బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో గొంతెత్తరు ఎందుకు?
- దిల్‌నవాజ్ పాషా
- బీబీసీ ప్రతినిధి
''కొత్త నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో, సరికొత్త ఉత్సాహంతో గుజరాత్ అభివృద్ధి ప్రయాణం కొనసాగాలి. ఈ ఉద్దేశ్యంతోనే నేను గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను.''
రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపానీ ఈ విషయాన్ని చెబుతూ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలతోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు స్పష్టమవుతోంది.
కేంద్రం, రాష్ట్రాల నాయకత్వాలలో మార్పులు చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది?
విజయ్ రూపానీ పదవికి రాజీనామా చేయడం అనూహ్యంగా జరగలేదు. దీని వెనకున్న బలమైన కారణం ఏంటి?
పదవీకాలం పూర్తిగా ముగియకుండానే, మధ్యలోనే వైదొలిగిన మొదటి బీజేపీ నాయకుడు రూపానీ మాత్రమే అని చెప్పలేం.
ఎందుకంటే, కేవలం నెలన్నర క్రితమే కర్ణాటకకు చెందిన కీలక నాయకుడు బీఎస్ యడ్యూరప్పను కూడా బీజేపీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది.
గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన అనంతరం యడ్యూరప్ప, తనపై కేంద్రం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు.
ఇకపై పార్టీని బలపేతం చేసేందుకు పనిచేస్తానని, తాను సీఎంగా ఉన్న సమయంలో పార్టీ బలహీనంగా ఉందని యడ్యూరప్ప అన్నారు.
ఉత్తరాఖండ్‌కు సీఎంగా ఎన్నికైన తీరథ్ సింగ్ రావత్, ఆ పదవిలో కనీసం కుదురుకోకముందే పార్టీ ఆయన్ని ముఖ్యమంత్రిగా తప్పించింది.
ఈ ఏడాది మార్చిలోనే ఉత్తరాఖండ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయగా... ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
కానీ జూలై తొలి వారంలోనే పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా ఆయనను ఆదేశించారు. దీంతో తీరథ్ సింగ్ మారుమాట్లాడకుండా కేంద్ర నాయకత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపారు.
అసోంలో కూడా సీఎంగా శర్బానంద సోనోవాల్‌ను తప్పించి హిమంత బిస్వ శర్మకు అవకాశమిచ్చింది. ప్రస్తుతం సోనోవాల్‌ను కేంద్రంలో మంత్రిగా నియమించింది.
పదవీకాలం పూర్తికాకుండానే అధికారం నుంచి తప్పుకున్న వీరెవ్వరు కూడా అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తం చేయలేదు.
నిరసన, అసంతృప్తి వ్యక్తం చేయకపోవడానికి కారణమేంటంటే, ఒకవేళ బీజేపీ అధిష్టానానికి వ్యతిరేకంగా తాము గొంతెత్తినా పెద్దగా ప్రయోజనం ఉండదని, పార్టీలో స్థానం కోల్పోయే అవకాశం కూడా ఉందని వారికి తెలియడం వల్లే నిశ్శబ్ధంగా పదవి నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంత సులభంగా బీజేపీ, నాయకుల్ని ఎలా తొలగిస్తోంది?
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ప్రదీప్ సింగ్ ప్రకారం, బీజేపీ ఒక క్యాడర్ ఆధారిత పార్టీ. ఇందులో క్యాడర్ మద్దతు ఉన్నంతవరకు మాత్రమే ఒక వ్యక్తి నాయకుడిగా ఉండగలుగుతారు.
''ఇలా క్యాడర్ ఆధారిత పార్టీల్లో, అధిష్టానం మనవెంట ఉన్నంత వరకు మాత్రమే మనం నాయకుడిగా మనగలుగుతాం. క్యాడర్ ఏ రోజైతే మనల్ని బహిష్కరిస్తుందో ఆనాటి నుంచే ఆ నాయకుడికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఒకవేళ అధిష్టానానికి ఎదురునిలిస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీ నాయకులందరికీ తెలుసు. కల్యాణ్ సింగ్ (యూపీ), శంకర్ సింగ్ వఘేలా (గుజరాత్), ఉమా భారతి (మధ్యప్రదేశ్) ఇందుకు చక్కని ఉదాహరణలు. పార్టీ నుంచి వీరికి మద్దతు లేకపోవడంతోనే వీరంతా తమ పదవుల నుంచి బయటకు రావాల్సి వచ్చింది'' అని ప్రదీప్ సింగ్ చెప్పారు.
