హైదరాబాద్ : 05/09/2021
*తెలంగాణలో డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలు భారీగా పెంపు.....!*
*అన్ని రకాల డాక్యుమెంట్ల ఫీజులు, యూజర్ చార్జీలు భారీగా పెంపు*
*సొసైటీల రిజిస్ట్రేషన్, ఇతర చార్జీలు కూడా.. 2వ తేదీ నుంచే అమల్లోకి..*
*అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేసిన* *స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్*
హైదరాబాద్: భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీని ఇటీవలే పెం చిన రాష్ట్ర ప్రభుత్వం..
ప్రజలపై దొడ్డిదారిన మరో భారాన్ని మోపింది. క్రయవిక్రయ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలను అడ్డగోలుగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న ఫీజులు, చార్జీలను రెండింతల నుంచి పదింతలు చేసింది. ఈ నెల రెండో తేదీ నుంచే పెంపును అమల్లోకి తెస్తూ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఇటీవల అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు.
*సొసైటీ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా..*
సాధారణ క్రయ, విక్రయ లావాదేవీలతోపాటు సొసైటీల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా పెంచారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ల చట్టం-2021 కింద సొసైటీలను రిజిస్టర్ చేసుకునేందుకు రూ.2 వేలు ఫీజుగా ఖరారు చేశారు. ఈ సొసైటీల జనరల్‌బాడీ సమావేశాలు, కార్యవర్గ సమావేశాల మినిట్లను ఫైల్ చేసేందుకు.. బైలాస్, ఇతర డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీల కోసం రూ.1,000 చొప్పున ఫీజు నిర్ణయించారు. సొసైటీల తనిఖీతోపాటు డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కస్టడీలో ఉంచేందుకు ఏడాదికి రూ.500 ఫీజు నిర్ణయించారు. అదే విధంగా చిట్‌ఫండ్ చట్టం-1982 మేరకు రూ.5 లక్షల వరకు చిట్టీలను రిజిస్టర్ చేసేందుకు రూ.3,500.. 5లక్షల కన్నా ఎక్కువ విలువైన చిట్టీల రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేలు, ఆర్బిట్రేషన్ ఫీజు కింద రూ.2,000 వసూలు చేయనున్నారు.
*ఖజానాకు రూ.500 కోట్లు*
డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీల పెంపుతో ప్రభుత్వానికి గణనీయంగానే అదనపు ఆదాయం సమకూరుతుందని స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రతి నెలా కనీసం లక్ష వరకు లావాదేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజును రూ.100 నుంచి రూ.500కు పెంచిన నేపథ్యంలో.. అదనంగా నెలకు రూ.4 కోట్ల వరకు రానున్నాయి. అంటే కేవలం డాక్యుమెంట్ చార్జీల కిందే ఏటా కనీసం రూ.50 కోట్ల అదనపు రాబడి ఉంటుందని.. ఇతర లావాదేవీలు, యూజర్ చార్జీలనూ కలిపితే ఏటా కనీసం రూ.500 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment