Saturday, September 11, 2021

తీన్మార్ మల్లన్నపై పెట్టిన సెక్ష‌న్లు.. కేసీఆర్ ప్రభుత్వానికి వ‌ర్తించ‌వా ??

హైదరాబాద్ : 11/09/2021

తీన్మార్ మల్లన్నపై పెట్టిన సెక్ష‌న్లు.. కేసీఆర్ ప్రభుత్వానికి వ‌ర్తించ‌వా?

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

క వ్యక్తి మరో వ్యక్తిని వేధిస్తే, వేధింపులకు గురైన వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్ప‌డితే, ఆ ప్ర‌య‌త్నం చేస్తే వేధించిన వ్యక్తిపై ఐపీసీ 506 కింద చట్ట ప్రకారం కేసు నమోదు చేయవచ్చు.తీన్మార్ మల్లన్న విషయంలో ఇదే జరిగింది.లక్ష్మీకాంత శర్మ అనే జోతిష్యుడిని మల్లన్న వేధింపులకు గురిచేస్తున్నాడ‌ని, దానికి ఆయన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడన్న‌ది పోలీసులు చెబుతున్న కథ‌నం.చట్టం తన పని తాను చేసుకుంటూపోతే ఎవరికీ ఇబ్బంది ఉండ‌దు.కాకపోతే చట్టం కొందరికి చుట్టం అయితేనే ఇబ్బంది అంటున్నారు సామాన్యులు.రాష్ట్రంలో నిత్యం అనేక ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నాయి. జాబ్ నోటిఫికేష‌న్స్ రాలేదని, వయసు అయిపోతుందని, తల్లిదండ్రుల‌కు భారం అవుతున్నామ‌ని, ఎంత‌ చదువు చదివినా ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతను చూస్తున్నాం. ఎవరి మానసిక ఒత్తిడి కార‌ణంగా వీరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని ప్రశ్నించుకుంటే అందుకు స‌మాధానం.. ప్రభుత్వం అని వస్తుంది. కొందరు యువకులు తమ మరణంవాగ్మూలంలో సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని సుస్ప‌ష్టంగా రాసారు. ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడేళ్లయినా అమలు చేయలేదు. ఇక ఉద్యోగం రాదు, తల్లిదండ్రులకు భారం కావద్దని తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో రాసి చనిపోయారు.నిరుద్యోగులే కాదు కాలువ‌లు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, రోడ్ల కోసం” మా భూములు తీసుకున్నారు.. మా గ్రామాలూ ఖాళీ చేయించారు..నష్టపరిహారం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. ఇలా అనేక హామీలిచ్చారు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీలు అతీగతీలేవు.”ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది, కూతురు పెళ్లి చేయలేకపోతున్నా, కొడుకుని చదివించుకోలేకపోతున్నా. మాకు వచ్చే నష్ట పరిహారం త్వరగా ఇప్పించండి” అని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి నష్ట‌ పరిహారం అందక మానసిక ఒత్తిడికి గురై పెట్రోలు పోసుకొనో, పురుగుల మందు తాగో, ఉరితాడు బిగించుకొనో, ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు అనేకం.వారు ఆత్మహత్య సందర్భంగా మరణ వాంగ్మూలంలో ఈ విషయం చెబుతున్నారు.ఆ కథ‌నాలు మీడియాలో కూడా వస్తున్నాయి.మరి వీరి ఆత్మహత్యలకు ఎవరిని బాధ్యులను చేయాలి? ఎవరి మీద కేసు నమోదు చేయాలో పోలీసులు చెప్పాలి? ఎందుకు కేసులు నమోదు చేయడంలేదో కూడా చెప్పాలని ప్రజలు అడుగుతున్నారు.అధికారులకు ఒక న్యాయం.. సామాన్యుడికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు తాము వడ్డీలకు తెచ్చి పనులు చేస్తే ఆ బిల్లులు రాక, కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతుందని తక్షణమే తమ బిల్లులు చెల్లించాలని చెప్పులు అరిగేలా తిరిగితిరిగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ సర్పంచులు కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు. దీనికి ఎవరిని బాధ్యులను చేస్తారు? ప్రభుత్వాన్నా లేక‌ అధికారులనా? అనేది పోలీసులు చెప్పాల‌ని నిలదీస్తున్నారు. పోలీసుల వేధింపులకు గురై కొందరు, అధికారుల వేదింపుల‌కు గురై ఇంకొంద‌రు, రాజకీయ నాయకుల వేధింపులకు గురై మరి కొందరు కూడా ఆత్మహత్యలకు పాలపడ్డ సంఘటనలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఇప్పటివరకు ఎంతమందిపై 506 కింద కేసులు నమోదు చేసారో చెప్పాలని ప్ర‌శ్నిస్తున్నారు.


