Friday, September 8, 2023

తెలంగాణ లో కౌలు రైతులను గుర్తించి, వారికి సహాయం అందిస్తారా ?

తెలంగాణ లో కౌలు రైతులను గుర్తించి, వారికి సహాయం అందిస్తారా ?

Courtesy / Source by :
కన్నెగంటి రవి,
రైతు స్వరాజ్య వేదిక , 
ఫోన్: 99129 28422 
-----------------------------------------------
11 వ విడత రైతు బంధు పథకం క్రింద పెట్టుబడి సహాయంగా  2023 వానాకాలం సీజన్ లో 68,99,000 మంది రైతులకు  1,52,00,000 ఎకరాలకు, 7,624 కోట్ల రూపాయలు  అందించారు. ఈ సీజన్ తో కలిపి ఇప్పటివరకూ రైతు బంధు సహాయం క్రింద 72,817 కోట్లు రైతుల ఖాతాలలో  జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
రాష్ట్రంలో సీజన్, సీజన్ కూ పెరుగుతున్న రైతుల సంఖ్యనూ , సాగు భూమి విస్తీర్ణాన్నీ చూస్తుంటే, అనుమానం కలుగుతున్నది . 2011 జనాభా లెక్కల ప్రకారం సాగు దారులుగా నమోదు చేసుకున్న వాళ్ళు 31 లక్షల మంది మాత్రమే. గత 12 సంవత్సరాలలో ఏకంగా 37,99,000 మంది అదనంగా రాష్ట్రంలో రైతులుగా పట్టా పాస్ బుక్ లు పొందారు. 
ఎవరు వీళ్ళంతా  నిజంగా గ్రామాలలో ఉండి ,వ్యవసాయం చేస్తున్న రైతులేనా? (భూ కమతాల విభజన వల్ల కొందరికి కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన మాట వాస్తవం. పోడు రైతులకు పట్టాలు దక్కడం వల్ల కూడా కొందరు రైతులు పెరిగారు) వ్యవసాయం స్వయంగా చేయకపోయినా కేవలం సాగు భూమిపై హక్కులు పొందుతూ , రైతు బంధు ,రైతు బీమా, పంట రుణం,పంట నష్ట పరిహారం లాంటి వ్యవసాయ మద్ధతు పథకాలను పొందే ఉద్దేశ్యంతో రైతులుగా అవతార మెత్తిన వాళ్ళా ?   
నిజానికి సమాజం ముందుకు పురోగమించిన కొద్దీ , ప్రజలు గ్రామాలను, పొలాలను వదిలి పట్టణాలకు, పారిశ్రామిక, సేవా రంగాలకు తరలి పోతుంటారు. వ్యవసాయంపై ఆధార పడే జనాభా తగ్గిపోతూ, నగరాలలో జనాభా సాంద్రత పెరుగుతుంటుంది. పెరుగుతున్న జనాభాతో, నగరాలు మౌలిక సౌకర్యాల కొరతను ఎదుర్కుంటూ, ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. పరిశుభ్రమైన గాలి, నీరు దొరకదు. ఇళ్ల కొరత  ఏర్పడు తుంటుంది. స్వంత ఇల్లు లేని పేదల, మధ్యతరగతి కుటుంబాలపై  ఇళ్ల కిరాయిల భారం పెరుగు తుంటుంది. 
ఈ పరిణామాలన్నీ తెలంగాణ లో మనం గమనిస్తున్నాం . సాగు భూములు కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూములుగా, ప్లాట్లు గా మారిపోతున్నాయి. ఈ ధోరణి అన్ని జిల్లాలలోనూ ఉంది.  కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఐదు సంవత్సరాల లోనే కనీసం 35 లక్షల ఎకరాలు కొత్తగా సాగు భూమిగా మారి, రైతు బంధు అందుతున్నది. 
విచిత్రమేమిటంటే, రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకూ 72,817 కోట్లు రైతు బంధు సహాయంగా పంచినా , గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాలలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోతూనే ఉన్నారని  నేషనల్ శాంపిల్ సర్వే నివేదికలు బయట పెడుతున్నాయి.  గ్రామాల నుండీ బయటకు పేదల వలసలు పెరుగుతూనే ఉన్నాయి. 18-59 సంవత్సరాల మధ్య రైతుల అకాల,అనారోగ్య మరణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని  రైతు బీమా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు కారణాలేమిటో  ప్రభుత్వం చెప్పాలి కదా ? 
మా పరిశీలనలో మూడు ప్రధాన  కారణాలు కనపడుతున్నాయి. ఒకటి – రాష్ట్ర ప్రభుత్వం గ్రామలలవ ఉండి వ్యవసాయం చేస్తున్న వాస్తవ సాగు దారులను గుర్తించకపోవడం. ప్రతి సీజన్ లో e  క్రాప్ బుకింగ్ పేరుతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతుల వివరాలు సేకరిస్తున్నా, అవి తపుల తడకగా ఉండడానికి ప్రధాన కారణం , ప్రభత్వం వాస్తవ సాగు దారులను నమోదు చేయడానికి నిరాకరించడమే. ఉదాహరణకు రైతు స్వరాజ్య వేదిక 2022 లో చేసిన అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో ఉన్న సాగు దారులలో 36 శాతం కౌలు రైతులే చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో కనీసం 65 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయనుకుంటే, వీటిలో  కనీసం 23 లక్షల కౌలు రైతు కుటుంబాలు ఉంటాయని  అర్థం చేసుకోవాలి. 
వీరిని రాష్ట్ర  వ్యవసాయ శాఖ , E క్రాప్ బుకింగ్ లో పేర్లు నమోదు చేయడం లేదు . వీరికి ప్రభుత్వం దృష్టిలో రైతులుగా గుర్తింపు లేదు. కాబట్టి వారికి ప్రభుత్వం రైతు బంధు పెట్టుబడి సహాయం  అందించడం లేదు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి  వరకూ ప్రతి సంవత్సరం పంచుతున్న రైతు బంధు డబ్బులు 15,000 కోట్లలో కనీసం 6000 కోట్లు వృధాగా వ్యవసాయం చేయని వారికే పోతున్నాయని  అర్థం. 
వ్యవసాయం చేయక పోయినా రైతు బంధు పొందుతున్నవాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, సినీ తారలు, ఉద్యోగులు, టీచర్లు , డాక్టర్లు, లాయర్లు – ఒకరేమిటి? సమాజంలో ఎంతో కొంత ఆర్ధిక వేసులుబాట ఉన్న ప్రతి ఒక్కరూ , గ్రామాలకు వెళ్ళి లక్షలు వెచ్చించి వ్యవసాయ భూములు కొంటున్నారు.  రైతుగా పట్టా పాస్ బుక్ తెచ్చుకుంటున్నారు. ఏ మాత్రం సిగ్గు పడకుండా రైతు బంధు సహాయాన్ని పొందుతున్నారు. పైగా ఈ భూములను గ్రామాలలో ఉండి , జీవనోపాధి కోసం కౌలుకు తీసుకుంటున్న గ్రామీణ పేదలకు వేల రూపాయల కౌలు ధరలతో కౌలుకు ఇస్తున్నారు. ఒకవైపు రైతు బంధు పొందుతూనే, మరో వైపు కౌలు ధరలను కూడా పెంచుకుంటూ పోతున్నారు . దీనికంటే అనైతికత ఏముంటుంది? 
నిజంగా ప్రభుత్వానికి కౌలు రైతులను గుర్తించడం కష్టమా? అసలు కష్టం కాదు . ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. గ్రామాలలో ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. ఒక్క రోజు కంప్యూటర్లు, ప్రింటర్  పెట్టుకుని గ్రామ పంచాయితీ దగ్గర కూర్చుంటే , సాయంత్రానికి కౌలు రైతులను నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు ఇవ్వవచ్చు . ఈ పని ప్రతి  సంవత్సరం కూడా చేయవచ్చు . ఇందు కోసం 2011 భూ అధీకృత సాగు దారుల చట్టం అందుబాటులో ఉంది. స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఈ చట్టం రూపొందించింది. 
ప్రభుత్వం ఈ పని చేయక పోవడం వల్ల ఏమి జరుగుతున్నది ? కౌలు రైతులకు రైతులుగా గుర్తింపు దక్కడం లేదు . వారికి రైతు బంధు అందడం లేదు. వారికి పంట రుణాలు రావడం లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారికి నష్ట పరిహారం కూడా  ఇవ్వడం లేదు. కనీసం పండించిన పంటను కౌలు రైతు పేరుతో కొండడం లేదు. గుర్తింపు కార్డు లేని కౌలు రైతు మరణిస్తే జీవో 194 ప్రకారాం పరవిహారం కూడా ఇవ్వడం లేదు. భూమి లేని కౌలు రైతు మరణిస్తే, వారికి రైతు బీమా కూడా  రావడం లేదు. ఇంతకన్నా అన్యాయం ఏముంటుంది ? 
రాష్ట్రంలో ప్రజలందరినీ సమానంగా చూస్తామని, వివక్ష చూపించమని  రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ప్రభుత్వాలు , ప్రభుత్వ పెద్దలు  లక్షల మంది కౌలు రైతులకు అన్యాయం చేస్తుంటే, ఇది చట్ట బద్ధ పాలన ఎలా అవుతుంది? కౌలురైతులకు స్వంత భూమి అందించడానికి 1973 భూ సంస్కరణల ప్రకారం సాగు భూములు పంచరు. తహామీ ఇచ్చిన జీవో ప్రకారం భూమి లేని దళిత కుటుంబాలకు, ఆదివాసీ కుటుంబాలకు  మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వరు . కేరళ తరహాలో కౌలు రైతులకూ, భూ యాజమనులకూ మధ్య గ్రామ పంచాయితీని  మధ్య వర్తిగా ఉంచి,, కౌలు రైతులకు భరోసా ఇవ్వరు . వారికి బ్యాంకుల నుండీ వడ్డీ లేని రుణాలు  ఇప్పించరు. లక్షలాది కౌలు రైతు కుటుంబాలకు సహాయం అందించకుండా  నష్ట పోయేలా చేసి,వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రభుత్వాన్ని హంతక ప్రభుత్వం అనకుండా ఏమంటాం ? 
రాష్ట్ర వ్యాపితంగా వివిధ జిల్లాల నుండీ కౌలు రైతులు తమ బాధలు సమాజంలో ఉన్న పెద్దల ముందూ, ప్రజా సంఘాల ముందూ, రాజకీయ పార్టీల ముందూ వినిపించడానికి సెప్టెంబర్ 12 న హైదరాబాద్ వస్తున్నారు. ప్రభుత్వం కూడా వింటుందా? వారిని గుర్తిస్తుందా? వారికి సహాయం చేస్తుందా? చూడాలి.

No comments:

Post a Comment