Monday, June 6, 2022

నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన..... హైకోర్ట్

నలుగురు పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన..... హై కోర్ట్*

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు.

జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ పోలీసు అధికారుల మీద గతంలో భార్యభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్ పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం మోపబడింది. అయితే.. అప్పీలు వెళ్లేందుకు నాలుగు వారాల జైలు శిక్ష అమలును.. ఆరు వారాల పాటు నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు.

link Media ప్రజల పక్షం🖋️

Sunday, June 5, 2022

నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల జారీ....12న యధావిధిగా పరీక్ష! పీజీ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ విడుదల నేడే....!

*నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల జారీ....12 యధావిధిగా పరీక్ష!*

*పీజీ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ విడుదల నేడే....!*

*హైదరాబాద్‌*

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు.టెట్‌ పేపర్‌-1 కోసం 3,51,468 మంది, పేపర్‌-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్‌-1 పరీక్ష ఉదయం, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా...

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్‌ మోడల్‌ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నారాయణగూడలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి తదితరులు ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అలాగే... యూటీఎఫ్‌ ఆధ్వర్యంలోనూ ఆదివారం టెట్‌ మోడల్‌ పరీక్ష జరిగింది.

రంగారెడ్డి జిల్లాలోని మూడు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్టు యూటీఎఫ్‌ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. కాగా... కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూ తదితర సంస్థల్లో పీజీ సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నుంచి కామన్‌ ఎంట్రన్స్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

link Media ప్రజల పక్షం🖋️

ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్ డీ కోర్సులు.....ఉస్మానియా యూనివర్సిటీ

*ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్ డీ కోర్సులు.....*

*ఉస్మానియా యూనివర్సిటీ*

హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు.ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్‌ తదితర కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్‌డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో కూడా కొనసాగనుంది. రీసెర్చ్‌ సెంటర్ల అనుమతికి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ సీటు ఒక్కటి కూడా లేదు.

దీంతో ఐదేళ్లుగా పీహెచ్‌డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్‌డీ ప్రవేశాలకు రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో కూడా పీహెచ్‌డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్‌íÙప్‌ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్‌ సెంటర్‌కు అనుమతి ఇవ్వనున్నారు.
*ఓయూ ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్‌*
రీసెర్చ్‌ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు, వైవా (సెమినార్‌) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్‌ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్‌లో హాస్టల్‌ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.

link Media ప్రజల పక్షం🖋️

బండి సంజయ్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.....??..KTR

బండి సంజయ్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.....??..KTR

ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది.వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని, మతపరమైన వ్యక్తుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే బీజేపీ సహించదని, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించదని బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ''బీజేపీ నిజంగానే అన్ని మతాలను గౌరవిస్తే.. అన్ని మసీదులను తవ్వి, ఉర్దూపై నిషేధం విధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?'' అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించారు. ''ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి'' అని ఆయన నిలదీశారు. కాగా.. హిందూ ఏక్తా కార్యక్రమంలో బండి సంజయ్ తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వాలని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. శవాలొస్తే మీకు, శివలింగాలొస్తే మాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తెలంగాణ తీవ్ర దుమారం రేపాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.....బెంజ్ కారులో కీలక ఆధారాలు?

*జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.....బెంజ్ కారులో కీలక ఆధారాలు?*

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పెద్దల ప్రమేయం ఉండటంతో కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు దూకుడు పెంచారు.ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు మరో నిందితుడు ఉమర్ ఖాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈకేసు దర్యాప్తు అధికారిగా బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ను నియమించారు.

ఈకేసులో ఇప్పటికే నిందితులు దుశ్చర్యకు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీమ్‌తో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు బెంజికారుతో పాటు ఇన్నోవా కారును ఆదివారం సాయంత్రం క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, బెంజికారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పును క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసింది. ఇన్నోవా కారులో ఎలాంటి ఆధారాలు లభించాయనేది మాత్రం పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు. ఇన్నోవా కారును ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నిన్న సాయంత్రం మొయినా బాద్‌లో స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు.. వాహనం చిక్కకుండా మొయినా బాద్‌లోని ఓ రాజకీయనేత ఫామ్‌హౌస్‌ వెనుక దాచేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారుపై ఉన్న ప్రభుత్వ స్టిక్కర్‌ కనిపిచంచకుండా, టీఆర్‌ నంబర్‌కూడా గుర్తుపట్టకుండా చేశారు. ఇన్నోవా కారు వ్యవహారంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి. మరో వైపు ఘటన తర్వాత షాక్‌కు గురైన బాలిక పూర్తిగా కోలుకోవడంతో పోలీసులు మరో సారి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Saturday, June 4, 2022

