Wednesday, September 6, 2023

ఈ నెల 16 న పాలమూరు - రంగారెడ్డి.... ప్రారంభం

*ఈ నెల 16 న పాలమూరు - రంగారెడ్డి.... ప్రారంభం*

*కృష్ణమ్మకు ప్రత్యేక పూజలతో వెట్‌ రన్‌కు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రిఅదే రోజు భారీ బహిరంగ సభ*
*17న కృష్ణా జలాలతో రెండు జిల్లాల్లోని ఆలయాల్లో దేవుళ్లకు పాదాభిషేకాలు*

*నీటిని ఎత్తిపోసే రోజు..దక్షిణ తెలంగాణకు పండగ రోజు*
*పథకంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మరో భారీ ఎత్తిపోతల పథకం పాలమూరు-రంగారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 16న ప్రారంభించనున్నారు. శ్రీశైలం వెనక భాగం నుంచి నీటిని ఎత్తిపోసే మొదటి పంపుహౌస్‌ నార్లాపూర్‌ ఇన్‌టేక్‌వెల్‌ వద్ద స్విచ్‌ ఆన్‌ చేసి వెట్‌ రన్‌ ప్రారంభిస్తారు. ఇప్పటికే మొదటి పంపుహౌస్‌లోని మోటార్లకు డ్రై రన్‌ పూర్తి చేయగా.. 16న వెట్‌ రన్‌ (నీటిని ఎత్తిపోయడం) ద్వారా నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అదే రోజు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాల సర్పంచులను, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. ఉమ్మడి పాలకుల
నిర్లక్ష్యం, వివక్షతో తాగునీరు, సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలంపాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను మొదలుపెట్టడం, ఆదిలోనే ఆపేయడం.. ఇదీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి అని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాగునీరూ అందించలేని పరిస్థితి ఉండేదన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, వెట్‌ రన్‌ ప్రారంభంపై సీఎం బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్వయం పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాలమూరు జిల్లా పచ్చగా మారి వలసలు ఆగిపోయాయని చెప్పారు. అదే దృఢ సంకల్పంతో ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందల కేసులు పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు.అడ్డంకులను అధిగమించి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి సాధించడంతోపాటు నీటిని ఎత్తిపోసే రోజు దక్షిణ తెలంగాణకు పండగ రోజు అని కేసీఆర్‌ అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలకు ఇంతకన్నా మరో గొప్ప వేడుక ఉంటుందని అనుకోనని వ్యాఖ్యానించారు. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, సలహాదారు పెంటారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్లు హమీద్‌ఖాన్‌, రమణారెడ్డిలను అభినందించారు. ఈ నెల 16న నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభ నిర్వహణ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజల తరలింపునకు రవాణా, భోజన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని.. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని ఆయన చెప్పారు. పథకానికి అడ్డంకులు తొలగి కొలిక్కివచ్చినందున ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవాలయాల్లో దేవుళ్ల పాదాలను పాలమూరుజలాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుందామని సీఎం సూచించారు. ఇదిలా ఉండగా మొదటి రిజర్వాయర్‌ నార్లాపూర్‌ నిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు కాగా, మొదట 2.2 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment