Friday, September 8, 2023

ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా.... నరోత్తమ్ నియామకం...!

*ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా.... నరోత్తమ్ నియామకం...!*

హైదరాబాద్‌: 'తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన ఏర్పుల నరోత్తమ్‌ నియమితులయ్యారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ఉత్వర్వులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్‌కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

*నరోత్తమ్ రాజకీయ ప్రస్థానమిదీ...!*
ఏర్పుల నరోత్తమ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్రమ్మ, నర్సయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్యవహరించారు. వికారాబాద్‌లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల బాట పట్టారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మార్జినల్ ఓట్లతో నరోత్తమ్ ఓటమి చవిచూశారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023, జులై 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏర్పుల నరోత్తమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

_చంద్రబాబు అరెస్ట్_

*_చంద్రబాబు అరెస్ట్_* _# స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో చంద్రబాబు A2_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

* *_హైకోర్టుకు ప్రాథమిక ఆధారలు ఇచ్చామంటున్న పోలీసులు_*

* *_చంద్రబాబు తరఫున పోలీసులతో వాదిస్తున్న న్యాయవాదులు_*

* *_ఆధారాలు చూపాలంటున్న న్యాయవాదులు_*

* *_రిమాండ్ రిపోర్టులో ఉన్నాయంటున్న పోలీసులు_*

* *_FIR ఇస్తామంటున్న పోలీసులు_*

* *_నంద్యాలలో అర్థరాత్రి నుంచి హైడ్రామా_*

* *_తన అరెస్ట్ గురించి ముందే చెప్పిన చంద్రబాబు_*

*_తెల్లవారుజామున ఏం జరిగింది.?_*
తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తెదేపా కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వేకువ జామున చంద్రబాబు బస్సు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

_నంద్యాలలో హైటెన్షన్‌.._ *_చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు_*
_# అరెస్ట్, తర్వాత 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు..అంతా లాంఛనమే..!_
_# శనివారం, ఆదివారం సెలవు దినాలు చూసి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగిన పోలీసులు_
_#తెరపైకి ముదివేడు కేసుతో సహా మరో నాలుగు కేసులు..?_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_ 

*_ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారు. చంద్రబాబును జైలుకు పంపాలనకున్నారు. అంతే 'రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.!' అన్నట్లు శుక్రవారం రాత్రి నుంచి పోలీసు అధికారులు పక్కా ప్రణాళికతో చంద్రబాబును నంద్యాలలో ఉద్రిక్తతల నడుమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చటం, 14 రోజుల రిమాండ్, అనంతరం జైలుకు తరలింపు కార్యక్రమం.. బయట తెలుగుదేశం శ్రేణులు బంద్ కు పిలుపి ఇవ్వటం, అక్కడక్కడా ఉద్రిక్తతల వంటి సంఘటనలతో ఈరోజు అంతా ఒకటే హడావుడి.._*

*_అసలేం జరిగింది.?_*
నంద్యాలలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు బసచేసిన ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా తెదేపా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.  

*_చట్టవిరుద్ధమన్న న్యాయవాదులు_*
తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద  చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. నాహక్కులు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి అని చంద్రబాబు అన్నారు. ఏ చట్టప్రకారం నన్ను అరెస్టు చేస్తారు చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారన్నారు. అయితే హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు తెలిపారు. మరోవైపు చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో వాదిస్తున్నారు. ఆధారాలు చూపించాలని అడిగారు. రిమాండ్‌ రిపోర్టులో అన్నీ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ ఇస్తామన్నారు. అయితే ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిందేనని న్యాయవాదులు పట్టుబట్టారు. సూపర్‌వైజర్‌ ఆఫీసర్‌ రావాల్సిన అధికారం ఏముందని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. మమ్మల్ని చుట్టుముట్టి బెదిరించడం సరికాదని ఈ సందర్భంగా పోలీసులు అన్నారు. చెదిరించట్లేదని, మా హక్కులు అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. చంద్రబాబును అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని న్యాయవాదులు అంటున్నారు.

*_మీడియాను పోలీసులు దూరంగా పంపి.._*
మరోవైపు మీడియాను పోలీసులు దూరంగా పంపించివేశారు. పోలీసులతో న్యాయవాదులు చర్చిస్తున్నారు. అరెస్టు పత్రాలను వారు పరిశీలించారు. అయితే కొన్ని గంటల్లో అన్ని పత్రాలు ఇస్తామని పోలీసులు తెలిపారు.

*_తెరపైకి డీకే బసు కేసు_*
ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌ పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఈ సందర్భంగా తెదేపా అధినేత పోలీసులను ప్రశ్నించారు. తనని అరెస్టు చేసే ముందు ఆ పత్రాలను ఇవ్వాలని అన్నారు. అయితే అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందని చంద్రబాబు అన్నారు. అరెస్టు నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామని పోలీసులు చెబుతున్నారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. అవగాహన లేకుండా న్యాయవాదులు వ్యవహరిస్తున్నారని పోలీసులు అనగా, పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందని చంద్రబాబు అన్నారు. 

*_అంతకుముందు_* చంద్రబాబు బస చేసిన ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస చేస్తున్న ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఆర్‌.కె ఫంక్షన్‌ హాల్‌ వద్దకు భారీగా తరలివచ్చాయి. శనివారం ఉదయం 5 గంటల తర్వాత చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వాహనం చుట్టూ ఉన్న తెదేపా నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలవ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర స్థానిక తెదేపా నేతలు ఉన్నారు. 

*_అంతకుముందు 3 గంటల సమయంలో_*
పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లారు. చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి, ఎన్‌ఎస్‌జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు. మరోవైపు అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం సరికాదని, ఆయన ఎక్కడికీ పారిపోయే వ్యక్తి కాదంటూ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్‌ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపాలని తెదేపా నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయమై చంద్రబాబుకు తప్ప ఎవ్వరికీ సమాధానం చెప్పమని పోలీసులు పేర్కొన్నారు. 

*_కేసు ఏంటని నాయకులు, న్యాయవాదులు అడిగినా.._*
వారు సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వస్తే తామే చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని తెదేపా నేతలు పోలీసులకు చెప్పారు. అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్‌ కదులుతోందనే సమాచారంతో ఇక్కడికి వచ్చామని పోలీసులు తెలిపారు. వాహనాలను అడ్డు తొలగించాలని పోలీసులు వారికి సూచించారు. చంద్రబాబుకు ఇబ్బంది కలుగకుండా వెళ్తే వాహనాలు అడ్డుతీస్తామని తెదేపా శ్రేణులు పేర్కొన్నాయి.  

*_రోప్‌ పార్టీ ఏర్పాటు_*
తెదేపా కార్యకర్తల వ్యతిరేకత మధ్యే చంద్రబాబు బస చేసిన బస్సు చుట్టూ పోలీసులు రోప్‌ పార్టీని ఏర్పాటు చేశారు. తమ చర్యలకు ఎలాంటి అడ్డంకులు కలుగకుండా పోలీసులు చూసుకుంటున్నారు. చంద్రబాబును కలిసి ఆయనకు నోటీసు ఇవ్వాలని డీఐజీ రఘురామరెడ్డి తెదేపా నేతలతో చెప్పారు. మరోవైపు ఫంక్షన్‌ హాల్‌ వద్ద తెదేపా నేతలు అడ్డుపెట్టిన వాహనాలను పోలీసులు జేసీబీతో తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీఐపీని కలిసేందుకు అనుమతి ఇవ్వబోమని ఎన్‌ఎస్‌జీ పోలీసులకు స్పష్టం చేసింది. ప్రోటోకాల్‌ ప్రకారం ఉదయం 5.30 గంటల వరకు అనుమతి ఇవ్వబోమని ఎన్‌ఎస్‌జీ పేర్కొంది.

