*టార్గెట్ తెలంగాణ.... బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం... త్వరలోనే వారికి బాధ్యతలు....?*
తెలంగాణలో కచ్చితంగా అధికారం సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
ఓ వైపు రాష్ట్ర నేతలు అధికార టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళుతుంటే.. తెరవెనుక పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే తెలంగాణలోనిఅన్ని ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమించే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో పేరున్న ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలను ఆ పార్టీ నాయకత్వం తెలంగాణకు పంపినట్టు వార్తలు వచ్చాయి. వారంతా తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు ఇక్కడే పని చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.
తెలంగాణలో అధికారం దక్కించుకోవడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ(BJP) జాతీయ నాయకత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పంపిన నేతల ద్వారా పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను భూపేంద్ర యాదవ్ వంటి కీలక నేతలకు అప్పగించింది బీజేపీ. ఆయన రంగంలోకి దిగి తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేశారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లు సాధించింది. టీఆర్ఎస్‌కు(TRS) పోటీ ఇచ్చే స్థాయిలో సీట్లు దక్కించుకుని గ్రేటర్ హైదరాబాద్‌లో తమ బలాన్ని మరింతగా పెంచుకుంది.
తాజాగా ఇదే తరహా ఫార్ములాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా అమలు చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయగలిగే ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలకు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కసరత్తు కూడా చేసిందని.. త్వరలోనే రాష్ట్ర పార్టీ నేతలకు ఈ మేరకు సమాచారం కూడా అందబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని, నేతల పనితీరును సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వానికి అందించబోతున్నారని.. అందుకు తగ్గట్టుగా తెలంగాణలో పార్టీకి బలోపేతం చేయడంలో కమలనాథులు ఫోకస్ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment