Saturday, February 4, 2023

ప్రముఖ గాయని... వాణీ జయరాం కన్నుమూత....!

*ప్రముఖ గాయని... వాణీ జయరాం కన్నుమూత....!*

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు.తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్‌ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. కాగా 1945 నవంబర్‌ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్‌ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షిణ తీసుకున్నారు.

కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఆమె 8 ఏళ్ల వయసులోనే ఆల్‌ ఇండియా రెడియోలో పాట పాడి మురిపించారు. కె విశ్వనాథ్‌ తీసిన స్వాతికిరణం చిత్రంలో ఆమె 8 పాటలు పాడారు. ఇక ఆమె పాడిన తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆమె కంఠం స్వరమాధుర్యాలను వెదజల్లింది. భక్తి సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణీ జయరాం. అంతగా తన గాత్రంతో ఆమె సంగీత 5 దశాబ్దాలుగా సంగీత ప్రియులను మైమరిపించారు వాణీ జయరాం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

KTR వర్సెస్.... అక్బరుద్దీన్

*KTR వర్సెస్.... అక్బరుద్దీన్..... ఘాటు ఘాటూగా విమర్శ ప్రతి విమర్శ....!*

*హైదరాబాద్....!*
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార పక్షానికి దాని అనుకూల పార్టీకి మధ్య కౌంటర్ల వార్ జరగడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.నేటి అసెంబ్లీలో అదే జరిగింది. మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడిచింది. సభా నాయకుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై అక్బరుద్దీన్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఇలాంటి సభను తన 25 ఏళ్లలో ఏనాడూ చూడలేదు. బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్‌లకు వెళ్లే టైం ఉంటుంది కానీ సభకు వచ్చే టైం లేదా? అని ఎద్దేవా చేశారు. సభా నాయకుడితో సంబంధమేంటని కేటీఆర్ ప్రశ్నించారు.

*అసలు అక్బరుద్దీన్ సభలో ఏమన్నారంటే..*
హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాం. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేంటి ? ఉర్దూ రెండో భాష అయినా అన్యాయమే. బీఏసీ (BAC)లో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదు. టీవీ చర్చలకు వెళ్లే బీఆర్ఎస్ నేతల కు సభకు వచ్చే తీరిక లేదా?

*కేటీఆర్ కౌంటర్....!*

మంత్రులు అందుబాటులో లేరన్నది అవాస్తవం. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ టైమ్ అడగడం సరికాదు. సభ్యులను బట్టి పార్టీలకు సమయం కేటాయిస్తాం. బీఏసీకి రాకుండా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆవేశంగా మాట్లాడటం కాదు.. అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?

*అక్బరుద్దీన్ ఓవైసీ..*
నేను కొత్త సభ్యున్ని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా. టైంను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు.. రాజ్యంగబద్దంగా చర్చ జరగాలి. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Friday, February 3, 2023

ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

*హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..* *ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం*

తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారుతోంది.. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది.

తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయ్యింది.. మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం.. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశాం. మా ప్రభుత్వం రైతులకు బీమా అందిస్తోంది.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది.. రైతు పండించే ప్రతి బియ్యపు గింజను కొంటున్నాం.. రాష్ట్ర విభజన తర్వాత తలసరి విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం.

మిషన్‌ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించాం.. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు.. పేదలను ఆసరా పెన్షన్లతో ఆదుకుంటున్నాం.. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం.. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం.

నేతన్న బీమా పథకం ద్వారా జీవిత బీమా కల్పిస్తున్నాం.. గీతకార్మికుల సంక్షేమం కోసం వైన్‌షాపుల్లో 15శాతం రిజర్వేషన్.. తాటి, ఈతచెట్లపై పన్ను రద్దు చేశాం.. లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను 310కి పెంచాం.. హైదరాబాద్‌లో 41 బీసీ కులాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణం.. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం.

పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం రూ.1,00,116 ఆర్థిక సాయం ఇస్తున్నాం.. 12.46 లక్షల ఆడపిల్లల కుటుంబాలకు షాదీ ముబారక్‌తో లబ్ధి.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80వేలకు పైగా ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేస్తున్నాం.

2014 నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశాం.. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు మన ఊరు-మనబడి.. మూడు దశల్లో 7,289 కోట్ల వ్యయంతో 26వేల పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు.

హైదరాబాద్ నలువైపుల 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. నిమ్స్‌లో అదనంగా మరో 2వేల పడకలు.. తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17కు పెంచుకున్నాం..  మరో 9 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం.

టీఎస్ ఐపాస్‌లతో విప్లవాత్మక పురోగతిని సాధించాం.. తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.. ఎనిమిదిన్నరేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో 3.31లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే

*విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే*

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, కళా తపస్వి *కె.విశ్వనాథ్‌* శంకరాభరణం రిలీజ్‌ రోజే శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది.వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన చివరి క్షణాల వరకూ కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి ముందు ఓ పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్‌ రాస్తూ.. కాసేపటికి దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్‌ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా కె.విశ్వనాథ్‌.. సాగరసంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను చిత్రపరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రహీరోలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన కృషికి గానూ 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు.

*సుజీవన్ వావిలాల🖋️* 

Thursday, February 2, 2023

మధ్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు... ఈడీ చార్జీషీట్ లో .... కేజ్రీవాల్ కవిత పేర్లు

*మధ్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు... ఈడీ చార్జీషీట్ లో .... కేజ్రీవాల్ కవిత పేర్లు*

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు ఈడీ వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ వెల్లడించింది.

ఈకేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురిపేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు సమాచారం. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన.... టీఎస్ పీఎస్ సీ.....!

*గ్రూప్ 4 పరీక్ష తేదీని ప్రకటించిన.... టీఎస్ పీఎస్ సీ.....!*

హైదరాబాద్‌:రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్‌-4 పరీక్ష తేదీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) గురువారం ప్రకటించింది.జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష.. పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష ఉటుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.

కాగా గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని 9,168 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో ప్రధానంగా జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, వార్డ్‌ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీటి కోసం గత డిసెంబర్‌లో 1న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపటితో(ఫిబ్రవరి 3)గ్రూప్‌-4 దరఖాస్తు గడువు ముగియనుంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, February 1, 2023

అక్రమ పార్కింగ్ - అధికారుల అలసత్వం


ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ కార్యక్రమాల్లో డిజిపి అంజన్ కుమార్ గారు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ చొహన్ గారు సమక్షంలో ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న ట్రాఫిక్ జాములు గాని ఇల్లీగల్ పార్కింగ్ అలాగే రామంతపూర్ మెయిన్ రోడ్ లో నూతనంగా వెలిసినటువంటి రెస్టారెంట్లు బార్లు లిక్కర్ మర్ట్లు వారి అక్రమ పార్కింగ్లు స్వేచ్ఛగా రోడ్ల పైన పార్క్ చేసి ప్రజలను ఇబ్బందులు చేస్తున్నారు అలాగే రామంతపూర్ లోని మల్లికార్జున స్వామి కమాన్ దగ్గర వైన్ పార్క్ లిక్కర్ మార్ట్ వల్ల అక్కడ తాగిన వ్యక్తులు కాలనీలోకి వెళ్లే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన అలాగే అక్కడ మూత్ర విసర్జన తగు అసాంఘిక కార్యక్రమాలు నెలకొన్నయని ఇట్టి విషయాన్ని అతి త్వరలో పరిష్కరించాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దీనివల్ల ప్రజలకి మరియు ఉద్యోగస్తులకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు  కలుగుతున్నాయని పీపుల్స్ ఫోరం టు అచీవ్ రైట్స్ అండ్  ఎడ్యుకేషన్ ఇండియా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కొండ్రోన్ పల్లి.గిరిబాబు మహరాజ్ కమీషనర్ గారికి వినతిపత్రం అందజేశారు.