-జూబ్లిహిల్స్ పెద్దల గడీలో మళ్లీ చిల్లర గొడవలు
-పేరుకే మీడియా అధిపతులు- నిత్యం అధిపత్యం పోరు
– పాత అక్రమాలే మార్గం.. అడ్డగోలు సంపాదనే లక్ష్యం
– పదిహేనేళ్లుగా ఒకటే తంతు.. తాజాగా అదే బాగోతం
– చట్టమనే వేలుకు ఫోర్త్ ఎస్టేట్ రింగ్ తొడిగి రింగరింగలా వ్యవహారం
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
రోజుకో వివాదం.. పదిరోజులకో పంచాయతీ అన్నట్టుగా మారుతోంది జూబ్లిహిల్స్ కో-అపరేటివ్ హౌజింగ్ సోసైటీ వ్యవహారం. పదిహేనేళ్లుగా నిత్యం ఏదో ఒక గొడవో, సమస్యతోనో దాని ప్రతిష్ట అంతకంతకు మసకబారుతూనే ఉంది. ఊ.. అంటే సమాజానికి సుద్దులు చెప్పే మీడియా పెద్దలే జుబ్లిహిల్స్ కో- ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో చక్రం తిప్పుతుండటంతో.. ఆ ముసుగులోనే లొసుగులు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఒక మీడియా సంస్థ కాకపోతే.. మరో మీడియా సంస్థ.. పేర్లు మారతాయి కానీ.. తీరు మాత్రం మారదు. ఎవరు పాలకవర్గంలో ఉన్నా.. అదిపత్యం కోసమే నిత్యం కొట్లాట. గతంలో జరిగిన అక్రమాలు బయటపెట్టాలని పంతంతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. ఇప్పుడు మీరు చేస్తున్నది, చేయబోయేది ఏమిటో చెప్పాలంటూ ఎవరైనా అడిగితే మాత్రం ఎక్కడా లేని ఆగ్రహం ముంచుకొస్తోంది. ఇప్పటికే సొసైటీకి సంబంధించిన అనేక వివాదాలు హైకోర్టులో నలుగుతుండగా… తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
హైకోర్టు అదేశాలను కాదని సొసైటీ జనరల్ సెక్రెటరీ మురళీ ముకుంద్ ని తొలగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలోనే మీడియా ముసుగులో దందాలు చేశారని.. కొత్త కమిటీ కూడా అలాగే చేస్తే ఎలా అని ప్రశ్నించడంమే, అలా చేయొద్దని హితవు పలకడమే ఆయన చేసిన తప్పయిపోయింది. కక్షలు, పగలు, ప్రతీకారాలు మాని.. సొసైటీ అభివృద్ధి కొరకు పాటుపడదామని బాధ్యతయుతమైనా పదవిలో ఉండి సూచనలు ఇవ్వడం.. కొత్తగా పెద్దరికం వెలగబెడుతున్న వారికి కోపాన్ని తెప్పించింది. అంతే వెంటనే జనరల్ సెక్రటరీ పదవికి మురళీ ముకుంద్ అనర్హుడైపోయాడు.
శుక్రవారం ఉదయం 11 గంటల వరకే సెక్రెటరీ పదవి తొలగింపు మోషన్ పై మూడు రోజుల పాటు స్టే విధించింది హైకోర్టు. ఆ అదేశాలను పిటిషనర్ తరుపు న్యాయవాది రంగాచార్యులు వాట్సప్ ద్వారా కమిటీకి తెలియజేశారు. కాని జూబ్లిహిల్స్ హౌజింగ్ సోసైటీ మాత్రం ఆ ఆదేశాలను ధిక్కరించి.. కోర్టుకే సవాల్ విసిరింది. ఉదయం11-30కి సెక్రెటరీ పదవికి మురళీ ముకుంద్ అనర్హుడంటూ.. 15 మంది సభ్యులకు గాను 13 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారంటూ.. అవిశ్వాసం ద్వారా అనర్హత వేటు వేసింది. ప్రభుత్వానికి, రిజిస్ట్రార్ సోసైటీకి లేని బాధ తమకెందుకని అధికారులు సున్నితంగా మెలగడంతో.. అసలు పదవికే అక్రమంగా ఎసరు తెచ్చారు సొసైటీ పెద్దలు. మీడియా చేతిలో చెప్పినట్టు వినకపోతే అంతే సంగతలు అని హెచ్చరించడంతో వారి కోరినట్టుగా చేశారు.
అధిపత్యం కోసం తగవులాట – సభ్యుల గోడు పట్టదు!
