• భూమికా రాయ్
  • బీబీసీ ప్రతినిధి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ
ఫొటో క్యాప్షన్,

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ

బ్యూరోక్రసీకి సంబంధించి దేశంలోని పోలీసు అధికారుల ప్రవర్తనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

''బ్యూరోక్రసీపై, మరీ ముఖ్యంగా పోలీసులు వ్యహరిస్తోన్న తీరుపై నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి'' అని ఒక పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యూరోక్రాట్లు, ప్రత్యేకంగా పోలీసు అధికారులపై నమోదైన ఫిర్యాదులను విచారించడానికి ఒక స్టాండింగ్ కమిటీ ఏర్పాటును కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్,HINDUSTAN TIMES

ఏ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి రమణ ఈ వ్యాఖ్యలు చేశారు?

లైవ్ లా ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జీందర్ పాల్ సింగ్ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల్లో రక్షణ కల్పించాలని గుర్జీందర్ ఈ పిటిషన్‌లో కోర్టును కోరారు.

గుర్జీందర్ పాల్ సింగ్‌పై దేశద్రోహం, దోపిడీ, అక్రమాస్తులు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఆయన పిటిషన్‌ను విచారించిన బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లి కూడా ఉన్నారు.

''ఇది చాలా విచారించదగిన పరిస్థితి. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పడు, పోలీసు అధికారులంతా ఆ పార్టీ వెంటే ఉంటారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడతారు. ఇదో కొత్త ట్రెండ్‌గా మారింది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది'' అని పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

బ్యూరోక్రాట్లు, పోలీసులపై ఫిర్యాదులను విచారించేందుకు ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కమిటీకి ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నేతృత్వం వహిస్తారని చెప్పారు.

పోలీసు శాఖ

ఫొటో సోర్స్,HINDUSTAN TIMES

పోలీస్ శాఖ, రాజకీయ ప్రభావం

''ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగా లేవనేది పూర్తిగా నిజం'' అని చీఫ్ జస్టిస్ రమణ వ్యాఖ్యలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్ విభూతి నారాయణ్ రాయ్ అన్నారు.

''చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలన్నీ నిజమైనవే. కొన్ని ఉదాహరణల ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో విచారకరమైన పరిస్థితులు ఉన్నాయని, వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన అనడం పూర్తిగా సమంజసమే'' అని నారాయణ్ మద్దతు పలికారు.

స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదని నారాయణ్ అన్నారు. ''పోలీస్ శాఖ అభివృద్ధి కోసం ఇప్పటికే అనేక కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ప్రభుత్వానికి ఇవి సిఫార్సులను పంపిస్తాయి. కానీ అవి అమలు కావు'' అని వ్యాఖ్యానించారు.

''కమిటీ ఏర్పాటు చేయడం గురించి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆలోచించారు. ఒకవేళ ఆ కమిటీ ఏర్పాటు చేయడం వల్ల ఏదైనా మెరుగుదల కనిపిస్తే... అది పోలీస్ శాఖతో పాటు దేశానికి కూడా చాలా మంచిది'' అని అభిప్రాయపడ్డారు.

''రాజకీయ నాయకుల ప్రభావంపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగానూ ఖండించలేం. ఎందుకంటే అవినీతి పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. అవినీతిపరుడైన ఒక రాజకీయ నాయకుడికి మరో అవినీతిపరుడైన పోలీసు అధికారి అవసరం ఉంటుంది. అలాగే పోలీసు అధికారికి కూడా తనలాంటి రాజకీయ నాయకుడు అవసరం.''

చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల గురించి మేం చాలా మంది పోలీసు అధికారులతో మాట్లాడాం. వారంతా కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై రెండో ఆలోచన చేయడం, అసమ్మతి వ్యక్తం చేయాల్సిన అవసరమే లేదని ధ్రువీకరించారు.

పోలీస్ లైన్

ఫొటో సోర్స్,HINDUSTAN TIMES

రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను పాటిస్తే, సంస్కరణలు కష్టమేం కాదు

''పోలీసు అధికారుల గురించి చీఫ్ జస్టిస్ చేసిన ప్రతీ వ్యాఖ్యను నేను పూర్తిగా అంగీకరిస్తున్నా'' అని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ అన్నారు.

''కమిటీ ఏర్పాటు గురించి చీఫ్ జస్టిస్ మాట్లాడారు. కానీ అంతకుముందే సుప్రీం కోర్టు దాని ఉత్తర్వులలో పోలీసు శాఖను సంస్కరించడానికి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది'' అని ఆయన అన్నారు.

ఇదే అంశంపై, 2006లో తాను కూడా ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశానని ప్రకాశ్ సింగ్ గుర్తు చేసుకున్నారు.

''పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ వాటిని కింది స్థాయిలో ఎవరూ ఆచరించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ ఆదేశాలను సరిగా అమలు చేయలేదు. కొన్ని రాష్ట్రాల్లో వాటిని అమలు చేసినప్పటికీ, సరిగా పాటించలేదు.''

''ఇటువంటి పరిస్థితుల్లో కొత్త కమిటీ ఏర్పాటు గురించి ఆలోచించడం కంటే కూడా, సుప్రీం కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం ఉత్తమం. పోలీసు శాఖను మెరుగుపరిచేందుకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాలి'' అని ఆయన వివరించారు.

పోలీసు శాఖతో పాటు ప్రతీ విభాగంలోనూ రాజకీయ ప్రభావం గురించి ప్రకాశ్ సింగ్ చెప్పారు.