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

55 IST
అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

Courtesy by : ఈనాడు మీడియా ట్విట్టర్ 

అంతకుముందు బెంజి కారులో అసభ్య ప్రవర్తన

ఇన్నోవాపై ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కర్‌!

నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ అరెస్టు

ఇద్దరు మైనర్లు జువైనల్‌ హోంకు

నిందితుల్లో ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు, సంగారెడ్డి జిల్లా తెరాస నేత కుమారుడు

ఎమ్మెల్యే కుమారుడిపైనా కేసు నమోదుకు అవకాశం

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతంలో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఒక ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ (ఏదైనా కేసులో నిందితులు మైనర్లు అయితే వారి పేర్లే కాకుండా తల్లిదండ్రుల పేర్లు సహా నిందితులను గుర్తించే వివరాలను ప్రచురించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తండ్రి పేరు, సంస్థపేరు రాయడం లేదు) అధికారికంగా వినియోగించే ఇన్నోవా వాహనంలోనే బాలికపై అత్యాచారం జరిగిందని సమాచారం. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న ఈ వాహనానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్‌ ఉందని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెయినాబాద్‌ పరిసరాల్లో ఈ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్‌, ఒక ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అమేర్‌ఖాన్‌, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు, సంగారెడ్డి జిల్లా తెరాస పార్టీ నాయకుడి కుమారుడు బాలికపై అత్యాచారం చేశారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. శుక్రవారం రాత్రి సాదుద్దీన్‌ను అరెస్టు చేయగా శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడిని, బల్దియా కార్పొరేటర్‌ కుమారుడిని జువైనల్‌ హోంకు తరలించారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు బాలికతో చనువుగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో పోలీసులు అతడిని కూడా నిందితుడిగా చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

బెంజి కారు నుంచి ఇన్నోవాకు మార్చి..

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు మే 28న వచ్చిన బాలికను ఇంటివద్ద దిగబెడతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజి కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కన్పించింది. సాదుద్దీన్‌ మాలిక్‌ (18), అమేర్‌ ఖాన్‌ (18)లతో పాటు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు (16) కలిసి బాలికను బెదిరించి ఆమెను బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని తొలుత పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

పోలీసు దర్యాప్తుపై అనుమానాలు

పోలీసులు చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు తేడా ఉండడంతో పరిశోధన, దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను తీసుకెళ్తున్న బెంజికారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 నుంచి చెక్‌పోస్టు కూడలి మీదుగా కేబీఆర్‌ కూడలి నుంచి రోడ్‌ నం.14 వైపు వెళ్లినట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోల్లో బాధితురాలిని ఓ బాలుడు అతి దగ్గరగా తీసుకుని ముద్దాడడం, స్నేహితులు వీడియోలు తీయడం కనిపించింది. బాలికను ముద్దాడింది ఎమ్మెల్యే కుమారుడేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని పక్కనే ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ తనయుడు ఉన్నారు. అత్యాచారం చేశాక.. బాలికను పబ్‌ వద్ద దించేసిన నిందితులు.. బేకరీ వద్ద గ్రూప్‌ ఫొటో దిగారు. కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి.

* ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు.

* ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు దాన్ని చిక్కకుండా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజులైనా ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు.

* ఓ రాజకీయ నాయకుడి సూచనతో కేసు తీవ్రరూపం దాల్చకముందే ఎమ్మెల్యే కుమారుడిని దుబాయ్‌కి పంపేశారని సమాచారం.

ముగ్గురు నిందితులు ప్రజాప్రతినిధుల తనయులే

నిందితుల్లో ముగ్గురు.. ప్రజాప్రతినిధుల తనయులే. ఒకరి తండ్రి బల్దియా కార్పొరేటర్‌గా పనిచేసి ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కాగా.. మరొకరి తండ్రి ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు. మరొక నిందితుడి తండ్రి సంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి. మిగిలిన ఇద్దరు నిందితుల్లో అమేర్‌ఖాన్‌ (18) ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు. ఆ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరో నిందితుడు సాదుద్దీన్‌ తండ్రికి ఒక పార్టీ ప్రజాప్రతినిధితో సంబంధం ఉంది.

