Wednesday, May 18, 2022

హెచ్‌ఎండీఏ పరిధి ఎసైన్డ్‌ భూముల్లో వెంచర్లు యాదాద్రి భువనగిరి జిల్లాలో

హెచ్‌ఎండీఏ పరిధి ఎసైన్డ్‌ భూముల్లో వెంచర్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన కసరత్తు

ఎన్‌వోసీలపై సంతకాలు చేసిన కొందరు రైతులు

మోహర్‌నగర్‌ రెవెన్యూ పరిధిలో ఇంకా రాని స్పష్టత

Courtesy by : eenadu.net Media Twitter

బీబీనగర్‌, భువనగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఎసైన్డ్‌ భూముల సమస్యలు పరిష్కరించి రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ యోగ్యం కాని ఎసైన్డ్‌ భూములను లే అవుట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి దశలో యాదాద్రి భువనగిరి జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

రైతులకు సర్వహక్కులు
జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంలో ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లోని ఎసైన్డ్‌ భూముల్లో వెంచర్లు వేస్తే ప్రభుత్వం, లబ్ధిదారులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాంటి చోట్ల ఎసైన్డ్‌ భూములను లబ్ధిదారుల అంగీకారంతో భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) చేస్తారు. ఆ భూములను ప్లాట్లుగా విభజించి వెంచర్లుగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎసైన్డ్‌దారులకు కొంత స్థలం ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ స్థలంపై రైతుకు సర్వహక్కులు దక్కుతాయని, అందులో ఇల్లు కట్టుకోవచ్చని, లేదంటే అమ్ముకోవచ్చని సర్కారు చెబుతోంది. కొన్నిచోట్ల రైతుల డిమాండ్‌ను బట్టి కొంత ఎక్కువ స్థలాన్ని ఇవ్వాలని భావిస్తోంది.

ఎకరాకు 600 గజాలు
ఎకరా విస్తీర్ణం 4,840 చదరపు అడుగులు ఉంటుంది. ఇందులో 50 శాతం వరకు రోడ్లు, పార్కు ఇతర సౌకర్యాలకు పోతుంది. మిగిలిన 2,420 చదరపు గజాల్లో ఎసైన్డ్‌ హక్కు కోల్పోయిన రైతులకు గరిష్ఠంగా 600 చదరపు గజాలు ఇచ్చినా 1,820 చదరపు గజాలపై ప్రభుత్వానికి హక్కులు సంక్రమిస్తాయి. ఆ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తే ఖజానాకు ఆదాయం వస్తుంది.

1000 గజాలు కావాలి
ఇటీవల ఆయా మండలాల్లో తహసీల్దార్ల ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏకు భూములు ఇవ్వడంపై ఎసైన్డ్‌దారుల అభిప్రాయాలు సేకరించారు. అనంతారంలో 28.16 ఎకరాలు, రహీంఖాన్‌గూడలో 62, ఎస్‌.లింగోటంలోని 30 ఎకరాలకు సంబంధించి రైతులు నిరభ్యంతర పత్రాల(ఎన్‌వోసీ)పై సంతకాలు చేసినట్లు సమాచారం. మోహర్‌నగర్‌ రెవెన్యూ పరిధిలోని భూములపై ఇంకా స్పష్టత రాలేదని విశ్వసనీయ సమాచారం. తాము ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని, కనీసం ఎకరాకు 800-1000 గజాల (హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన) స్థలం ఇవ్వాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

ఎసైన్డ్‌ భూములను గుర్తించాం
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో మాదిరిగానే వ్యవసాయ యోగ్యం కాని ఎసైన్డ్‌ భూములను అభివృద్ధి చేసి లేఅవుట్లుగా మార్చి అందులో కొంత స్థలాన్ని లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. చౌటుప్పల్‌, భువనగిరి, బీబీనగర్‌ మండలాల్లోని హెచ్‌ఎండీఏ పరిధిలో భూములను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వానికి నివేదించాం. మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

-శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి

No comments:

Post a Comment