Tuesday, September 26, 2023

మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన...వనపర్తి

*బండరావి పాకుల నిర్వాసిత గ్రామంలో తక్షణమే సౌకర్యాలు పూర్తి చేయాలి*
   
    వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్ మండలంలోని బండరావిపాకుల గ్రామం మరియు కొంకలపల్లి గ్రామాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమయ్యే ఏదుల రిజర్వాయర్లో ముంపుకు గురౌతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందం ఆయా గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలపై అధ్యయనం చేసింది.

      బండరావిపాకుల దాదాపు అయిదు వందల ఇండ్లు, మూడు వేల జనాభాతో, కొండలు, గుట్టల నడుమ చెరువుల కింద సాగయ్యే పన్నెండు వందల ముప్పై రెండు ఎకరాల వ్యవసాయ భూమితో, అడుగు దూరంలో అనేక ఉమ్మడి సహజ వనరులను కలిగిన పెద్ద గ్రామం.
కొంకలపల్లి కూడా రెండువందల ఇళ్ళూ, వెయ్యి మంది జనాభా, 900 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన నూతన పంచాయతీ గ్రామం. ఈ రెండు గ్రామాలనూ రిజర్వాయర్ కోసమని ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నది.

    రెండు గ్రామాలకు చెందిన సొంత భూమి గల రైతులకు ఎకరానికి అసైన్డ్ భూములకు మూడున్నర లక్షలు , పట్టా భూములకు నాలుగున్నర నుండి ఐదున్నర లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం నిర్ణయించి చెల్లించింది. బండరావిపాకులలో ముప్పై శాతం జనాభాగా ఉన్న 120 దళిత కుటుంబాలకు సెంటు పట్టా భూమి లేదు. ఉన్నదంతా, కుటుంబానికి ఒక ఎకరానికి మించని అసైన్డ్ భూమి. ఇప్పుడదీ పోయింది. గ్రామంలో గల 320 బీసీ కుటుంబాలకు సగటున ఒక ఎకరమైనా పట్టా భూమి ఉండేది. భూ పరిహారం తీసుకుని, గడిచిన ఏడేళ్లలో ఈ మూడు వందల ఇరవై కుటుంబాల్లో తిరిగి ఎంతో కొంత భూమి కొనుక్కున్న వాళ్ళు అయిదారు కుటుంబాలకు మించి లేరు. మిగతా కుటుంబాలన్నీ భూమిలేని కుటుంబాలుగా మారిపోయాయి. 
    భూములు అప్పగించిన తర్వాత, పోతున్న ఇండ్లకు ప్రభుత్వం అంచనా వేసిన విలువ తీసుకుని, కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద ఒక్కొక్క ప్లాట్, ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు, కొంత మందికి మరో ఏడున్నర లక్షల రూపాయలు తీసుకొని ప్రజలంతా గ్రామాన్ని ఖాళీ చేయాలి. కానీ, ఇంకా చాలా బకాయిలు పెండింగులో ఉన్నాయి. చాలా అంశాలు పరిష్కారమే కాలేదు.  ఇళ్ల విలువలు చాలా మందికి రాలేదు. ఇంటికీ, పొలాలకూ అనుబంధంగా ఉండే ఏ స్థిరాస్తి విలువనూ ఇంకా చెల్లించలేదు. జీవనాధారాలు కోల్పోయిన భూమి లేని కుటుంబాలకు ఆర్ధిక పరిహారం నిర్ణయమే కాలేదు. కొన్ని భూముల సొమ్ము కోర్టుల్లో ఉంది. ముఖ్యంగా కొత్తగా మేజర్లు అవుతున్న యువతకు కూడా ప్యాకేజీ ఇస్తామని నోటి మాటగా చెప్పినవి అమలవుతాయనే నమ్మకం లేదు. అయినా ముఖ్యమంత్రి గారు సగం కూడా పూర్తికాని, సమీప భవిష్యత్తులో నీళ్లు రాని డ్రై ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసేశారు. ఏదుల రిజర్వాయర్ లోకి ఎప్పటికైనా నీళ్లు వచ్చినా, రాకున్నా బండరావిపల్లి, కొంకలపల్లి గ్రామాల ప్రజలకు వారి పాత గ్రామాల్లో ఇక ఏ హక్కూ లేకుండా అయ్యింది. 