''రాష్ట్రంలో ప్రభుత్వాలు మారగానే పోలీసు అధికారులతో పాటు బ్యూరోక్రాట్లు బదిలీ అవుతారు. ఎందుకంటే గత ప్రభుత్వంతో సన్నిహితంగా నడుచుకున్న పోలీసు అధికారితో తమకు అవసరం లేదని రాజకీయ నాయకులు భావిస్తుంటారు'' అని ఆయన పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్,NURPHOTO

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల్లో తీవ్రత

''భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని'' సుప్రీం కోర్టు లాయర్ రెబెక్కా జాన్ అభిప్రాయ పడ్డారు.

పోలీసు అధికారులపై తీవ్రమైన అభియోగాలున్న అనేక కేసులు చీఫ్ జస్టిస్ దృష్టికి వచ్చాయని, వాటి ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నట్లు రెబెక్కా అన్నారు.

'' భారత్‌లో 'అధికారం' అనేది కొన్ని డిపార్ట్‌మెంట్‌లు, కొందరు అధికారులకు మాత్రమే పరిమితం. కాబట్టి వారు కచ్చితంగా జవాబుదారీగా ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిదేదీ లేదు. అందుకే చాలా సార్లు, చాలా కేసుల్లో పోలీసు అధికారులు, బ్యూరోక్రాట్లు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు'' అని ఆమె వివరించారు.

ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఒకవేళ పోలీసు అధికారులపై, బ్యూరోక్రాట్లపై స్వతంత్రంగా దర్యాప్తు జరిపే కమిటీని ఏర్పాటు చేసినట్లయితే, వ్యవస్థలో జవాబుదారీతనం కూడా వస్తుంది.

మనీష్ గుప్తా అనుమానస్పద మృతి

పోలీసుల చర్యలను ప్రశ్నిస్తోన్న ఇటీవలి ప్రముఖ కేసులు

అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసుల ఏకపక్ష, అనాగరిక ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో చీఫ్ జస్టిస్ ఈ ప్రకటన చేశారు.

గోరఖ్‌పూర్ జిల్లాలోని ఓ హోటల్‌లో, కాన్పూర్ వ్యాపారవేత్త మనీష్ గుప్తా అనుమానస్పద మృతికి సంబంధించి ఆరుగురు పోలీసులపై హత్యకేసు నమోదైంది.

గోరఖ్‌పూర్ పోలీసుల బృందం సాధారణ తనిఖీల కోసం మధ్యాహ్నం 12 గంటలకు హోటల్‌కు చేరుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మనీష్ గుప్తాపై పోలీసులు దాడి చేయడంతో ఆయన మరణించారు.

అయితే, పోలీసులపై ఈ రకమైన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు.

ఢిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్,AFP GETTY

అంతకుముందు, 2020 ఢిల్లీ అల్లర్లలో కూడా పోలీసుల పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని సందర్భాల్లో కోర్టు స్వయంగా పోలీసులను మందలించింది. శాంతి, నిస్వార్థ సేవ, న్యాయం తమ లక్షణాలంటూ చెప్పే ఢిల్లీ పోలీసులు... ఈ కేసు దర్యాప్తు చేయడంలో, పరిస్థితిని అదుపులో ఉంచడంలో విఫలం కావడంతో అనేక సార్లు విమర్శల పాలయ్యారు.

ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు గత నెలలో పోలీసులను మందలించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, చార్జిషీట్ నమోదులను ఇతర దిగువ కోర్టులు కూడా ప్రశ్నించాయి.

అల్లర్లను ఆపడానికి ఢిల్లీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఢిల్లీ పోలీసు అధికారులను కోర్టులు నిలదీశాయి.

'' మీ దగ్గర రెచ్చగొట్టే ప్రసంగాల క్లిప్‌లు ఉన్నప్పుడు... ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆగమన్నారు?'' అని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక కమిషనర్‌పై జస్టిస్ మరళీధర్ మండిపడ్డారు.

ఢిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్,PTI

''సిటీ అంతా తగలబడిపోతుంది. చర్య తీసుకోవడానికి ఇంకా సరైన సమయం వస్తుంది? అని కోర్టులో వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై మానవ హక్కుల కార్యకర్తలు కూడా పోలీసులను తప్పుబట్టారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్,GETTY IMAGES

చీఫ్ జస్టిస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు

పోలీసు విభాగం గురించి ప్రధాన న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.

మానవ హక్కులకు, మానవ గౌరవానికి పోలీస్ స్టేషన్లు అతిపెద్ద ముప్పుగా మారాయని ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్‌వీ రమణ అన్నారు.

పోలీసు కస్టడీలో మరణాలు, వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

''మానవ హక్కులకు, గౌరవానికి పోలీస్ స్టేషన్లు ముప్పుగా మారాయి. తాజా నివేదికల ప్రకారం చూస్తే, ప్రత్యేక అధికారులు కూడా థర్డ్ డిగ్రీ నుంచి తప్పించుకోలేకపోతున్నారు'' అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తికి తక్షణమే చట్టపరమైన సాయం లభించదని జస్టిస్ రమణ చెప్పారు. నిందితుడితో ఎలా వ్యవహరించాలో కస్టడీలోకి తీసుకున్న తొలి గంటల్లోనే నిర్ణయం అవుతుందని అన్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ' యాప్ విడుదల సందర్భంగా జస్టిస్ రమణ ఈ విషయాలను చెప్పారు.