Wednesday, September 8, 2021

చీటర్స్ ప్యారడైజ్- గజం జాగా లేదు.. 150 కోట్ల టార్గెట్

హైదరాబాద్ : 09/09/2021

చీటర్స్ ప్యారడైజ్- గజం జాగా లేదు.. 150 కోట్ల టార్గెట్

– మాటలతో కోటలు..కోట్లకు ఎసరు
– పేరు ఎలిగాన్స్..చేసేదంతా ఫ్రాడ్
– ప్రీ లాంచ్ పేరుతో దోపిడీ..నమ్మినవారికి టోపీ
– రూ.150 కోట్ల టార్గెట్..రూ.35 కోట్ల వసూల్
– తొలివెలుగు స్టింగ్ లో బయటపడ్డ నిజాలు

హైదరాబాద్ మహానగరం. మూడు కబ్జాలు..ఆరు మోసాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే దందాలు అన్నీ ఇన్నీ కావు. సిటీ నలు దిక్కుల నుంచి లెక్కేసుకొస్తే రియల్ మోసాలు కోకొల్లలు.కంపెనీ పేర్లేమో ఘనంగా ఉంటాయి.కానీ..చేసే పనులే 420 పనుల్లా అనిపిస్తాయి.తాజాగా ఎలిగాన్స్ పేరుతో జరుగుతున్న పక్కా ఫ్రాడ్ బిజినెస్ ను వెలుగులోకి తెచ్చింది తొలివెలుగు.తెల్లాపూర్, కొల్లూర్ ఓఆర్ఆర్ వద్ద గుంట భూమి లేకుండానే 12 ఎకరాల 30 గుంటల భూమి ఉందని ప్రజలను నమ్మిస్తోంది.అపార్ట్ మెంట్లు కట్టిస్తామని కోట్లు దండుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటోంది.ఇప్పుడు కొంటే స్క్వేర్ ఫీట్ రూ.3,300 అంటూ బుట్టలో వేసుకుంటున్నారు కంపెనీ ప్రతినిధులు. తర్వాత రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలి..45 రోజుల్లోనే డబ్బులన్నీ కట్టేయాలంటూ షరతులు పెడుతున్నారు.2025 నాటికి చక్కటి అపార్ట్ మెంట్ మీ చేతిలో పెడతామని..ఓ గ్రాఫిక్స్ డిజైన్ ను చూపించి నమ్మిస్తున్నారు.హెచ్ఎండీఏ అనుమతులు 9 నెలల్లో వస్తాయి.. రెరా ఓకే అన్నాక ఇదే అపార్ట్ మెంట్ ను స్క్వేర్ ఫీట్ రూ.8 వేలకు అమ్ముతామని గాల్లో లెక్కలు వేస్తున్నారు.

కోకాపేట తర్వాత డిమాండ్ ఉన్న ఏరియా కావడం..చుట్టూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పనులు జరుగుతుండటం వీరికి వరంగా మారింది. భూమి ఖాళీగా ఉండటంతో ఎంత రేట్ అయినా పెట్టి సొంతం చేసుకుంటామనే ధీమాతో ఇప్పటి నుంచే పబ్లిక్ నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నారు.కొంత భూమికి అడ్వాన్సులు ఇచ్చి అర్భాటం చేస్తున్నారు. దొరికిన కాడికి దొచుకుంటున్నారు.ప్రాజెక్ట్ పేరు బర్డ్స్ ఇన్ పారడైజ్..దానికి తగ్గట్టే స్వర్గంలో పక్షుల్లా బతికేయొచ్చని జనాన్ని ఊహల్లోకి నెట్టేస్తున్నారు.బిల్డర్స్ ఎలిగెన్స్ డెవలపర్స్,నెస్ట్ మేకర్స్ పేర్లు విని ప్రాజెక్ట్ ఎంతో క్లియర్ అని సంబరపడుతున్నారు జనాలు.చాలామంది సాఫ్ట్ వేర్స్ రియల్ ఎస్టేట్ పై అవగాహాన లేకపోవడంతో..కోట్లాది రూపాయలను కట్టేస్తున్నారు.ఇప్పటికే 55 మందికి అమ్మకం జరిపినట్లు తెలుస్తోంది.డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కు రూ.50 నుంచి రూ.60 లక్షలు చెబుతుండడంతో చాలామంది డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా ప్రీలాంచ్ పేరుతో 200 ఫ్లాట్స్ అమ్ముకోని రూ.150 కోట్లతో భూమిని కొనుగోలు చేసి ప్రాజెక్ట్ ప్రారంభించాలని అతి తెలివితో వ్యాపారం చేస్తున్నారు నిర్వాహకులు.

2018లో వినోద్ కుమార్ వాసిరెడ్డి, గోపాల కృష్ణ కొల్లి కలిసి రూ.లక్షతో కంపెనీ ఇన్ కార్పొరేషన్ చేశారు. గతంలో ఏం చేయకుండానే ఆ ప్రాజెక్ట్ చేశాం..ఈ ప్రాజెక్ట్ నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారు.నెస్ట్ మేకర్స్ పేరుతో మనోజ్ఞ, భూపాల్ రెడ్డి అనే వ్యక్తులు ఇందులో ఉన్నట్లు అక్కడ పనిచేసేవారు చెబుతున్నారు.ఇలా మోసాలకు పాల్పడితే వీరంతా జైలుకి వెళ్లడం తప్పదని ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్న వారు హెచ్చరిస్తున్నారు.ఎదులనాగులపల్లిలో ఎలిగాన్స్ చూపిస్తున్న భూమి సర్వే నెంబర్ 29, 30, 31, 32, 41, 42, 43లో ఉండాలి. కానీ కంపెనీ పేరు మీదగానీ దానికి సంబంధించిన వారి పేర్ల మీదగానీ లేదు. అయితే 45 రోజుల్లో డబ్బులు చెల్లిస్తే..80 గజాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని నమ్మబలుకుతున్నారు.ఎలాంటి లేఅవుట్ లేకుండానే భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని అంటున్నారు. ఒక వేళ చేసినా.. నిర్మాణ అనుమతులు ఎలా వస్తాయనే ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు.

నిజానికి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలాగే మోసాలకు పాల్పడుతున్నాయి. తొలివెలుగు స్టింగ్ ఆపరేషన్ లో సాస్ కంపెనీ బాగోతం బయటపడింది. డౌన్ టౌన్ పేరుతో అనుమతులు లేకుండానే డబ్బులు తీసుకుంటున్నారు. తాజాగా ఎలిగాన్స్.. ఇలా ఇంకా మీడియా కంట పడకుండా ఎంతోమంది రియల్ ముసుగులో మోసాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. రెరా యాక్ట్ వచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే సిబ్బంది కొరతతో తాము ఏం చేయలేకపోతున్నామని అంటున్నారు రెరా అధికారులు.


No comments:

Post a Comment