Friday, October 8, 2021

అక్కడ నోబెల్ – ఇక్కడ నో బెయిల్...అనంచిన్ని వెంకటేశ్వరరావు,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

హైదరాబాద్ : 09/10/2021

అక్కడ నోబెల్ – ఇక్కడ నో బెయిల్

అక్కడ నోబెల్ – ఇక్కడ నో బెయిల్

అనంచిన్ని వెంకటేశ్వరరావు,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

– రవిప్రకాష్ 23 రోజులు
– అనంచిన్ని వెంకటేశ్వరరావు 61 రోజులు
– గంజి రఘు 13 రోజులు
– తీన్మార్ మల్లన్న ఈరోజుకు 43 రోజులు.. నో ‘బెయిల్’

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో  !!


అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలా ఉంది.? ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అధికారికంగా ప్రకటించిన మహిళా ప్రధాని. నేడు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణరాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది.? ఫిలిఫీన్స్, రష్యాలలో ఎలా ఉంది.? ఆయా దేశాలలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అత్యున్నత నోబెల్ పురస్కారాలు. మరి ఇక్కడ నో’బెయిల్’ సత్కారాలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసులు, కిడ్నాప్ ‘అరెస్టులు… ఆ,యా జర్నలిస్టులకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న అధికార వర్గాలు. ఇప్పటి వరకు ముగ్గురు ప్రముఖ పాత్రికేయులను జైళ్ళల్లో ‘మగ్గ’ పెట్టారు. ఇప్పుడు వారే చేయాల్సిన వారిని ‘ఫ్రై’ చేస్తున్నారు. ఇక తాజాగా తీన్మార్ మల్లన్నకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న తీరు, జరుగుతున్న కుట్ర పూర్తిగా ఆక్షేపణీయం.

రవిప్రకాష్:
దేశంలో ఎలక్ట్రానిక్ మీడియాను వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృషించాడు. పాతిక కోట్ల ప్రస్థానాన్ని రూ. 450 కోట్లకు చేర్చాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ‘ఆత్మహత్య’ సంఘటనపై నోరు తెరిచిన కొద్ది గంటల్లోనే యాజమాన్యం విషయం గక్కింది. ఆయన్ని బయటకు పంపింది. నాడు లాభాల బాటలో ఉన్న టివి9 ఇప్పుడు ఆనాటి ఆర్థిక ప్రాభవం కోల్పోయింది. చంచల్ గూడలో 23 రోజులు అక్రమంగా కేసులు పెట్టి బెయిల్ రాకుండా వేధించిన వైనం చరిత్ర. ఏదో ఒకరోజు మళ్ళీ ‘ఉల్కపాతం’ రాబోతుందని తెలుస్తోంది. సీ అండ్ ఎంజాయ్. బట్ డోంట్ టచ్.

అనంచిన్ని వెంకటేశ్వరరావు:
పరిశోధన పాత్రికేయంలో తనదైన ముద్ర. ‘విజయవిహారం’ చేస్తూ ఏ అవినీతి పరుడికి లొంగని తీరు. అక్రమాలను వెలికి తీయడంలో అరడజను ముఖ్యమంత్రుల వైభోగాలను అలవోకగా రాసిన అక్షర మాంత్రికుడు. నిజాలను నిక్కచ్చిగా చెప్పే దమ్మున్న జర్నలిస్ట్. ఇక వార్తలు రాయడమే ముఖ్యం కాదు. ‘స్టైల్’ మార్చి అందర్నీ మాట్లాడించే తర్ఫీదు ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. పలు ప్రజాసంఘాలతో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ.. ‘ఫాంహౌస్’ పడుకున్న వాళ్ళను బయటకు రప్పించి మరీ మాట్లాడిస్తున్నాడు.

3 సార్లు కిడ్నాప్ డ్రామా.! కేవలం వార్తలు రాసినందుకే నల్గొండలో 8, హైదరాబాద్ చర్లపల్లి సింగిల్ బారెక్ లో 53, మొత్తం 61 రోజులు. భారతదేశ స్వాతంత్ర్య‌ పోరాటం తర్వాత వార్తలు రాసినందుకు అత్యధిక రోజులు జైలులో పెట్టిన అద్భుతమైన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిదే..! ఇతను త్వరలో ఓ ‘డిజిటల్ మీడియా’తో మార్పు తెచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 74మందితో ‘చెడుగుడు’ కార్యక్రమం విన్నూత్నంగా ఉండబోతుందని తెలిసింది. ఆ ‘కబాబ్ ఫ్రై’ కోసం వేచిచూద్దాం.

గంజి రఘు:
యువ జర్నలిస్ట్. పేదోళ్ళ మధ్య తిరుగుతూ.. వాళ్ళ సమస్యలపై ‘యాంకరింగ్’ చేస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సగర్వంతో చేసిన కిడ్నాప్ అరెస్ట్. పాపం సిసి ఫుటేజ్ వల్ల తెలంగాణ పోలీసుల ప్రతిభ అందరికీ తెలిసింది. వారికి ధన్యవాదాలు. హుజురాబాద్ జైలు నుంచి నల్గొండ జైలు వరకు 13 రోజుల హైడ్రామా. వెరసి బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్ట్ ‘తలకొరివి ఎలా పెట్టవచ్చు.?’ అనే విషయంలో ‘మాస్టర్’గా మారాడు.

తీన్మార్ మల్లన్న:
వివిధ మీడియాలలో పనిచేసి ‘పవర్’ పాలిటిక్స్ తో మార్పు తీసుకురావాలని భావించాడు. క్యూ న్యూస్ ద్వారా మంచి ‘ప్రజెంటర్’ లక్షలాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి సుమారు లక్షన్నర ఓట్లు సంపాదించాడు. ప్రభుత్వానికి ఒంటి చేత్తో ‘దిగ చమటలు’ పట్టించాడు. ఇది ఒక రికార్డు. ఇప్పుడు అక్రమ కేసుల కారణంగా గత 43 రోజులుగా చంచల్ గుడా జైలులో ‘సింగిల్ బ్యారెక్’లో ఒంటరిగా ఉంచారని తెలుస్తోంది. ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతారోనని మల్లన్న టీం అనుమానం వ్యక్తం చేస్తుంది. మల్లన్న విడుదలైన తర్వాత ఎలా ఉండబోతుందని ‘గులాబీ బ్యాచ్’ ఇప్పటికే గుండెలు బాదుకొంటుంది. అల్ ద బెస్ట్..

పాత్రికేయ గళానికి.. నోబెల్‌ శాంతి పురస్కారం

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం ఇద్దరిని వరించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ జర్నలిస్టులు మరియా రెసా(ఫిలప్పీన్స్‌), దిమిత్రి మురాటోవ్‌ (రష్యా)లకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెసా.. తమ దేశంలో నానాటికీ పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు.

ఇక రష్యాకు చెందిన జర్నలిస్టు దిమిత్రి మురాటోవ్‌ మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక నొవాజా గజెటా వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి తమ దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయినప్పటికీ మురాటోవ్‌ వెనుకడుగు వేయకుండా తమ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తున్నారు.

No comments:

Post a Comment