Wednesday, September 20, 2023

పంటల ప్రణాళికా, సుస్థిర వ్యవసాయమూ జంటగా సాగాలి

పంటల ప్రణాళికా, సుస్థిర వ్యవసాయమూ జంటగా సాగాలి

Courtesy / Source by :
కన్నెగంటి రవి, 
రైతు స్వరాజ్య వేదిక , 
ఫోన్: 99129 28422
----------------------------------------------
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల, పశువుల ఆహార బధ్రత కోసం భూమి లాంటి సహజ వనరుల సద్వినియోగం ఎంత ముఖ్యమో, వ్యవసాయం లో పంటల ప్రణాళిక కూడా అంతే కీలకమైనది. ఈ పంటల ప్రణాళిక చేయడానికి మన సాగు భూముల పొందిక, స్వభావం, వాతావరణ పరిస్థితులతో పాటు,  సాగు నీరు అందుబాటు, దానికి ఉన్న పరిమితులు,  లాంటి ఇతర అంశాలు కూడా పరిగణనలో పెట్టుకోవాలి. 
దూరపు కొండలు నునుపుగా భావిస్తూ,  విదేశాలకు ఎగుమతుల లాంటి ఎండమావుల వెంట పరుగు లెత్తకుండా, మన రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, పశువుల మేత అవసరాలు, స్థానిక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు  ముడి ఉత్పత్తుల అవసరాలు ప్రధాన ప్రాతిపదికగా ఉంచుకుని  రాష్ట్ర పంటల ప్రణాళిక చేసుకోవాలి. అప్పటికీ రాష్ట్రంలో ఇంకా సాగు భూములు అందుబాటులో ఉంటే, దేశ ఆహార బధ్రత అవసరాల గురించీ, ఎగుమతికి అవకాశం ఉన్న పంటల సాగు గురింఛీ చర్చించుకోవచ్చు . గత మూడేళ్లుగా మన అవసరాలకు మించి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో చూస్తున్నాం కదా? 
లాభదాయక పంటల సాగు పేరుతో రైతులు పరుగు లెత్తేలా ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో బహుళ పంటల వ్యవస్థ పూర్తిగా అంతరించిపోయింది. 90 శాతం భూముల్లో కేవలం మూడు, నాలుగు పంటలు మాత్రమే  పండే మోనో క్రాపింగ్ వ్యవస్థ రాష్ట్రంలో అవతరించింది. పైగా పత్తి, సోయా లాంటి  పంటలను మనం వినియోగించేది తక్కువ. వీటిని సాగు చేయడానికి  అత్యధిక స్థాయిలో సాగు నీరు, రసాయనాలు వినియోగిస్తున్నాము. .  
రాష్ట్రంలో మనుషుల ఆహార అవసరాలను కేవలం వరి బియ్యమే తీర్చవు. పప్పు ధాన్యాలూ , చిరు ధాన్యాలూ , నూనె  గింజలూ , సుగంధ ద్రవ్యాలూ  , కూరగాయలూ , పండ్లూ  కూడా అవసరమే. అలాగే పశువుల మేత తగినంత అందుబాటులో లేకుండా, కేవలం పారిశ్రామిక దాణా పై ఆధారపడి పశుపోషణ చేయడం కూడా కష్టమే.  
మన రాష్ట్రంలో అన్ని రకాల పంటలూ పండే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ పంటల సాగుకు అవసరమైన నేలలూ ఉన్నాయి. పండించడానికి శ్రమజీవులైన రైతులూ ఉన్నారు. కాకపోతే  ఇప్పటి వరకూ ప్రభుత్వానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానమూ, దానికో స్పష్టమైన లక్ష్యమూ లేదు. ఇతరుల సలహాలు పాటించే విజ్ఞతా, నష్టాల నుండీ నేర్చుకుని, మార్చుకునే రాజకీయ  చిత్తశుద్దీ  కూడా ఈ ప్రభుత్వానికి ఉండడం  లేదు. 
మన రాష్ట్ర నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం సూచనలతో తయారైన సమగ్రమైన పంటల ప్రణాళిక ఉంది.  రాష్ట్రంలో ఏయే ఆహార ఉత్పత్తుల అవసరం ఏ మేరకు ఉందో, జిల్లాల వారీగా ఉద్యాన శాఖ చేసిన అధ్యయన నివేదిక కూడా అందుబాటులో ఉంది.  ప్రణాళికను రైతులతో చర్చించి  అమలు చేయడానికి , వ్యవసాయ, ఉద్యాన  శాఖల  విస్తరణ విభాగమూ  ఉన్నాయి.  ప్రభుత్వం చేయవలసిందల్లా ఈ పంటల ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన  విధాన నిర్ణయాలూ, బడ్జెట్ కేటాయింపులూ,  ఆ కేటాయింపులను సకాలంలో విడుదల చేయడమూ.  గత పదేళ్లుగా చేసినట్లు ఏ సీజన్ కు ఆ సీజన్ పంటల ప్రణాళికను  మార్చేయకుండా, కొంత దీర్ఘ కాలం పాటు అమలు చేసే ఓపిక, దృష్టీ కూడా ప్రభుత్వానికి  అవసరం. 
ప్రస్తుతం ఇవన్నీ లోపించడం వల్ల, రాష్ట్ర పంటల సాగు వ్యవస్థ అత్యంత అస్తవ్యస్తంగా తయారైంది. పండించిన రైతులూ సంతోషంగా లేరు. కుటుంబానికి అవసరమైన అన్ని రకాల ఆహార ఉత్పత్తులనూ బయట మార్కెట్ లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి రావడం వల్ల, ఆర్ధిక భారం పెరిగి , వినియోగదారులూ సంతోషంగా లేరు. దళారీ వ్యాపారులూ,  బడా రిటైల్ వాణిజ్య సంస్థలూ మాత్రమే లాభాల పంటతో ఆనందంగా ఉన్నారు. 
ప్రస్తుతం వినియోగిస్తున్న పద్ధతి లోనే, సాగు నీరు  వ్యవసాయానికి అందుబాటులో ఉండాలంటే, వర్షాలు సంవత్సరం పొడవునా ఎంతో కొంత  నిరంతరంగా పడుతూ ఉండాలి. కానీ గత దశాబ్ధ కాలంతో  పోల్చినప్పుడు ప్రస్తుతం వర్షపు రోజులు తగ్గిపోతున్నాయి. తక్కువ వర్షపు రోజుల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, ఈ భారీ, అతి భారీ  వర్షాల  వల్ల, పంటలకు తీవ్రమైన నష్టం కూడా వాటిల్లుతున్నది.  
వానా కాలంలో కురిసిన ఎక్కువ శాతం వర్షపు నీరు ఎక్కడికక్కడ భూమిలో ఇంకడం కాకుండా, వేగంగా ప్రవహించి , వాగులలో, నదులలో, సముద్రంలో  కలసిపోతున్నది.  ఇందుకు ప్రధానంగా మూడు  కారణాలు పని చేస్తున్నాయి.
 ఒకటి – లోతు దుక్కి, దమ్ము లాంటి ( పొలంలో నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలబెట్టేందుకే రైతులు ఈ పని చేస్తారు, వరి పొలంలో కలుపు నివారించడానికి ఈ నీళ్ళను నిలగడతారు. నిజంగా వరి సాగుకు ఇన్ని నీళ్ళు అవసరమే  లేదు. ) మన వ్యవసాయ పద్ధతులు ఒక కారణమైతే, పంటల సాగులో విపరీతంగా వినియోగిస్తున్న రసాయన  ఎరువులు మరో కారణం.  వీటి వల్ల భూములు నీటిని ఇంకించుకునే  స్వభావాన్ని కోల్పోయి, గట్టి పడి పోతున్నాయి. మరీ ముఖ్యంగా వరి, పత్తి మాత్రమే ఎక్కువగా పండించే  మన రాష్ట్రంలో ఇది సర్వ సాధారణంగా మారి పోయింది. భూమిలో తేమను పట్టి ఉంచడానికి మన నేలల్లో అసలు సేంద్రీయ కర్బనమే లేదు. ఇంకిన కొద్దిపాటి భూగర్భ జలాలు కూడా త్వరగా అడుగంటి పోవడానికి మరో ముఖ్య కారణం  రాజకీయ నాయకులతో కుమ్మక్కైన ఇసుక మాఫియా, వాగుల నుండీ,  నదుల నుండీ విచ్చలవిడిగా ఇసుకను తోడేయడం.   
మరో వైపు మన రాష్ట్ర భౌగోళిక స్వభావం రీత్యా , ప్రవహించి వెళ్ళిపోయిన వర్షపు నీటిని, మళ్ళీ భారీ ఎత్తి పోతల ద్వారా వెనక్కు తీసుకు రావాలంటే , తప్పకుండా విద్యుత్ అవసరం ఉంటుంది. తప్పుడు విద్యుత్ ఒప్పందాల వల్ల వినియోగిస్తున్న  విద్యుత్ కూడా అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది.  రైతులు స్వయంగా విద్యుత్ బిల్లులు కట్టకపోయినా, ఈ విద్యుత్  బిల్లులను  ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుండీ చెల్లిస్తే మాత్రమే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుంది. ప్రభుత్వం బడ్జెట్ నుండీ సకాలంలో విద్యుత్  బకాయిలను చెల్లించక పోవడం వల్ల, ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు 50 వేల కోట్ల రూపాయల అప్పులలో కూరుకు పోయాయి.
ఈ అప్పుల నుండీ బయట పడడానికి,  విద్యుత్ సంస్థలు, ఈ విద్యుత్ బిల్లుల భారాన్ని రైతుల నుండీ , ఇతర వినియోగదారుల నుండీ  ఏదో ఒక రూపంలో తప్పకుండా  వసూలు చేస్తాయని, రాష్ట్ర ప్రజలకు గత రెండేళ్ల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 
24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా ,ఆచరణలో కేవలం రోజుకు 10 గంటలు వ్యవసాయానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.  నీరు అందుబాటులో ఉందనే పేరున, సాగు నీరు ఎక్కువ అవసరమయ్యే పంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వర్షాధార పంటలు, దాదాపు కనుమరుగై పోతున్నాయి. వరి, పత్తి, ఆయిల్ పామ్, బత్తాయి, లాంటి పంటలకు చాలా ఎక్కువ నీరు అవసరం. 
