బిగ్‌ బ్రేకింగ్.. తీన్మార్ మల్లన్నకు బెయిల్ నిరాకరణ

దిశ మీడియా, తెలంగాణ బ్యూరో ట్విట్టర్ సౌజన్యంతో : 

తీన్మార్ మల్లన్నకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ తీన్మార్ మల్లన్న భార్య మత్తమ్మ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబరు 14వ తేదీకి వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్నా కుమార్ రెడ్డి వాదిస్తూ, పెండింగ్ కేసులకు సంబంధించి చిలకలగూడ పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41-ఏ ప్రకారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు సానుకూలంగా స్పందించి హాజరయ్యారని, రెండోసారి మాత్రం అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారని కోర్టుకు వివరించారు. మరోసారి అవకాశం ఇవ్వకుండా నేరుగా ఐపీసీలోని సెక్షన్ 306తో పాటు రెడ్ విత్ 511 సెక్షన్ ప్రకారం అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారని అన్నారు.

ఇప్పటివరకు తీన్మార్ మల్లన్నపై నమోదైన 31 కేసుల్లో 14 చిలకలగూడ సంఘటన తర్వాతనే నమోదయ్యాయని గుర్తుచేశారు. మల్లన్నపై నమోదు చేసిన సెక్షన్లను తొలగించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు బెంచ్, ప్రస్తుతం కింది కోర్టులో మల్లన్న బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నందున హైకోర్టు తనంతట తానుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వీలుకాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించి.. తదుపరి విచారణను సెప్టెంబర్ 14 వాయిదా వేసింది.