ఫోన్లు గోవాకు.. నిందితులు కర్ణాటకకు

నిందితులు పోలీసులను పక్కదారి పట్టించేందుకు ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నారు. గత నెల 29వ తేదీనే తామంతా గోవాకు వెళ్తున్నామంటూ స్నేహితులకు చెప్పారు. వీరు గోవాకు వెళ్లకుండా ఇద్దరు వ్యక్తులకు తమ సెల్‌ఫోన్లు ఇచ్చి అక్కడికి పంపించారు. వీరు మరో సిమ్‌కార్డు తీసుకుని కర్ణాటకు వెళ్లారు.

అది మద్యం రహిత పార్టీయే! 

అమ్నీషియా పబ్‌లో జరిగిన పార్టీలో మద్యం సరఫరా కాలేదని ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలుసుకున్నారు. ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థుల తరఫున ఓ విద్యార్థి వీడ్కోలు పార్టీకి బాధితురాలు సహా 153 మంది హాజరయ్యారని వారు వివరాలు సేకరించారు.


కుమార్తె బాధను పసిగట్టిన తల్లి

సామూహిక లైంగిక దాడితో ఇప్పటికీ షాక్‌లోనే బాలిక

ఈనాడు, హైదరాబాద్‌: సామూహిక లైంగిక దాడికి గురైన బాలిక ఇప్పటికీ ముభావంగానే ఉంటోంది. భయంభయంగా స్పందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ‘ఈనాడు’ ఆరా తీయగా పలు విషయాలు తెలిశాయి. వీడ్కోలు పార్టీకి వెళ్లేందుకు ముందు రోజే బాలిక తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది. ఉదయాన్నే స్నేహితురాలితో కలసి బయటకు వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకూ మిత్రుల మధ్య సరదాగా గడిపింది. 5.30 గంటలకు ఇంటికి తిరిగిరావాల్సిన ఆమె ఆలస్యంగా చేరుకుంది. ఎంతో సంతోషంగా వెళ్లిన ఆమె.. తిరిగొచ్చాక మౌనంగా ఉండిపోయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే బిడ్డ.. నిశ్శబ్దంగా ఉండటాన్ని కన్నపేగు పసిగట్టింది. తొలుత పార్టీలో డ్యాన్స్‌, ప్రయాణ బడలిక కారణం కావచ్చనుకుంది. అయినా అమ్మ మనసు ఎందుకో కీడు శంకించింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. బిడ్డ నుంచి ముభావంగా సమాధానాలు రావటంతో తన ఆందోళన నిజమని నిర్ధారించుకుంది. వాస్తవం ఏమిటో చెప్పకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతోందనే ఉద్దేశంతో నగరంలోని ఓ మనస్తత్వ నిపుణుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. వారిచ్చిన సూచనతో భరోసా కేంద్రానికి వెళ్లారు. అక్కడ కౌన్సెలర్లు బాలికను ప్రేమగా పలకరించి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. షాక్‌లో ఉన్న ఆమె మాట్లాడలేకపోతోంది. ఆమెతో అసలు విషయం చెప్పించేందుకు కౌన్సెలర్లు ఓపికతో ప్రయత్నించారు. చివరకు ఆమె కన్నీరు తుడుచుకుంటూ మూడ్రోజుల నుంచి తాను అనుభవించిన నరకాన్ని వారితో పంచుకుంది. స్నేహితులని నమ్మి వెళ్తే తనపట్ల ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారో వివరించింది. అనంతరం నిర్వహించిన  వైద్య పరీక్షల్లో సామూహిక లైంగిక దాడికి గురైనట్టు గుర్తించారు. శరీరంపై గాయాలు చూసిన కన్నతల్లి కన్నీరుమున్నీరైనట్లు సమాచారం. నిందితులకు శిక్ష పడాలని ఆ తల్లి వేడుకున్నట్టు తెలిసింది. కుమార్తె ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

WORLD ENVIRONMENT DAY