Thursday, September 7, 2023

కారు దిల్లీ వెళ్లి కమలంగా మారుతోంది

*కారు దిల్లీ వెళ్లి కమలంగా మారుతోంది.... రేవంత్ రెడ్డి....!*

హైదరాబాద్‌: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమాజిగూడ నుంచి నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియా అన్న మోదీ ఇండియా పేరు మారుస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరు మారుస్తామంటున్నారని ధ్వజమెత్తారు.

'' పెరిగిన ధరలు, మణిపూర్‌ అంశాలపై మోదీ పార్లమెంట్‌లో చర్చించడం లేదు. కేవలం కాంగ్రెస్‌ను తిట్టడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందన్నమోదీ.. గుజరాత్‌లో మోదీ తిరుగుతున్న ఎయిర్‌పోర్టు కాంగ్రెస్‌ నిర్మించిందని గుర్తు తెచ్చుకోవాలి. నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది కాంగ్రెస్‌ కాదా? తెలంగాణకు స్వాతంత్ర్యం కల్పించింది కాంగ్రెస్‌ కదా? మా పార్టీ అధ్యక్షుడు వల్లభాయ్‌ పటేల్‌ కాదా?పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భారత దేశం అభివృద్ధిని లెక్క కడదామా? విభజించు, పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర భాజపా చేస్తోంది. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. కారు దిల్లీకి వెళ్లి కమలంగా మారుతోంది'' రేవంత్‌రెడ్డి విమర్శించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment