KCR: వెంకయ్యనాయుడు కుర్చీలో కేసీఆర్..? బీజేపీ ప్రతిపాదనకు కేసిఆర్ సమాధానమేమిటంటే..?
KCR: ఉప రాష్టపతిగా కేసిఆర్ ..?
వీరు హస్తినకు వెళ్లినప్పుడల్లా మోడీ, షాతో సహా కేంద్ర మంత్రులు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసిఆర్.. ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అప్పుడు వారం రోజుల పాటు కేసిఆర్ ఢిల్లీలో ఉండి మోడీ, షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేసిఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటి నుండి తెలంగాణలో ఓ పుకారు షికారు చేస్తుంది. అది ఏమిటంటే…కేసిఆర్ ఉప రాష్ట్రపతి కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసిఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయనకు ఎన్డీఏలో చేరితే ఉప రాష్ట్రపతి పదవితో పాటు హరీష్ రావుకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కేసిఆర్ ఉప రాష్ట్రపతి అయితే కేటిఆర్ ను సీఎంగా చేసే వీలుంటుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం త్వరలో పూర్తి కానున్న సందర్భంలో కేసిఆర్ కు ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
తృతీయ ఫ్రంటా..? ఎన్‌డీఏ గూటికా..?
అయితే రాజకీయ భవిష్యత్తు కోసం కేసిఆర్..బీజేపీ తెస్తున్న ప్రతిపాదనను ఆమోదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. గతంలోనే కేసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో ప్రవేశించాలని ఆకాంక్షించారు. ఆ క్రమంలో పలువురు సీఎంలతోనూ మాట్లాడారు. తృతీయ ఫ్రంట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ విషయాలను ఆయన నేరుగా ఎక్కడా ప్రస్తావించలేదు. తాను తృతీయ ఫ్రంట్ పెడుతున్నట్లు ఎప్పుడైనా చెప్పానా, బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతోందంటూ కేసిఆర్ గతంలో అన్నారు. ఓ పక్క ప్రశాంత్ కిషోర్ పలు ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుకు కిందకు చేర్చి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ప్రత్యర్ధి కూటమికి వెళ్లకుండా బీజేపీ ఈ ప్లాన్ వేసిందనే మాట వినబడుతోంది. దీనిపై మరి కొద్ది నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment