నరేంద్ర మోదీ: 1993లో తొలిసారి అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు? 40 రోజులు అక్కడ ఏం చేశారు
- బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- బీబీసీ ప్రతినిధి
సెప్టెంబర్ 17తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
1978లో ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, నేటి వరకు మోదీ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నారని బీజేపీ నాయకులు తరచూ చెబుతుంటారు.
కాగా, నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత 109 సార్లు విదేశీ యాత్రలు చేసి, 60 దేశాలను సందర్శించారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అత్యధిక రోజులు భారతదేశానికి వెలుపల గడిపింది మాత్రం 1993లో. ఆ సంవత్సరంలో మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.
ఈ పర్యటన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ కొద్ది మందిలో కూడా చాలా మందికి అసలు నరేంద్ర మోదీ ఎందుకు అమెరికా వెళ్లారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు తెలియదు.
బీబీసీ న్యూస్ తెలుగు ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఈ పర్యటన ఎందుకు? మోదీతో పాటు ఎవరెవరు ఉన్నారు?
అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే 'ది అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ - ఏసీవైపీఎల్' తరచుగా అమెరికా, ఇతర దేశాల్లోని యువ రాజకీయ నాయకుల 'ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్'ను నిర్వహిస్తుంటుంది. అమెరికాలోని యువ రాజకీయ నాయకులను ఎంపిక చేసిన దేశాలకు పంపించడం, అలాగే.. ఆయా దేశాల్లోని యువ నేతలను అమెరికా ఆహ్వానించడం.. తద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు, రాజకీయ, సాంస్కృతిక అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చేస్తుంటామని ఏసీవైపీఎల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ క్రమంలోనే 1993లో భారతదేశం నుంచి ఏడుగురు యువ రాజకీయ నాయకులను ఏసీవైపీఎల్ అమెరికాకు ఆహ్వానించింది.
ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), నరేష్ రావల్ (గుజరాత్), హరిశంకర్ గుప్తా (దిల్లీ), భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ (గుజరాత్), జి కిషన్ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), అనంత కుమార్ (కర్ణాటక), జనతా పార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు)లు ఈ టూర్‌కు ఎంపికయ్యారు.
'గడ్డం తీసేసి వెళ్లండని ఆదేశించిన అడ్వాణీ'
ఈ టూర్ అనుభవాలను బీబీసీ న్యూస్ తెలుగుతో పంచుకున్నారు జి కిషన్ రెడ్డి. అప్పట్లో బీజేపీ యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి (స్వతంత్ర హోదా)గా పనిచేస్తున్నారు.
''బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న అడ్వాణీగారు నన్ను ఈ టూర్‌కు ఎంపిక చేశారు. అంతకు ఐదు రోజుల కిందటే మా నాన్న మరణించారు. నేను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలోని మా ఇంటి దగ్గర ఉన్నాను. దీంతో అడ్వాణీగారు నేరుగా నన్ను సంప్రదించే అవకాశం లేకపోవడంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వి రామారావుకు ఫోన్ చేసి, టూర్ గురించి చెప్పారు. రామారావు, ఇతర నాయకులు మా ఇంటికి వచ్చి, ఈ టూర్ ప్రాముఖ్యాన్ని వివరించి, నన్ను ఒప్పించారు. ఒకవైపు మా నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు నేను అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యాను.
హైదరాబాద్ నుంచి దిల్లీ వచ్చి, పార్టీ ఆఫీసులో అడ్వాణీ గారిని కలిశాను. టూర్‌కు ఎంపికైన నరేంద్ర మోదీ, అనంత కుమార్ కూడా వచ్చారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా, తదితర ఏర్పాట్లన్నీ పార్టీ చూసుకుంది. ఆ వివరాలన్నీ అడ్వాణీ గారు మాకు చెప్పారు. అప్పటికి నేను, మోదీగారు గడ్డాలు పెంచాం. దీంతో అడ్వాణీగారు.. 'బయలుదేరే ముందు ఆ గడ్డాలు తీసేయండి' అని మాతో అన్నారు'' అని కిషన్ రెడ్డి చెప్పారు.
40 రోజుల టూర్‌లో ఎక్కడెక్కడికి వెళ్లారు?
1993 జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమై, 40 రోజుల పాటు సాగిన ఈ టూర్‌లో 30 రోజులు అధికారిక పర్యటనలకు కేటాయించగా, మిగతా 10 రోజులను యువ నాయకులు అమెరికాలో గడిపేందుకు కేటాయించారు.
అమెరికాలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి, తిరిగి వెళ్లే వరకూ ఎప్పుడు ఏం చేయాలి? అన్న వివరాలను ఏసీవైపీఎల్ ముందుగానే మోదీ బృందానికి ఇచ్చింది.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, టెక్సాస్, సౌత్ డకోటా, వర్జీనియా, హూస్టన్, తదితర రాష్ట్రాల్లో ఈ బృందం పర్యటించింది. స్థానిక పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు, మెమోరియల్స్, యూనివర్శిటీలు, రాజకీయ ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలను సందర్శించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది.
మోదీ బృందం సందర్శించిన వాటిలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్, పార్లమెంటు భవనం కాపిటోల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్, హాలీవుడ్, సౌత్ డకోటాలోని సిటీ బ్యాంక్, సూ ఫాల్జ్ సిటీ, వాషింగ్టన్ సీనియర్ హైస్కూల్, బాడ్‌లాండ్స్ నేషనల్ పార్క్, రాపిడ్ సిటీ, సూ వ్యాలీ హాస్పిటల్, ఎరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ, రూరల్ బ్రిడ్జ్ వాటర్ ఫ్యామిలీ ఫామ్, మిస్సోరీ రివర్, హోమ్ స్టేక్ బంగారు గనులు, హూస్టన్‌లోని నాసా ఫెసిలిటీస్, హూస్టన్ చానెల్ (పోర్టు) మొదలైనవి ఉన్నాయి.
కొలరాడో కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ మెన్నిస్ (రిపబ్లికన్), సౌత్ డకోటా సెనెటర్ టామ్ డస్కెల్ (డెమొక్రాట్), ఒక్లహామా కాంగ్రెస్ సభ్యుడు మైక్ సైన్ (డెమొక్రాట్), సౌత్ డకోటా డెమొక్రాట్ నాయకుడు స్టీవ్ ఎప్రెన్‌బక్, రిపబ్లికన్ నాయకుడు హెర్బ్ జోన్స్, పీర్రే నగర మేయర్ గ్యారీ గ్రెవ్స్, రాపిడ్ సిటీ మేయర్ ఎడ్ మెక్‌లాగ్లిన్, సౌత్ డకోటా గవర్నర్ వాల్టర్ మిల్లర్, అమెరికా వర్తక సమాఖ్య ప్రతినిధి జెన్నిఫర్ హిల్‌మాన్, అమెరికాలోని భారత రాయబారి సిద్ధార్థ్ శంకర్ రే, తదితరులతో భేటీ అయ్యారు. అలాగే, స్థానిక ప్రజలతోను, విద్యార్థులతోనూ, వాణిజ్య సంఘాల ప్రతినిధులతోనూ మాట్లాడారు. రాజకీయాలు, ప్రజారోగ్యం, విద్య మొదలైన అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
'హిమాలయాలు దాటాక రాజకీయాలు మాట్లాడొద్దు'
భారత యువ నేతల బృందం దిల్లీ నుంచి లండన్, అక్కడి నుంచి న్యూయార్క్ విమాన ప్రయాణం చేసి అమెరికా చేరుకుంది. ఈ బృందంలోని బీజేపీ, జనతా పార్టీలకు కొంత భావసారూప్యం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి, వారికీ రాజకీయ భావజాలం పరంగా పూర్తి వ్యతిరేకత ఉంది. దీంతో.. అమెరికాలో తమ పర్యటన ప్రారంభించడానికి ముందే రాజకీయ వైఖరుల పరంగా ఎలా ఉండాలి? అనేది తాము చర్చించుకున్నామని ఈ బృందంలోని పొంగులేటి సుధాకర్ రెడ్డి బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు.
''భారతదేశం నుంచి బయటకు వచ్చాక, హిమాలయాలు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదు అని మేం అందరం అనుకున్నాం. భారతదేశం గురించి మాత్రమే మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. అయితే, మా పర్యటనలో భాగంగా డెమొక్రాట్, రిపబ్లికన్ నాయకులతో సమావేశాలు జరిగాయి. అప్పుడు కొందరు మా పార్టీ వైఖరుల గురించి అడిగేవారు. అప్పుడు మాత్రం ఎవరి పార్టీ సిద్ధాంతాల గురించి వాళ్లు చెప్పేవాళ్లం'' అని సుధాకర్ రెడ్డి వివరించారు.
నరేంద్ర మోదీ ఎక్కువగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మం, భగవద్గీత, యోగ.. ఇలాంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడేవారని సుధాకర్ రెడ్డి చెప్పారు.
అప్పట్లో తాము రాజకీయంగా విరుద్ధ భావజాల పార్టీలకు చెందినప్పటికీ.. ఈ పర్యటనలో భాగంగా స్నేహితుల్లా గడిపామని, ఈ పర్యటన సందర్భంగానే మోదీ గురించి తెలుసుకున్నానని ఆయన వివరించారు. హిమాలయాలకు వెళ్లడం దగ్గర్నుంచి, రాజకీయాలు, తన ఆలోచనల వరకూ అన్ని విషయాలూ మోదీ తనకు చెప్పారన్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి మొత్తంగా దాదాపు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019లో బీజేపీలో చేరారు.
'భారత ప్రధాని ఇంటిని చూసేందుకు కూడా విదేశీయులు రావాలి'
అమెరికాలో ఉన్న 40 రోజుల్లో నరేంద్ర మోదీ ఎక్కువగా తమతో మాట్లాడింది ఆ దేశం మౌలిక సదుపాయాల పరంగా ఎంత అభివృద్ధి చెందింది, పరిశుభ్రత విషయంలో అమెరికన్లు ఎంత పద్ధతిగా ఉంటారు అన్న అంశాలపైనేనని.. ఆ రెండే మోదీని ఎక్కువగా ఆకట్టుకున్నాయని కిషన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి చెప్పారు. అలాగే, పారిశ్రామికంగా ఆ దేశం ఎదిగిన తీరు, వాళ్లు చేసే ఉత్పత్తులపై కూడా మోదీ ఆసక్తి ప్రదర్శించారని వివరించారు.
''విమానాశ్రయాలు, విశాలమైన రోడ్లు, ఎత్తైన భవనాలు.. వాటి నాణ్యత మోదీని ఆకట్టుకున్నాయి. అలాగే, మేం వెళ్లిన ప్రతి చోటా చాలా శుభ్రత కనిపించేది. అది కూడా ఆయన్ను ఆకర్షించింది. ఒకసారి మేం ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాం. అది వెయ్యి ఎకరాలకు పైగా ఉంటుంది. అక్కడ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను, వాటి పనితీరును తెలుసుకునేందుకు మోదీ ఆసక్తి ప్రదర్శించారు. ఆ టూర్ మొత్తం ఆయన ఒక పుస్తకం, పెన్ను దగ్గర పెట్టుకుని.. అన్నీ నోట్ చేసుకునేవారు'' అని సుధాకర్ రెడ్డి చెప్పారు.
''అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్దకు వెళ్లి బయటి నుంచే ఫొటోలు దిగాం. 'భారతదేశ ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి కూడా ఇంత ప్రాముఖ్యత రావాలి, దానిని సందర్శించేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ఉత్సాహం చూపించాలి' అని అప్పుడు నరేంద్ర మోదీ అన్నారు. హాలీవుడ్‌కు వెళ్లినప్పుడు కూడా అక్కడికి వస్తున్న పర్యటకులను, వారికి ఆకర్షిస్తున్న అంశాలను మోదీ నిశితంగా పరిశీలించారు. గుజరాత్‌లో, భారత్‌లో కూడా ఇలాంటి పర్యటక ప్రాంతాల అభివృద్ధి జరగాలి అనుకున్నాం'' అని కిషన్ రెడ్డి చెప్పారు.
అధికారిక టూర్ కార్యక్రమం 30 రోజులూ ప్యాంటు, షర్టు వేసుకుని, టక్ చేసుకుని, బయటకు వెళ్లినప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఫొటోల్లో కనిపిస్తున్న మోదీ.. మిగిలిన 10 రోజుల్లో మాత్రం భారత్‌లో నిరంతరం తాను ధరించే కుర్తా, పైజమాలనే వేసుకున్నారు.
శాఖాహారి అయిన మోదీ భోజనానికి ఎక్కడా ఇబ్బంది పడలేదని, టూర్ ముగిసిన తర్వాత మాత్రం తనకు తెలిసిన గుజరాతీలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి, వారి ఇళ్లకు వెళ్లారని, తమను కూడా తీసుకెళ్లారని కిషన్ రెడ్డి తెలిపారు.
అమెరికాలో మోదీ విండో షాపింగ్
అధికారిక టూర్‌లో భాగంగా పలు నగరాలను మోదీ బృందం సందర్శించింది. ఈ పర్యటన మొత్తాన్ని కట్టుదిట్టంగా ప్లాన్ చేసిన ఏసీవైపీఎల్.. మధ్యమధ్యలో భారతీయ రెస్టారెంట్లలో భోజనానికి, స్థానికంగా షాపింగ్ చేసేందుకు కూడా సమయాలను కేటాయించినట్లు టూర్ షెడ్యూల్‌ను బట్టి తెలుస్తోంది.
