Wednesday, June 14, 2023

సర్కార్ వైద్యం బాగుంటే.... పంటి నొప్పికే సీఎం ఢిల్లీకి ఎందుకు.... బూర నర్సయ్య గౌడ్!

సర్కార్ వైద్యం బాగుంటే.... పంటి నొప్పికే సీఎం ఢిల్లీకి ఎందుకు.... బూర నర్సయ్య గౌడ్!

*హైదరాబాద్...*
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం వెలుగులు జిమ్మితే పంటి, కంటి నొప్పికి సీఎం కేసీఆర్‌ దిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మాజీ ఎంపీ, భాజపా సీనియర్‌ నేత బూర నర్సయ్యగౌడ్‌ ప్రశ్నించారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచి నుంచి సీఎం వరకూ.. ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. 56శాతం డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు.

''రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు చేయడంలేదు. కేసీఆర్‌ కిట్స్‌, న్యూట్రీషియన్‌ కిట్‌ నిధులు కేంద్ర ప్రభుత్వానివే. వరంగల్‌, నిమ్స్‌ ఆసుపత్రుల కోసం భూములను కుదువ పెట్టారు. తెలంగాణ స్టేట్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి భూములు కుదువపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటోంది'' అని బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

చెరువుల ఆక్రమణలపై తుది నివేదిక సమర్పించండి : హైకోర్టు

చెరువుల ఆక్రమణలపై తుది నివేదిక సమర్పించండి : హైకోర్టు
Courtesy by : ABN , First Publish Date - 2023-06-14T05:49:02+05:30 IST

రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెరువుల రక్షణకు సంబంధించి తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెరువుల రక్షణకు సంబంధించి తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆయా చెరువుల భూములపై సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్‌ హద్దులు గుర్తించాలని గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్లలో ప్రభుత్వం కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే సమర్పించిందని తుది నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.

Tuesday, June 13, 2023

హైదరాబాద్ సహా 7 నగరాలకు భారీగా నిధుల విడుదల

*వరదలకు పరిష్కారం... హైదరాబాద్ సహా 7 నగరాలకు  భారీగా నిధుల విడుదల*

*రూ.2,500 కోట్ల కేటాయింపు*
*మొత్తం రూ.8వేల కోట్లతోవిపత్తు నిర్వహణ పథకాలు*
దిల్లీ: తుపానుల నష్టాలు, వరదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.మొత్తం రూ.8వేల కోట్లతో విపత్తు నిర్వహణ పథకాలను ప్రకటించింది. అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునికీకరణకు రూ.5,000 కోట్లు, ఏడు మెట్రో నగరాలైన ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణెల్లో వరదల నివారణకు రూ.2,500 కోట్లు, 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలను తగ్గించడానికి రూ.825 కోట్లతో ప్రత్యేక చర్యలను చేపట్టనున్నట్లు అమిత్‌ షా తెలిపారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త పథకాలను ప్రకటించారు.ప్రకృతి విపత్తులవల్ల దేశంలో ఒక్కరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం 7 అణు విద్యుత్కేంద్రాలు నిర్మాణంలో ఉన్న రాష్ట్రాలను ఇటీవల జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) నిపుణులు సందర్శించి, ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారని చెప్పారు. ప్రకృతి విపత్తుల నివారణ భారతదేశానికి కొత్త కాదని, పురాణాల నుంచి చాణక్యుని అర్థశాస్త్రం వరకూ సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట నష్టాలకు గురయ్యే రైతులకు నష్ట పరిహారం పెంచాలని కొన్ని రాష్ట్రాల మంత్రులు కోరగా.. పరిశీలిస్తున్నామని అమిత్‌ షా హామీ ఇచ్చారు. తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే 350 జిల్లాల్లో ప్రజలకు సాయపడటానికి లక్ష మంది ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

GHMC లో 150 వార్డు కార్యాలయాలు...!

*హైదరాబాద్ వాసులకు... శుభవార్త GHMC 150 వార్డు కార్యాలయాలు...!*

తెలంగాణ  ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 150 వార్డు కార్యాలయాలను ఒకేసారి ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ప్రజలు తమ పౌర ఫిర్యాదులను తెలియజేయడానికి వీలుగా వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేశంలోనే మొట్టమొదటి మెట్రో నగరంగా హైదరాబాద్ అవతరించనుందని తెలంగాణ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కెటి రామారావు శనివారం తెలిపారు.