మరోవైపు, విజయ్ రూపానీని తొలగించడాన్ని సరైన శస్త్రచికిత్సగా మరో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది వర్ణించారు. వ్యాధి పూర్తిగా ముదరకముందే బీజేపీ దాని మూలాలను నాశనం చేసింది అని ఆయన ఉదహరించారు.
''ఒకవేళ మనకేదైనా తీవ్ర అనారోగ్యం చేస్తే, దాన్ని నయం చేయడానికి శస్త్రచికిత్సే మార్గమైతే వీలైనంత తొందరగా శస్త్రచికిత్స చేయడం అవసరం. అలా కాకుండా పారాసిటమాల్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కానీ వ్యాధి ముదురుతుంది. రూపానీని బీజేపీ ఒక వ్యాధిగా భావించిందే తప్ప విరుగుడుగా అనుకోలేదు. అందుకే ఆ వ్యాధి మూలాలను తుంచేసింది'' అని త్రివేది చెప్పుకొచ్చారు.
పదవి నుంచి తప్పించినప్పటికీ నేతలు నిరసన వ్యక్తం చేయకపోవడానికి మరో కారణముంది. అదేంటంటే, ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ నాయకత్వం బలంగా ఉంది. నిరసనలు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం కలగదు.
''జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత ప్రజల నుంచి ఓట్లను రాబట్టగలిగే సామర్థ్యమున్న మరో నేత ప్రధాని నరేంద్ర మోదీ. ఎవరికైతే ప్రజా ఓట్లను ఆకర్షించగలిగే సామర్థ్యం ఉంటుందో, పార్టీలో వారి మాటే చెల్లుతుంది. ప్రస్తుతం బీజేపీలో నరేంద్ర మోదీ ఆ తరహా నాయకుడే. ఆయన పేరు చెబితే ఓట్లు రాలుతాయి. తమ విజయంలో నరేంద్ర మోదీ చరిష్మా పెద్ద పాత్ర పోషిస్తుందనే విషయం బీజేపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ తెలుసు. అందుకే బీజేపీ నాయకులెవరూ కేంద్ర నాయకత్వానికి ఎదురు మాట్లాడే సాహసం చేయరు.'' అని ప్రదీప్ సింగ్ అన్నారు.
విజయ్ రూపానీ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేయట్లేదంటే... తాను సొంతంగా ఓట్లను గెలవలేననే విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన కేంద్రం నిర్ణయానికి ఆమోదం తెలిపారు. 2017లో ఎలాంటి సిఫారసులు లేకుండానే బీజేపీ కేంద్ర నాయకత్వం, విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా కూర్చొబెట్టింది. ఇప్పుడదే నాయకత్వం ఆయనను బలహీనుడిగా భావిస్తోంది. అందుకే పదవి నుంచి తప్పించింది.
ఎందుకు రూపానీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలిగించారు?
దీనికి స్పష్టమైన కారణం ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రూపానీ నాయకత్వంలో పార్టీ ఆశించిన మేర రాణించలేదని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో, పార్టీ చిన్న రిస్క్ కూడా తీసుకోవాలనుకోదు అని విశ్లేషకులు చెబుతున్నారు.
''2017లో విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా చూపించిన బీజేపీ, ఎన్నికల్లో కష్టంగా విజయం సాధించగలిగింది. విజయ్ ప్రభుత్వాన్ని నడిపిస్తారేమో కానీ ఆయన ఓట్లను సాధించలేరనే విషయం బీజేపీకి తెలుసు. అందుకే సరైన సమయం చూసి ఆయనను తప్పించారు. నా వరకైతే, వారు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు రూపానీని తొలగించడం, బీజేపీకి లాభం చేకూరుస్తుంది'' అని ప్రదీప్ సింగ్ పేర్కొన్నారు.
