దీంతో ఎక్కడా సమస్య లేకుండా చేసుకుని, ఎవరు ఫస్ట్ వస్తే వారి పేరుతో ప్రకటనలు ఇచ్చేస్తారు. మీరు గమనిస్తే గతేడాది నీట్ పరీక్ష టాపర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది'' అని బీబీసీతో చెప్పారు ఆ రిపోర్టర్.
ఈ ఆరోపణలపై శ్రీచైతన్య సంస్థ ప్రతినిధులు బీబీసీతో మాట్లాడారు.
''అసలు సంబంధం లేని విద్యార్థిని మేమెప్పుడూ ప్రకటించుకోము. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు తాము చదివే పాఠశాలతో పాటూ అదనంగా వేర్వేరు కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయా కాలేజీల్లో ఉన్న కోర్సులను బట్టి వారు రోజూ కాలేజీకి ఒక చోట వెళ్తారు. అదనపు శిక్షణ మరోచోట తీసుకుంటారు. అలా మా దగ్గర అదనపు శిక్షణ తీసుకున్న వారివే మేం ప్రచురిస్తాం'' అని సమాధానం ఇచ్చారు శ్రీచైతన్య కళాశాలల డీన్ కుమార్.
అయితే మృదుల్ అగర్వాల్ కేసును ఉదాహరణగా బీబీసీ ప్రస్తావించినప్పుడు, అతను తమ దగ్గర ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాడని, అందుకే అతని పేరు ప్రకటించుకున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం చెబుతోంది.
టెస్ట్ సిరీస్ అంటే మాక్ టెస్టులకు హాజరవడం. రోజూ వారీ తరగతులకు కానీ, శిక్షణకు కానీ హాజరయినట్టు కాదు. కానీ ప్రకటనల్లో మాత్రం తమ దగ్గరే చదువుకున్నాడన్న పద్ధతిలో ప్రకటనలు ఇస్తున్నాయి ఈ సంస్థలు.
దీనిపై నారాయణ, ఫిట్‌జీ సంస్థలు స్పందించాల్సి ఉంది.
No comments:
Post a Comment