*_స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా చంద్రబాబు పేరు చేర్చి అరెస్ట్ వారెంట్ తెచ్చిన పోలీసులు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి. వైద్యపరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ, షుగర్ ఉంది. హైకోర్టులో బెయిల్‍కు ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన న్యాయవాది_*

షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు... కిషన్ రెడ్డి....!

*షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు... కిషన్ రెడ్డి....!*

హైదరాబాద్‌: భాజపా శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ప్రకాశ్‌ జావడేకర్‌, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జిల సమావేశంలో స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగవని తేల్చి చెప్పారు. భారాస, భాజపా ఎప్పటికీ ఒక్కటి కావని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జమిలి ఎన్నికల ఊహాగానాలతో నిమిత్తం లేకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు... గవర్నర్ తమిళిసై

*ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు... గవర్నర్ తమిళిసై*

హైదరాబాద్: సవాళ్లు, ప్రతిబంధకాలు తనను అడ్డుకోలేవని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తాను రాసిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఆమె విడుదల చేశారు.తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 

''రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాను. కోర్టు కేసులు, విమర్శలకు భయపడను. ప్రోటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉంది. ఇక్కడ జిల్లాల పర్యటనకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారు. నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. కన్నింగ్‌ ఆలోచనలతో లేను. 
వైద్య రంగంలో ప్రభుత్వం బాగా పని చేస్తోంది. ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ బిల్లు ప్రభుత్వం నుంచి నాకు అందింది. కొన్ని బిల్లుల్లో లోపాల్ని గుర్తించి తిరిగి పంపాను. బిల్లులను తిరిగి పంపడంలో ఎలాంటి రాజకీయం లేదు. జమిలి ఎన్నికలను నేను సమర్థిస్తాను. సీఎం కేసీఆర్‌కు చాలా రాజకీయ అనుభవం ఉంది. కేసీఆర్‌ను చూసి చాలా నేర్చుకున్నాను '' అని తమిళిసై అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

గణేష్ నిమజ్జనం...గతేడాది ఉత్తర్వులే కొనసాగుతాయి...హైకోర్ట్

*గణేష్ నిమజ్జనం.... గతేడాది ఉత్తర్వులే కొనసాగుతాయి.... హైకోర్ట్....*

హైదరాబాద్‌: ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

పీఓపీతో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. మరోవైపు గతేడాది కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌పై విచారణ సెప్టెంబరు 25కి వాయిదా వేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Thursday, September 7, 2023

కేయూ విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా....? MLA ఈటల....!

*కేయూ విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా....? MLA ఈటల....!*

హైదరాబాద్‌: కేయూ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించిన ఘటనను దేశం మొత్తం చూస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విద్యార్థులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తీసుకెళ్లి కొట్టడం దేశ చరిత్రలో తెలంగాణలోనే జరిగిందన్నారు. విద్యార్థులను కొట్టిన తీరు చూసి న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారన్నారు. విద్యార్థులను ఇంత తీవ్రంగా కొట్టిన ఘతన కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక ఎమ్మెల్సీ ప్రాపకంతో కేయూ వీసీగా వచ్చిన రమేశ్‌.. అప్పటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

*సుజీవన్ వావిలాల*🖋️

ముదిరాజ్ ల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీశారు

*ముదిరాజ్ ల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తిషారు... MLA ఈటల....!*

(హైదరాబాద్): తెలంగాణ లో మహబూబ్‌నగర్  మెదక్  రంగారెడ్డి  జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసించే సత్తా ఉన్న జాతి ముదిరాజ్ జాతి  అని బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్  అన్నారు.గురువారం ఆయన జూబ్లీ బస్ స్టేషన్  వద్ద మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్‌లో ముదిరాజ్ ఓట్లతో గెలిచిన కేసీఆర్ .. ముదిరాజ్ తల్లి పాలు తాగిన అని చెప్పే సీఎం.. ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా అవమానించారని, ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని అన్నారు. ఇందుకు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని.. కేసీఆర్‌ను గద్దె దించుతామని ముదిరాజ్ జాతి ప్రతిన పునారన్నారు. అది చేసి చూపిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️