ఎవరో సిఫారసు చేయడం వల్ల విజయ్ రూపానీని గుజరాత్ సీఎంగా నియమించలేదు. ఆయనను కొంత కాలం కోసం మాత్రమే ఆ కుర్చీలో కూర్చోబెట్టారనేది వాస్తవం. కానీ అనుకున్నదాని కంటే ఆయన ఎక్కువ సమయమే ఆ పదవిలో ఉన్నారు. పెద్ద కులాల నాయకుల మధ్య పోటీని తగ్గించడానికి బీజేపీ, చాలా రాష్ట్రాల్లో తటస్థ కులాలకు చెందిన నాయకులను ముఖ్యమంత్రులుగా నియమించింది. రూపానీని కూడా అదే వ్యూహంతో పీఠమెక్కించింది.
కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విముఖత పెరగడం కూడా రూపానీని తొలగించడానికి ఒక కారణంగా చెబుతారు. కానీ ఇక్కడ కుల సమీకరణాలు పెద్ద పాత్ర పోషించాయని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఇటీవల సూరత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో, ఎలాంటి బలమైన మద్దతు లేకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లను గెలుపొందింది. ఇది బీజేపీ శిబిరంలో ఆందోళనకు కారణమైంది.
విజయ్ రూపానీ 'జైన్' సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రంలో ఈ వర్గం వారు కేవలం 2 శాతమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైన పటీదార్లు, బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారు.
''విజయ్ రూపానీ రాష్ట్రంలో కోవిడ్‌ను నియంత్రించలేకపోయారు. దీనివల్ల రాజకీయంగా పార్టీకి నష్టం కలిగిందని చెబుతున్నారు. కానీ కొంతవరకే ఇది కరెక్ట్. అసలు విషయాన్ని గమనిస్తే, రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైన పటీదార్లు, విజయ్ పట్ల వ్యతిరేకతను కలిగిఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చని పార్టీ నమ్ముతోంది'' అని విజయ్ త్రివేది వ్యాఖ్యానించారు.
రూపానీని తొలగించడం ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నారు?
ఈ చర్య ద్వారా రెండు స్పష్టమైన సందేశాలు పంపిస్తున్నారని విశ్లేషకులు నమ్ముతున్నారు. అందులో ఒకటి, ఎన్నికల్లో పార్టీకి విజయం అందించగలిగే సత్తా ఉన్న నాయకులు మాత్రమే బీజేపీలో ఉంటారు. రెండోది, పార్టీ అభివృద్ధిపై కేంద్ర నాయకత్వం దృష్టి సారిస్తోందని తెలియజెప్పడం.
''పార్టీని పటిష్టపరచడం కోసం జరుగుతోన్న పనిపై కేంద్ర నాయకత్వం సీరియస్ నిఘా పెట్టిందనడానికి నిదర్శనం రూపానీని తొలిగించడమే. పార్టీని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పార్టీ భావించినప్పుడల్లా, అది కఠినమైన నిర్ణయాలను తీసుకుంటోంది'' అని విజయ్ త్రివేది అన్నారు.
''తప్పును సరిదిద్దుకోవడం తప్పేం కాదు. మీరెప్పుడైతే తప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలుసుకుంటారో, అప్పుడే వెంటనే సరైన నిర్ణయం కూడా తీసుకుంటారు. పార్టీ, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్‌ను తప్పించి త్రినాథ్ సింగ్ రావత్‌ను సీఎంగా చేసింది. కానీ ఎప్పుడైతే తప్పుడు నిర్ణయం తీసుకున్నామని పార్టీ గుర్తించిందో, వెంటనే ఆయనను తప్పించి పుష్కర్ సింగ్ ధామీని సీఎంగా చేసి తప్పును సరిదిద్దుకుంది. బీజేపీ, తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉంది. అందుకు పార్టీలో ఎవరూ సంకోచించడం లేదు'' అని త్రివేది అన్నారు.
ఎన్నికల్లో విజయం కోసం రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ సందేశాలు పంపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ అన్నారు. ''ఉత్తరాఖండ్‌లో ఇద్దర్ని తొలగించి, మూడో ముఖ్యమంత్రిని నియమించడం చాలా పెద్ద రిస్క్. కానీ బీజేపీ ఆ సాహసం చేసి మరీ మూడో ముఖ్యమంత్రిని నియమించింది. ఇప్పుడు బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైనదిలాగే అనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.
అదే సమయంలో, ఇలా నేతల్ని తొలగించడం ద్వారా... తప్పు చేస్తే ఎవరికైనా ఉద్వాసన ఖాయమనే భయాన్ని పార్టీలోని మిగతా నాయకుల్లో కలిగించడంలో బీజేపీ సఫలమైందని విజయ్ త్రివేది అన్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినంత మాత్రానా, పార్టీలోని మిగతా నేతలకు అవకాశాలు లేవని అర్థం కాదని బీజేపీ అధిష్టానం చెప్పకనే చెబుతోంది. ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమయ్యే వారికి సముచిత స్థానం దక్కుతుందనే సందేశాన్ని కూడా పంపుతోంది.
ఎన్నికల్లో విజయంపైనే బీజేపీ దృష్టి
ఎలక్షన్లలో విజయం సాధించే నాయకులే ఇప్పడు బీజేపీకి ముఖ్యం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఒక నాయకుడికి ఎన్నికల్లో గెలిచే శక్తి ఉంటే, అతని వైఫల్యాలను పక్కకు పెడుతున్నారు.
ఉదాహరణకు, ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా నిర్వహణా వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ యోగి ఆదిత్యనాథ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించలేదు. పైగా ఆయనకు మరింత పవర్‌ను కట్టబెట్టింది.
''ఎందుకంటే, యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీని గెలిపించగలరని పార్టీ అధిష్టానం నమ్ముతోంది. గుజరాత్ ఎన్నికల్లో రూపానీ గెలవలేరని పార్టీ భావించింది. ప్రస్తుత సమయంలో ఎన్నికల్లో గెలిచే సామర్థ్యమున్న నాయకులకే బీజేపీ అధిక ప్రాధాన్యతనిస్తోంది.''
''కర్ణాటకలో యడ్యూరప్పతో ఎన్నికల్లో గెలవలేమని భావించిన బీజేపీ, పెద్ద స్థాయి నాయకుడైనప్పటికీ ఆయనను పదవి నుంచి తప్పించింది. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడమే ఇప్పుడు పార్టీకి అత్యంత ముఖ్యమైన అంశం. రాజకీయంగా ప్రాధాన్యమైన అంశం కావడం వల్లే విజయ్ రూపానీని తొలగించాలనే నిర్ణయానికొచ్చింది'' అని త్రివేది పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలను తీసుకోలేకపోతోంది?
భారత్‌ను సుదీర్ఘ కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్. ఇటీవల కాలంలో ఆ పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తాయి. కానీ ఆ పార్టీ నాయకత్వం కీలక నిర్ణయాలను తీసుకోలేకపోయింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయి. అంతేకాకుండా నేతల్లో తిరుగుబాటు కారణంగా మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది.
కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం బలహీనం కావడం వల్లే ప్రాంతీయ నాయకులు బహిరంగంగా నిరసనలకు దిగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
''కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, కేంద్ర నాయకత్వం బలహీనపడటం. రెండోది, ఓట్లను రాబట్టుకోవడంలో గాంధీ కుటుంబ సామర్థ్యం తగ్గిపోవడం. పది, పదిహేనేళ్ల క్రితం... ఢిల్లీ నుంచి సోనియా గాంధీ ఫోన్ రాగానే, ఎలాంటి వ్యతిరేకతకు తావు లేకుండానే రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రాంతీయ పార్టీల కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబంపైనే తమ బలాన్ని ప్రదర్శించి ఢిల్లీలో అధికారం చలాయిస్తున్నారు'' అని ప్రదీప్ సింగ్ వివరించారు.
''కేంద్రం బలహీనపడినప్పుడు స్థానిక ప్రభుత్వాలు తిరుగుబాటు చేస్తాయనడానికి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో కేంద్ర నాయకత్వం, హై కమాండ్ బలహీనమయ్యాయి. అందుకే ప్రాంతీయంగా బలమైన నాయకులు వారి నిరసనను గట్టిగా వినిపిస్తున్నారు'' అని ప్రదీప్ వ్యాఖ్యానించారు
No comments:
Post a Comment