అధికారులకు ఒక న్యాయం! తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయమా అని ప్ర‌జ‌లు ప్రశ్నిస్తున్నారు.రెవెన్యూ అధికారులు తన భూమికి పట్టాదారు పాస్ బుక్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు, లంచం ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నారు, తన భూమిని రికార్డులలో మరొకరి భూమిగా చూపిస్తున్నారు వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ మానసిక వత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు వందల సంఖ్యలో ఉంటాయి. పైగా వారు మరణ వాగ్మూలం ఇచ్చి చనిపోయిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి.అయినా ఏ ఒక్కరి మీద కేసు నమోదు చేసిన‌ట్టో, అరెస్ట్ చేసినట్టో దాఖ‌లాలు లేవు. అలాంటి వాటికి పోలీసులు ఉన్నతాధికారులు ఏం చెబుతారని పబ్లిక్ ప్ర‌శ్నిస్తోంది. గతంలో తమకు ఇచ్చిన అసైన్డ్ భూమిని ప్రభుత్వ అవసరాల పేరుతొ ఒక్క నయాపైసా కూడా ఇవ్వకుండా లాక్కోవడాన్ని తట్టుకోలేక దళితులు, ఇతర పేద వర్గాలు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.అనేక సంవత్సరాలుగా ఆ భూమినే ఆధారం చేసుకొని బతుకుతున్నాం.. ఆ భూమి పోతే తాము బతకలేమని మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డవారు అనేకమంది ఉన్నారు.ఇది ప్రభుత్వ వేధింపు కాదా అని దళితులు నిలదీస్తున్నారు. 506 సెక్షన్ కింద ప్రభుత్వ అధికారులపై ఎందుకు కేసు పెట్టకూడదు అని అడుగుతున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి పోడు చేసుకొని బతుకుతున్నాం.. ఇప్పుడు ఆ భూములను ఉన్నపళంగా ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాక్కుంటే తమ బతుకులు ఆగమయ్యాయని మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ ఆదివాసీ గిరిజనులు అనేకమంది వున్నారు. కానీ ఏ ఒక్క ఫారెస్ట్ అధికారిపైన‌ కేసు నమోదు చేయలేదు.

ప్రతిరోజు ఏదో ఒక మూల ప్రభుత్వ విధానాలా కారణంగానో, అధికారుల నిర్లక్ష్యం కారణంగానో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతూనే వున్నాయి. పైగా వారు తమ మరణ వాంగ్మూలంలో ఎవరి కారణంగా తాము ఆత్మహత్యకు పాల్పడ్డామో క్లియ‌ర్‌గా చెబుతున్నారు.అయిన కేసులు నమోదు కావడం లేదు, మొక్కుబడిగా నమోదు చేసిన చర్యలు మాత్రం లేవు. పోలీసులు, రాజకీయ నాయ‌కులు ఒత్తిళ్ల‌తో కాకుండా చట్టం ప్రకారం పనిచేయాలని కోరుతున్నారు.లక్ష్మీకాంత శర్మ ప్రాణం మాత్రమే ప్రాణం, ఆయనపై జరిగిన వేధింపులు మాత్రమే వేధింపులు.. ఇతరులపై జరిగినవి వేధింపులు కావ‌ని పోలీసులు అనుకుంటే అది చట్టం అనిపించుకోదు. చట్టం కొందరికి చుట్టం కాకూడదు.చట్టం అందరికీ సమానం అది అధికారైనా, రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, మరెవరైనా.. అంతేకానీ సామాన్యుడిపై చర్యలు తీసుకుంటాం… రాజకీయ పలుకుబడి, అంగ బలం, అర్ధ బలం ఉన్న వారిపై తీసుకోమంటే న్యాయవ్యవస్థ ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే తాము ప్రజా న్యాయవ్యవ‌స్థలో తేల్చుకుంటామని అంటున్నారు దళిత, బడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలు.


No comments:

Post a Comment