    వర్షపు నీరుతో నిండుతున్న ఏదుల రిజర్వాయర్ వల్ల ఇండ్ల దాకా నీళ్లు వస్తున్నటువంటి కుటుంబాలు ఆగమేఘాల మీద ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఒక సంవత్సర కాలంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. బండరావిపాకుల ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామం ఇప్పుడు గోపాల్ పేట మండలంలో కాకుండా రేవెల్లి మండలంలో శానైపల్లి శివారులో ఇచ్చిన ప్లాట్ లలో కొత్త రూపం తీసుకుంటున్నది. కానీ ప్లాట్ ల మధ్య ఇంకా అంతర్గత రోడ్లు లేవు. ఇతర ఏ సౌకర్యాలూ లేవు. ప్లాట్లలో స్వంతంగా ఇళ్ళు మొదలు పెడితే నిర్మాణ ఖర్చు పది నుండి ముప్పై లక్షలకు తక్కువ కావటం లేదు. వచ్చిన సొమ్ము ఇంటి ప్రారంభం వరకే అయిపోవస్తున్నది. అప్పులు చేసుకుంటూ క్రమంగా ఇండ్లు పూర్తి చేసుకుని దాదాపు 30 శాతం కుటుంబాలు ఇప్పుడు ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలోనే నివసిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఈ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. మంచినీటి సౌకర్యం కల్పించలేదు. తమ ప్రాంతం మీదుగా పోతున్నటువంటి కరెంటు స్తంభాలకు లింకులు వేసి కరెంటు లాక్కొని వాడుకుంటున్నారని ఆరు నెలల కింద ఇరవై కుటుంబాల వారికి ఒక్కొక్కరికి మూడు నుండి ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు. కానీ వీరికి విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనే అధికారులకు కలుగలేదు. 'అభివృద్ధి' పేరిట ప్రజల దగ్గర నుండి భూములు గుంజుకోవటంలో అత్యుత్సాహం చూపే జిల్లా అధికారులు ఈ విషయంలో సిగ్గు పడాలి.

      బండరావిపాకుల అప్పర్ ప్రైమరీ స్కూల్, ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీలో స్కూలు భవనం లేని కారణంగా, ఒక కమ్యూనిటీ హాల్లో ఒకే రూములో ఏడు తరగతులు నిర్వహించబడుతూ నడుస్తున్నది. 
     ఇవి చాలక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడ సంఘటితమౌతారేమోనని నిరంతర నిఘా కోసం ఒక ఇన్నోవా కారు, చేతిలో కెమెరాలతో పొలీసులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇదీ తెలంగాణా ప్రభుత్వం ప్రాజెక్టులకు తమ సర్వస్వాన్నిస్తున్న నిర్వాసితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు.

*మా డిమాండ్లు*:

1. బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాల్లో చాలా మందికి ఇంకా ఆర్థిక పరిహారాలూ, పునారావాస ప్యాకేజీలు రాలేదు. తక్షణమే వాటిని అందించాలి.

2. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వం చట్ట బద్దంగా కల్పించాల్సిన సౌకర్యాలన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. 

3. భూములు కోల్పోయిన వారికీ, వ్యవసాయం చేయటానికి సిద్దంగా ఉన్న ప్రతీ నిర్వాసిత కుటుంబానికీ ప్రాజెక్టు ఆయకట్టులో వారి నివాసానికి  దగ్గరున్న చోట రెండెకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వమే కొని, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.

4. దళితులకు మూడు ఎకరాల భూమి పథకాన్ని నిర్వాసితుల విషయంలో ఖచ్చితంగా అమలు చేయాలి.

5. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు అనుబంధంగా ఉమ్మడి సహజ వనరులు ( చెరువు, గుట్టలు, పచ్చిక బయళ్లు) కూడా విధిగా ఉండాలి. ఇది వారి హక్కుగా గుర్తించాలి.

6. నిర్వాసిత గ్రామాల్లోని గొర్రెల పెంపకంపై ఆధారపడాలనుకునే గొల్ల కురుమలకూ , పాల ఉత్పత్తి దారులకూ వారి ఉపాధిని పునరుద్ధరించే ఏర్పాట్లు చేయాలి.

7. మహిళలకు ఇంటిదగ్గర చేయగల ఉత్పత్తి పనుల విషయంలో నైపుణ్యాలను అందించి ప్రోత్సహించాలి.
స్వయం సహాయక గ్రూపులను తక్షణమే పునరుద్ధరించాలి.

8. నిర్వాసిత కుటుంబాలకు విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయాలి.

9. రాష్ట్రవ్యాప్తంగా భూనిర్వాసితుల స్థితిగతుల అధ్యయనం కోసం వెంటనే ఒక కమీషన్ ను వేయాలి. 

   మా నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక బాధ్యులు డాక్టర్ ఎస్ తిరుపతయ్య , బొల్లి ఆధమ్ రాజు, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు చింతపల్లి అశోక్, స్థానికులు పూర్ణకంటి ఉత్త స్వామి, మిద్దె స్వామి( రాముడు) ఉన్నారు.
 
మానవ హక్కుల వేదిక పత్రికా ప్రకటన
వనపర్తి
26.09.2023.

Courtesy / Source by :
--- డా ఎస్. తిరుపతయ్య
ప్రధాన కార్యదర్శి,
మానవ హక్కుల వేదిక, తెలంగాణ .

No comments:

Post a Comment