Friday, September 29, 2023

తెలంగాణ శ్రీ శ్రీ,అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి, తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లును కేటాయించి అలిశెట్టి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీ అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడుగా, ఫోటోగ్రాఫర్ గా అభ్యుదయ కవిగా సమాజం కోసం నిరంతరం శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసాడు. మనసున్న ప్రతి మనిషిని తన కవిత్వంతో కదిలించినవాడు అలిశెట్టి. 

నాటి ఉమ్మడి పాలనలో సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి. దారితప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసినాడు. పేదరికం మీద, మహిళా సమస్యలమీద, పల్లె పట్నం బాధల మీద సమస్త సామాజిక రంగాలలో అసమానతలు, అన్యాయాల మీద తన కవితల బాణాలను గురిపెట్టి కొడుతూ సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల తరఫున బాధ్యత కలిగిన సైనికుడుగా అక్షర పోరాటం చేసినవాడు అలిశెట్టి. సామాజిక బాధ్యతలే తప్ప తన ఇంటి బాధ్యత, తన వంటి బాధ్యత కూడా పట్టకుండా తన జీవితాన్ని కళకే అంకితం చేసిన త్యాగశీలి అలిశెట్టి.

సమాజం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తనువు చాలించిన కవి అలిశెట్టి కుటుంబం నేడు పేదరికంలో మగ్గుతుండడం, భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అలిశెట్టి కుటుంబానికి సరియైన విధంగా సహాయం అందించే చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీ @KTRBRS కు ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు మంత్రి కేటిఆర్ వెంటనే స్పందించి శ్రీ అలిశెట్టి ప్రభాకర్ కు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ను ఇప్పించేందుకు తన కార్యాలయాన్ని ఆదేశించారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దివంగత అలిశెట్టి ప్రభాకర్ భార్య శ్రీమతి భాగ్యమ్మ పేరుతో అసీఫ్ నగర్ లోని జియాగూడలో నిర్మించిన డబుల్ బెడ్రూంల సముదాయంలో వొకదానిని కేటాయిస్తూ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

తమకు డబుల్ బెడ్ రూం కేటాయించినందుకు అలిశెట్టి ప్రభాకర్  భార్య భాగ్యమ్మ, కుమారులు సంగ్రామ్, సంకేత్ సహా ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు, మంత్రి శ్రీ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కవిగా తమ తండ్రి త్యాగాలను గుర్తించి తమను కష్టకాలంలో ఆదుకుని తమకో గూడు నిలిపినందుకు సీఎంకు రుణపడి వుంటామని అలిశెట్టి కుమారులు అన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1707779720501449052?t=9WWWa71Red_b87RoqouZCg&s=19

No comments:

Post a Comment