సోసైటీలో నువ్వు నా పై గెలిచావ్.. క్లబ్‌లో నీపై నేను నెగ్గాను.. అంటూ నిత్యం కొట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నాయి ఆ రెండు ప్రముఖ మీడియా హౌజ్‌లు. మధ్యలో ఓ సోసైటీ స్కూల్ కి ఎంతో సేవలు అందించి ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్న మురళీ ముకుంద్.. వీరి రాజకీయాల మధ్య ఇమడలేకపోతున్నారు. గత కమిటీ తప్పులు చేస్తేనే మనకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని మనం దుర్వినియోగం చేయకుండా సభ్యులకు ఎలా మేలు చేయాలో చేద్దామనే పట్టుదలతో ఆయన ఉన్నారు. కానీ సొసైటీ పెద్దల ఆలోచన మరోలా ఉంది.
తమ చేతిలోనూ మీడియా హౌజ్ ఉన్నా.. వీవీఐపీలు, సెలబ్రెటీలు ఉండే ఏరియాలో మొదటి కమిటీ మీడియాకు వచ్చినంత పేరు ఇప్పుడున్న కమిటీకి రావడం లేదు. పైగా తాము గతంలో జరిగిన తప్పులను వెలికితీస్తామని వచ్చామనే ఒక్కే ఒక్క మొండి సిద్ధాంతంతో ముందుకు వెళ్తుండటంతో.. సొసైటీ సభ్యులకు లాభం కంటే నష్టం ఎక్కువ వాటిళ్లేలా చేస్తోంది ప్రస్తుత కమిటీ.అసలు ఇళ్ల స్థలాలు రాని సభ్యులకు ఏ చేయాలి? వారి సౌకర్యాల సంగతి ఏమిటి? అక్రమాలు కంటిన్యూ కాకుండా ఎలా ఆపగలం? అనే అంశాలను తెరపైకి రాకుండా ప్రస్తుత కమిటీ పాత కక్షలకే ప్రాముఖ్యత ఇచ్చింది. దీంతో గత 40 యేళ్లుగా చిన్న చిన్న అక్రమాలు చేసిన వారిని తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలు జరిగితే.. సోసైటీ యాక్ట్ సెక్షన్ 51 ప్రకారం ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు.. లేదా సీఐడీతో దర్యాప్తు చేయించాలని మరోసారి ప్రభుత్వాన్ని వేడుకోవచ్చు. కాని ఇక్కడ అలాంటిది కాకుండా.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా చేయొద్దని కోరినందుకే .. మెజార్టీ సభ్యులతో నిజాయితీగా ఉండే, సున్నితమైన వ్యక్తిని వారి కమిటీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. నిక్కచ్చిగా ఉంటే తమ పప్పులు ఉడకడం కష్టమనే ఈ దారి ఎంచుకున్నారన్న అరోపణలు వారి నుంచి వినిపిస్తున్నాయి.
సోసైటీ అంటే యూనిటీ.. అది మరిచిపోతే ఎట్లా?
ఏ సోసైటీ అయినా యూనిటీ కోసమే.. అందరి ప్రయోజనాల కోసమే ఉండాలి. కాని నిత్యం అంబోతులా కక్షలు , పగలు అంటూ వెళ్లితే.. బస్తీల్లో ఉండే ప్రజలకు, ఏసియాలోనే అత్యంత కాస్టీ క్లబ్ అయిన జూబ్లీ సోసైటీకి తేడా ఏంటనేదే అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న. సభ్యుల బలం ఉందని ఇష్టం ఉన్నట్లు చేస్తే.. రాబోయో రోజుల్లో సోసైటీకి మరిన్ని కష్టాలు కొనితెచ్చుకుంటున్నట్లే. సొసైటీ కింద ప్రభుత్వానికి చెందాల్సిన భూమి ఉంది.. కానీ కమిటీ సభ్యులే మింగేయాలని చూస్తున్నారు. ఆ బాగోతాలన్నింటినీ ఇప్పటికే గ్రీన్ కో.. ఏలుకో అనే శీర్షికన తొలివెలుగు ప్రత్యేక కథనాలు అందించింది. బస్ డిపోకి ఇవ్వాల్సి ఉన్న భూమిని.. గతంలో కమిటీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. అదే అక్రమాన్నీ తాజా కమిటీ కొనసాగిస్తోంది. గ్రీన్ కోకు ఈ కమిటీలో ఉన్న అధ్యక్షులకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. గతంలో కన్నడ ఛానెల్స్ లో వారు పెట్టుబడులు కూడా పెట్టారు. ఇలా తవ్వుకుంటూ పోతే.. ఎన్నో లీలలు బయటపడతాయి. కాని ప్రభుత్వం చేయాల్సిన పనులను ..కక్షలతో కమిటీ చేయడం సరైనది కాదనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తులని బయటకు పంపేసే కుట్రలు చేస్తున్నారు. వారి తీరు చూస్తోంటే.. మళ్లీ పాత దందాలే మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment