లఖీంపూర్ ఘటన సమయంలో
ఎస్‌యూవీలో లేనేలేనన్న ఆశిష్
కుస్తీ పోటీల వద్ద ఉన్నట్లు వెల్లడి
తమదైన శైలిలో పోలీసుల దర్యాప్తు
ఘటనా స్థలి సమీపంలో సెల్‌టవర్ లొకేషన్
కుస్తీ పోటీల్లో లేడని సాక్షుల వాంగ్మూలం
ఎస్‌యూవీని నడిపింది అతడేనని నిర్ధారణ
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ఆందోళనకారులపైనా కేసు నమోదు
నలుగురిని చంపారంటూ ఎఫ్‌ఐఆర్
పక్కాప్లాన్‌తో జరిగిన ఘటన: అసదుద్దీన్
లఖ్‌నవూ/న్యూఢిల్లీ, అక్టోబరు 10: లఖీంపూర్ ఖీరీ ఘటనలో తన కుమారుడి ప్రమేయమే లేదని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెబుతూ వచ్చారు. నిందితుడు ఆశిష్ కూడా పోలీసుల విచారణలో అదే చెప్పారు. ఆ సమయంలో తాను కుస్తీ పోటీలను వీక్షిస్తున్నానని కుండబద్ధలు కొట్టారు. తన నిజాయితీని నిరూపించుకుంటానన్నారు. కానీ, భౌతిక, సాంకేతిక ఆధారాలన్నీ.. ఆశిష్ నిందితుడేనని ఎత్తిచూపాయి. బలమైన ఆధారాలకు తోడు.. దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు విమర్శలు, ఆందోళనలకు రైతులు కార్యాచరణను ప్రకటించడం వంటి పరిణామాలు వెరసి ఆశిష్ అరెస్టుకు దారితీశాయి.
డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సభ్యుడొకరు ఓ జాతీయ వార్తాసంస్థతో దర్యాప్తు తీరును, ఆశిష్ అరెస్టుకు దారితీసిన పరిణామాలను పంచుకున్నారు. రైతులపైకి ఎస్‌యూవీ దూసుకుపోయిన ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న కుస్తీ పోటీలకు హాజరైనట్లు ఆశిష్ ముందు నుంచి చెబుతూ వచ్చారు. ఆ మేరకు అన్ని ఆధారాలు ఉన్నాయని వాదించారు. కానీ, కుస్తీ పోటీలను తిలకించిన కొందరిని మేము ప్రశ్నించాం.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆశిష్ అక్కడ లేనేలేడని చెప్పారు. అక్కడి సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశాం అని వెల్లడించారు. ఆశిష్ సెల్‌టవర్ లొకేషన్ సరిగ్గా ఈ ఘటన జరిగిన ప్రాం తానికి కొద్ది దూరంలో అటూఇటుగా చూపించిందని తెలిపారు. తొలుత కుస్తీపోటీల వద్ద ఉన్నట్లు చెప్పిన ఆశిష్.. ఈ విషయంపై ప్రశ్నించగా మాటమార్చారన్నారు. ఆ ఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఉన్న తన రైస్ మిల్లులో ఉన్నట్లు చెప్పారని వివరించారు. ఘటన జరిగిన రెండు రోజులకు ఎస్‌యూవీ రైతులపైకి వెళ్తున్న వీడియో బయటకు వచ్చిందని గుర్తుచేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదులో ఆ వాహనాన్ని నడిపింది ఆశిష్ అని పేర్కొన్నారు.
మేము కూడా ఆ వీడియోను విశ్లేషించాం. ఆ వీడియోలో ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి తెలుపురంగు చొక్కా/కుర్తాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆ రోజు ఆశిష్ అదే రంగు చొక్కా ధరించారు. కానీ, మూకదాడిలో చనిపోయిన డ్రైవర్ హరిఓం ఆ వాహనాన్ని నడిపాడని చెప్పారు. చనిపోయిన డ్రైవర్ పసుపురంగు చొక్కాను ధరించాడు. ఈ విషయంపైనా ఆశి్‌షను ప్రశ్నించాం. తప్పించుకునేలా వ్యవహరించారే తప్ప.. సరైన సమాధానం చెప్పలేకపోయారు అని వివరించారు. బలమైన ఆధారాలుండడం.. విచారణకు ఆశిష్ సహకరించకపోవడంతో 12 గంటల పాటు ప్రశ్నించాక.. అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించామన్నారు.
శనివారం రాత్రి 11 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించి అరెస్టు ప్రకటించిన సిట్.. ఆ వెంటనే జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచింది. ఆశి్‌షకు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్టుపై సోమవారం కోర్టులో విచారిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనున్నారు. ప్రస్తుతం ఆశి్‌ష జిల్లా జైల్లో ఉన్నారు. కాగా.. రైతుల ర్యాలీపై ఎస్‌యూవీ దూసుకుపోవడంతో నలుగురు అన్నదాతలు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన మూకదాడిలో ఇద్దరు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి డ్రైవర్, ఓ జర్నలిస్టు మరణించిన విషయం తెలిసిందే. కాగా.. సోమవారంలోగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని, లేనిపక్షంలో తమ ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరించింది.
హిందూ-సిక్కుల
గొడవగా చూడొద్దు: వరుణ్ లఖీంపూర్ ఖీరీ సంఘటనను హిందూ-సిక్కుల మధ్య గొడవగా చూడవద్దు. అలాంటి ఓ ఉదంతానికి ఒక తరమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అని బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ ట్వీట్ చేశారు. కాగా, లఖీంపూర్ ఉదంతాన్ని ఓ ఘటనగా చూడొద్దని, అది పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదివారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఆ కారు మీదే (కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా). అయినా ఇంకా మీరు ఇంకా కేంద్ర మంత్రిగా ఎలా కొనసాగ గలుగుతున్నారు? ఈ ఘటనతో బీజేపీకి సంబంధం లేదని ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు. కాగా, సుప్రీంకోర్టు కల్పించుకోవడం వల్లే లఖీంపూర్ కేసులో ఆశిష్ అరెస్టు జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్
లఖీంపూర్‌లో జరిగిన దారుణంపై వివరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవాలని నిర్ణయిం చింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరుతూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు.
No comments:
Post a Comment