జూన్ 16న 150 వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నామని.. ఒక్కో వార్డు కార్యాలయానికి వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డబ్ల్యూఏవో) నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన 10 మంది సిబ్బంది ఉంటారని మంత్రి తెలిపారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి WAOగా ఉంటారు. ప్రజలు తమ పౌర ఫిర్యాదులను ఈ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. మార్గదర్శకత్వంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని చెప్పారు.  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) వార్డు స్థాయి అధికారులతో ఆయన ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ వేడుకల్లో భాగంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు కార్యాలయాల ప్రధాన విధులు, సిబ్బంది ప్రతి ఒక్కరి ఉద్యోగ బాధ్యతలను కేటీఆర్ వివరించారు. అన్ని కొనసాగుతున్న పథకాలు, వార్డులోని అభివృద్ధి ప్రాజెక్టుల క్రింద అందించబడిన అన్ని పౌర మౌలిక సదుపాయాల యొక్క సరైన నిర్వహణను నిర్ధారించడం కార్యాలయాల లక్ష్యాలలో ఒకటి. ప్రతి వార్డు కార్యాలయానికి కింది సిబ్బందిని కేటాయించారు: వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (WAO), ఇంజనీర్, టౌన్ ప్లానర్, ఎంటమాలజిస్ట్, శానిటరీ జవాన్, కమ్యూనిటీ ఆర్గనైజర్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, అసిస్టెంట్, లైన్ ఇన్‌స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్ రిసెప్షనిస్ట్. వార్డులోని రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాళ్లు , ఇతర మౌలిక సదుపాయాల మరమ్మతులు లేదా నిర్మాణాలను వార్డు ఇంజనీర్లు చూస్తారు. నీటి ఎద్దడి సమస్యలు, గుంతల పూడ్చివేత, రోడ్లపై చిన్న చిన్న పాచెస్ మరమ్మతులు కూడా వారు పరిష్కరించాలి. వార్డ్ టౌన్ ప్లానర్లు భవన నిర్మాణాలను పర్యవేక్షిస్తారు, పబ్లిక్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చూసుకుంటారు మరియు భవన నిబంధనలను అమలు చేస్తారు. వార్డ్ ఎంటమాలజిస్ట్ నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లను చేపట్టాలి. వార్డు శానిటరీ జవాన్ వార్డులో మొత్తం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ హరిత కార్యక్రమాలన్నింటికీ వార్డు అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్ బాధ్యత వహిస్తారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, June 12, 2023

మాజీ MLA అమరచింత దయాకర్ రెడ్డి.... కన్నుమూత

*మాజీ MLA అమరచింత దయాకర్ రెడ్డి.... కన్నుమూత*

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం గ్రామం. దయాకర్ రెడ్డి మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999లో అమరచింత నియోజకవర్గం నుండి రెండు సార్లు, నియోజకవర్గాల పున:విభజన తరువాత 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంకు కృషిచేసిన వారిలో దయాకర్ రెడ్డి ఒకరు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ దయాకర్ రెడ్డి పనిచేశారు.దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డికి టీడీపీతో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి రాజకీయ జీవితం టీడీపీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది. సీతా దయాకర్ రెడ్డికూడా భర్తకు తోడుగా రాజకీయాల్లో కొనసాగారు. ఆమె 2002 సంవత్సరంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009 సంవత్సరంలో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాతకూడా వీరు కొద్దికాలం టీడీపీలో కొనసాగారు. గతేడాది ఆగస్టు నెలలో దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో వారు కన్నీరు పెట్టుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

ఆ తరువాత కొద్దికాలంకు దయాకర్ రెడ్డి అనారోగ్యంకు గురికావటంతో దంపతులిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూవచ్చారు. కొంతకాలంగాఅనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న దయాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకొని స్వగ్రామం పర్కపురంకు వచ్చారు. మళ్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

పత్రిక ప్రకటన (SFI)

పత్రిక ప్రకటన 

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ
తేదీ:- 12-06-2023

విషయం:- మేడ్చల్ మండలంలో సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు లేకుండా నడుపుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విద్యాధికారులు MEO ఆఫీస్ నుంచి వచ్చి సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యానర్స్ తీసివేసి, స్కూల్లో అమ్ముతున్న బుక్స్ యూనిఫామ్స్ రూమ్ ని,స్కూల్ ను సీజ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాథోడ్ సంతోష్ కార్యదర్శి మాట్లాడుతూ....  మేడ్చల్ మండలంలో విద్యాధికారుల కనుసందనంలో నడుస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో బుక్స్,యూనిఫామ్స్ కిరాణా షాప్ లో అమ్మినట్టుగా అమ్ముతున్న పట్టించుకోని విద్యాధికారులు.. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో గుర్తింపు తీసుకున్న పాఠశాల ఒకటి ఉంటే అదనంగా పేరు పెట్టి తల్లిదండ్రులు మోసం చేసి అడ్మిషన్ తీసుకొని దందాలు నడిపిస్తున్న ప్రైవేటు స్కూల్లో పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి M.కిరణ్, శివ, మనోహర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో

ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్

ధరణి పోర్టల్ పై....KCR కీలక వ్యాఖ్యలు....!

*ధరణి పోర్టల్ పై....KCR కీలక వ్యాఖ్యలు....!*

జోగులాంబ గద్వాల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని..అలాగే, జిల్లాలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ పప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, గద్వాల సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గద్వాలలో అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. పాత గద్వాలకు.. నేటి గద్వాలకు ఎంతో తేడా ఉంది. జిల్లా ప్రజలకు జోగులాంబ దీవెనలు ఉండాలి. గద్వాలకు త్వరలో మెడికల్‌ కాలేజీ రాబోతోంది. ఒక్క మెడికల్‌ కాలేజీ లేని జిల్లాలో ఐదు మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉంది. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించాం. మరో​ 5-10 ఏళ్లు ఇలాగే కష్టపడితే మనకు ఎదురుండదు. మానవీయ కోణంలో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రగతిలో మనకన్నా ఎత్తుగా ఉన్న అనే స్టేట్స్‌ను అధిగమించాం. గతంలో మనం వలస పోయాం. ఇప్పుడు వేరే వాళ్లు ఇక్కడికి వలస వస్తున్నారు. గత పాలకులెవరూ ప్రజలను పట్టించుకోలేదు. రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చాం. ధరణి తీసేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిసేస్తామంటున్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చాం. ధరణితోనే రైతుల ఖాతాల్లో​ నగదు జమ అవుతోంది. ధరణితో దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టాం. ధరణి ఉండాలా.. తీసేయాలా.. మీరే చెప్పండి అని ప్రజలను ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందన్నారు. తెలంగాణలో ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*