అమెరికాలో చాలా షాపింగ్ ప్రదేశాలకు తాము వెళ్లామని, చాలా వస్తువులు, బట్టలు చూసేవాళ్లమని, కానీ.. వాటిని పెద్దగా కొనేవాళ్లం కాదని కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీకి అమెరికాలోని గుజరాతీ వ్యాపారవేత్త, ఒక హోటల్ యజమాని చందు కుమార్ పటేల్ మూడు రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చారు. ''ఒకరోజు మేం షాపింగ్‌కు వెళ్లాం. అక్కడ తనకు నచ్చిన అన్ని వస్తువులనూ మోదీ చాలాసేపు పరిశీలించేవారు. ఆ వస్తువును ఎందుకు తయారు చేశారు? ఎలా తయారు చేశారు? అని ప్రశ్నించేవారు. వాటిని కొనాలన్న ఉద్దేశ్యం మాత్రం ఆయనకు లేదు. కానీ, వాటి గురించి తెలుసుకోవాలన్న తపన ఉండేది'' అని 2014లో ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీకే పటేల్ చెప్పారు.
అమెరికాలోని మౌలిక సదుపాయాలను, ప్రజలకు అందుతున్న మెరుగైన సేవలను మోదీ ఇష్టపడ్డారని.. తదనంతర కాలంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లోనూ, ప్రధాన మంత్రిగా భారతదేశంలోనూ ఆనాటి తన అనుభవాలతో చాలా కార్యక్రమాలు చేపట్టారని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ టూర్‌కు పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చింది?
ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కారణంగానే 1993లో నరేంద్ర మోదీ అమెరికాను సందర్శించగలిగారని ఆంధ్రజ్యోతి దినపత్రిక అసోసియేట్ ఎడిటర్, 'పీవీ విప్లవ తపస్వి' పుస్తక రచయిత ఎ కృష్ణారావు బీబీసీ న్యూస్ తెలుగుతో అన్నారు.
అప్పటి వరకూ రష్యా అనుకూల వైఖరిని ప్రదర్శించిన భారత్, ఇందిరా గాంధీ కాలంలో కొంత స్వతంత్రంగా వ్యవహరించిందని, అయితే.. అమెరికాతో సాన్నిహిత్యం లేకపోతే భారతదేశం అభివృద్ధి సాధ్యం కాదని పీవీ గ్రహించారని కృష్ణారావు చెప్పారు.
అప్పట్లో పీవీ నరసింహారావు అమెరికా పర్యటనకు వెళ్లడం, అధ్యక్షుడు బిల్ క్లింటన్ పీవీ భుజంపై చెయ్యి వేయడం, 'మీ (భారత్) చేతిని (అధ్యక్షుడు, బలవంతంగా) మెలితిప్పారా? (ఈజ్ యువర్ ఆర్మ్ ట్విస్టెడ్)' అని వైట్‌హౌజ్‌లో విలేకరులు ప్రశ్నించడాన్ని అప్పట్లో పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
భారతదేశ అభివృద్ధి కోసం, ఆర్థిక ప్రగతి కోసం అమెరికాతో సన్నిహితంగా ఉండేందుకే పీవీ నరసింహారావు ప్రతిపక్ష నాయకులైన వాజ్‌పేయి, అడ్వాణీలను కూడా అమెరికా పంపించారని కృష్ణారావు చెప్పారు.
ఆ క్రమంలోనే యువ నాయకులను అమెరికా పంపించాలని నిర్ణయించిన పీవీ, ఈ టూర్‌లో పాల్గొన్న వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని అమెరికాలోని భారత రాయబారి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు సిద్ధార్థ శంకర్ రేను ఆదేశించారని చెప్పారు.
ఈ టూర్ నరేంద్ర మోదీకి అన్ని విధాలుగా ఉపయోగపడిందని, ఈ అనుభవాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకున్నారని కృష్ణారావు తెలిపారు.
''1991 ఎన్నికల్లో నరేంద్ర మోదీ తన మార్కును ప్రదర్శించారు. స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో స్థానిక నాయకుల్లో కొందరితో మోదీకి విభేదాలు వచ్చాయి.
దీంతో 1992 నుంచి 94 వరకూ ఆయన రాజకీయాల్లో చురుగ్గా లేరు. అప్పుడే అహ్మదాబాద్‌లో 'సంస్కార ధామ్' అనే పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల కోసం దేశభక్తి గీతాలు కూడా రాశారు. అలాంటి సమయంలోనే అడ్వాణీ మోదీని ఈ టూర్‌కు ఎంపిక చేశారు.
తర్వాత అడ్వాణీయే 1994లో మోదీని దిల్లీ తీసుకువచ్చి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. స్థానిక నాయకులతో విభేదాలు వచ్చినప్పుడు సైలెంట్ అయిన మోదీ.. అమెరికా పర్యటనకు వెళ్లి అంతర్జాతీయ అవగాహనను తెచ్చుకున్నారు'' అని కృష్ణారావు చెప్పారు
No comments:
Post a Comment