రాష్ట్ర వ్యవసాయంలో  రసాయన ఎరువుల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఇవి రాష్ట్ర వాతావరణంలో  గ్రీన్ హౌజ్ వాయువుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భూముల భౌతిక, రసాయన స్వభావాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. భూ గర్భ జలాలను , నదులు, చెరువుల నీటిని విషపూరితం చేస్తున్నాయి. 
భూమికి అందించే పోషకాలలో సేంద్రీయ ఎరువులు వాడని కారణంగా,  రాష్ట్ర నేలలలో జింక్, మెగ్నీషియం, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా వాటి కొరత ఆహారంలో కూడా కనిపిస్తున్నది. పురుగుల, తెగుళ్ళ నివారణకు,కలుపు  నివారణకు విష రసాయనాల  వినియోగం రాష్ట్ర ఆవిర్భావం నాటితో పోలిస్తే, ఐదు రేట్లు పెరిగింది.  ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా, గ్లయిఫోసేట్ లాంటి కలుపు విషాల వినియోగం , కలుపు  విషాలను తట్టుకునే హెచ్.టీ కాటన్ విస్తీర్ణం రాష్ట్రంలో పెరుగుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర వ్యవసాయంలో పర్యావరణ వ్యతిరేకమైన విషయాలే.  మనషుల,ఇతర జీవ జాతుల  ఆరోగ్యానికి హానికరమైనవే. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి తమను  తాము రైతులుగా చెప్పుకునే రాష్ట్రంలో ఈ విష రసాయనాల  విధ్వంసం కొనసాగడం అన్యాయమైన విషయం. 
ఇప్పటికైనా, రాష్ట్రానికి ఒక సమగ్ర పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికా రూప కల్పనలో, అమలులో  క్షేత్ర స్థాయిలో  రైతులను , రైతు సహకార సంఘాలను,  రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను  భాగస్వాములను చేయాలి. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఆనువు గాని ఆయిల్ పామ్  లాంటి పంటలను ప్రోత్సహించడం మానుకోవాలి. అత్యధిక సాగు నీరు అవసరమైన  వరి, పత్తి లాంటి పంటల విస్తీర్ణాన్ని రాష్ట్ర అవసరాల మేరకు మాత్రమే ఉంచుకుని,  మిగిలింది తగ్గించుకోవాలి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు , కూరగాయలు, పండ్ల సాగు విషయంలో రాష్ట్రం స్వయం పోషకం అయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. శాస్త్రీయ జల విధానం రూపొందించి, తక్కువ నీటి వినియోగంతో పంట సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. 
రాష్ట్ర వ్యవసాయంలో, ముఖ్యంగా ఆహార పంటలలో  రసాయనాల వినియోగాన్ని రాబోయే అయిదేళ్లలో పూర్తిగా మానేసేలా, ప్రతి సంవత్సరం కనీసం 20 లక్షల ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సాహానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకు స్పష్టమైన రోడ్ మాప్ తో  సేంద్రీయ వ్యవసాయ విధానం రూపొందించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనుభవాలను కూడా ఇందుకోసం అధ్యయనం చేయాలి. 
వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయాలు, తాము రూపొందించే వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలలో, వ్యవసాయ శాఖ నిర్వహించే పత్రికలో, ప్రచురించే సాహిత్యంలో, ఇతర మీడియా కార్యక్రమాలలో  శాస్త్రవేత్తలు విష రసాయనాలను సిఫారసు చేయడం పూర్తిగా తగ్గించుకోవాలి. రైతులకు, వ్యవసాయ శాఖ  సిబ్బందికి ఈ విషయంలో నిరంతర శిక్షణలు  అందించాలి. ఛత్తీస్ ఘడ్ తరహాలో గ్రామీణ యువతకు,మహిళలకు  కంపోస్ట్ ,ఇతర జీవ రసాయనాల తయారీపై శిక్షణ ఇచ్చి , పెట్టుబడి సమకూర్చి జీవనోపాధులను కల్పించాలి. వీటిని రైతుల పొలాలకు సబ్సిడీపై అందించాలి.  
ఈ అంశాలన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రైతులు, రాజకీయ పార్టీల ముందు చర్చకు పెట్టి, స్పష్టమైన హామీలు రాబట్టాలి.

No comments:

Post a Comment