Wednesday, September 22, 2021

దాడుల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు

జాతీయ వార్తలు : 22/09/2021

దాడుల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు
విరాళాలు వృథా కాలేదు
నా ప్రతి రూపాయి సేవ కోసమే
విరాళాలన్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ లోనే ఉన్నాయి
ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా వెళ్తా
ఐటీ దాడులపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు



!! శనార్తి తెలంగాణ మీడియా (Q group media)సౌజన్యంతో !!
హైదరాబాద్: మంచి చేస్తే ఓర్వలేని రాజకీయ సమాజం మనది. కరోనా విజృంభిస్తున్న సమయంలో గొప్ప మనసు చాటుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనుసూద్. పేదల ఆకలి తీర్చాడు. వలస కార్మికులని సొంత ఖర్చులతో సొంతూళ్లకి తరలించాడు. చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాడు. కరోనా తగ్గుముఖం పట్టినా.. సోనుసూద్ సహాయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న సాయం కావాలని కోరిన వెంటనే స్పందిస్తున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు. ప్రజల దృష్టిలో కనిపించే దేవుడు అయ్యాడు. అలాంటి ప్రజల దేవుడిని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇటీవల సోనుసూద్ నివాసాల్లో ఐడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగురోజులపాటు ముంబాయిలోని సోనుసూద్ నివాసంతోపాటు, మొత్తం అతడికి సంబంధించిన 28 చోట్ల తనిఖీలు నిర్వంచారు. ఈ తనిఖీల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. సోనుసూద్ మొత్తం రూ. 20కోట్లు పన్ను ఎగ్గొట్టారని గుర్తించామని తెలిపారు. కరోనా తొలి వేవ్ సమయంలో సోనూసూద్ ఏర్పాటు చేసిన 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు తెలిపారు. అందులో రూ. 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందన్నారు.


విలువైన ప్రాణం కోసమే నా ప్రతి రూపాయి ఎదురుచూస్తోంది:
ఐటీ దాడులపై తొలిసారి స్పందించిన సోనుసూద్.. 'ఏ విషయంలోనైనా ప్రతిసారీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెపుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోందన్నారు. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించామని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్‌ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోందని సోనూసూద్ ప్రకటించారు. తాజాగా ఐటీ తనిఖీల వ్యవహారంపై మరోమారు స్పందించిన సోనూసూద్ తన ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా వెళ్తా:
సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 'దేశ్ కి మెంటార్' కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకునేందుకు తనను డిల్లీ ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం నింపడానికి ఎవరు పిలిచినా తాను వెళ్తాను. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా వెళ్తాను. అది ఢిల్లీ ప్రభుత్వమా.. గుజరాత్ ప్రభుత్వమా.. బీహార్ ప్రభుత్వమా ? అనేది చూడకుండా వెళ్తానని సోనూసూద్ చెప్పుకొచ్చారు. రూ. 18 కోట్లు ఖర్చు పెట్టడానికి 18 నిమిషాలు చాలు. కానీ తన దృష్టికి వచ్చిన సమస్యలని పరిశీలించి.. అవి వాస్తవమా ? కాదా ?? అని తేల్చాలి.  క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీసి సహాయం చేస్తున్నా. విరాళాలలో ఏం వృథా కాలేదని సోనుసూద్ తెలిపారు. విరాళాలన్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ లోనే ఉన్నాయని.. తన ఫౌండేషన్ ఎఫ్ సి ఆర్ ఏ కిందికి రాదని తెలిపారు.


సోనుసూద్ పొలిటికల్ ఎంట్రీ :
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోనుసూద్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పగ్గాలు సోనుసూద్ కి అప్పగించనున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా దేశం దృష్టి సోనూసూద్ పై పడింది. ఆ తర్వాత ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తో సోనుసూద్ భేటీ, దేశ్ కి మెంటార్' కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం వంటి పరిణామలతో సోనుసూద్ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు జరపడం సంచలనంగా మారింది. ఓ జాతీయ పార్టీ వెనుకుండి.. ఈ దాడులు చేయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
 

No comments:

Post a Comment