Wednesday, October 6, 2021

బతుకమ్మపండుగ, తెలంగాణా సాంస్కృతిక చిహ్నం .. తొమ్మిది రోజుల పూల సంబరం; విశిష్టత ఇదే!!

హైదరాబాద్ : 06/10/2021

బతుకమ్మపండుగ, తెలంగాణా సాంస్కృతిక చిహ్నం .. తొమ్మిది రోజుల పూల సంబరం; విశిష్టత ఇదే!!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ.

తొమ్మిది రోజుల పాటు సాగే పూల ఉత్సవం బతుకమ్మ

ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిదిరోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ, అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు.

బతుకమ్మ పూలకు ప్రత్యేకతలెన్నో

బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోక బంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు గుమ్మడి, గులాబీ, పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసిన బతుకమ్మలను తీసుకొని ఆలయాలలో, వీధులలో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంబరాలలో పాలుపంచుకుంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటా

తొమ్మిదిరోజుల బతుకమ్మ వేడుకలు .. నైవేద్యాలు

ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. అటుకులు, పప్పు, బెల్లం తో నైవేద్యం తయారు చేసే అమ్మవారికి నివేదిస్తారు. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి గౌరీ దేవికి సమర్పిస్తారు. నాలుగవ రోజు నానుబియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. నానబెట్టిన బియ్యం, బెల్లం ,పాలు కలిపి నైవేద్యం తయారుచేసి అమ్మవారికి నివేదించి వేడుక చేసుకుంటారు. ఇక ఐదవ రోజు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అట్లను, దోసెలను పెట్టి పూజిస్తారు. ఆరవ రోజు బతుకమ్మను జరుపుకోరు. ఆరోజు అలిగిన బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్లీ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్లలా బియ్యంపిండిని చుట్టి, వాటిని బాగా వేయించి, వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేసి అమ్మవారికి నివేదిస్తారు.తొమ్మిదవ రోజు చివరగా అత్యంత ముఖ్యమైన సద్దుల బతుకమ్మ ను జరుపుకుంటారు. ఆశ్వయుజ అష్టమి నాడు,అంటే దుర్గాష్టమి నాడు ఐదు రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రక రకాల తృణధాన్యాలను వినియోగిస్తారు.

No comments:

Post a Comment