ఐఎఫ్‌ఎస్‌లో ప్రసాద్‌రెడ్డికి 4వ ర్యాంక్
- 88వ ర్యాంక్ సాధించిన హైదరాబాదీ
- ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు అండగా రాచకొండ సీపీ
- డీఏఎఫ్ అప్లికేషన్ టు ఇంటర్వ్యూ దాకా శిక్షణ
- 31 మంది ఐఎఫ్‌ఎస్ విజేతల గెలుపులో కీలక పాత్ర
హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఫలితాల్లో మంచిర్యాలకు చెందిన కేఏవీఎస్ ప్రసాద్ రెడ్డి ఆలిండియా 4వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రసాద్‌రెడ్డి తండ్రి సింగరేణిలో మైనింగ్ ఓవర్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన శివశంకర్ 88వ ర్యాంక్ సాధించారు. శివశంకర్ పాఠశాల విద్యను అనంతపూర్ జిల్లా గుత్తిలో పూర్తిచేశారు. వారి కుటుంబం వలస వచ్చి హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో స్థిరపడింది. తల్లి నాగరత్నమ్మ గృహిణి, తండ్రి భాస్కర్‌నాయుడు దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
సివిల్స్ మార్గదర్శి.. మహేశ్ భగవత్
సివిల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చేందుకు అభ్యర్థులకు తనవంతు సహాయం అందిస్తూ, ఎంతోమందిని విజేతలుగా నిలుపుతున్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. సివిల్స్ సాధించాలన్న వేలాది మందికి మార్గదర్శి అయ్యారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా వందలాది మందికి గైడెన్స్ ఇస్తున్న ఆయన.. తాజాగా, 31 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) సాధించటంలో కీలకపాత్ర పోషించారు. యూపీఎస్సీ పరీక్షల్లో విజేతగా నిలవాలంటే ముందుగా డీఏఎఫ్ దరఖాస్తు కీలకం. అందులో వివరాలు సరిగ్గా నింపితే సగం పరీక్షను గెలిచినట్టే. దరఖాస్తులో అభ్యర్థి విద్యాభ్యాసం నుంచి పోస్టింగ్ వరకు అన్ని అంశాలను తప్పు లేకుండా నింపాలి. దాన్ని నింపాలంటే సగంమంది అభ్యర్థులు వణికిపోతారు. అలాంటి వారికి మెలకువలు నేర్పిస్తూ, ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దారాయన. శుక్రవారం విడుదలైన ఐఎఫ్‌ఎస్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన 89 మందిలో 31 మంది మహేశ్ భగవత్ దగ్గర శిక్షణ తీసుకొన్నవారే. ఈ పరీక్ష కోసం సీపీ మహేశ్ భగవత్.. తనకు తెలిసిన ఐఎఫ్‌ఎస్ అధికారి రమేశ్ పాండే, ఐఆర్ నిపుణుడు వైలేంద్ర దియోలంకర్, మున్సిపల్ శాఖ జాయింట్ కమిషనర్ సమీర్, మహారాష్ట్ర సీఎంవో కార్యదర్శి వికాస్ ఖర్గే సహా మరింతమంది ఐఎఫ్‌ఎస్ అధికారులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అభ్యర్థులకు మెంటర్‌గా ఉన్నారు. అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఆ గ్రూపులో పాఠాలు నేర్చుకొన్న కేఏవీఎస్ ప్రసాద్‌రెడ్డి ఆలిండియా 4వ ర్యాంక్ సాధించారు. మొత్తం టాప్ 10లో 4, 6, 9వ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు మహేశ్ భగవత్ వద్ద శిక్షణ తీసుకొన్నవారే.
వారి కష్టం గెలవాలి
సివిల్స్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఏండ్ల కొద్దీ కష్టపడతారు. ఇంటర్వ్యూకు వచ్చేసరికి తెలియని కలవరం మొదలవుతుంది. ఆ సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే వాళ్ల గెలుపు సులువవుతుంది. అందుకే సివిల్స్ అభ్యర్థులకు తోడుగా ఉంటున్నా. నాతోపాటు కలిసి వచ్చిన ఇతర ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభ్యర్థుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం. ఇది సక్సెస్ అయ్యింది. ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రతి సివిల్స్ విజేత మరొకరికి ఆదర్శంగా నిలవాలి.
– మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్
No comments:
Post a Comment