*బీ అలర్ట్.... తెలంగాణలో మారో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు.....!*
*వడదెబ్బతో అయిదుగురి మృతి*
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బతో సోమవారం అయిదుగురు మృతి చెందారు.ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరగడంతో అధిక వేడి, ఉక్కపోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం అత్యధికంగా భోరజ్(ఆదిలాబాద్ జిల్లా)లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ కేంద్రం ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీచేసింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ గాలుల్లో అస్థిరత కారణంగా 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది.
దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. వర్షాల సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన గుణాజీ అనే ఆరేళ్ల బాలుడు వడదెబ్బతో కన్నుమూశాడు. ఇదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు బాలాజీ(45) ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లి వడదెబ్బతో మరణించారు. బోథ్ మండలంలో భవన నిర్మాణ పనికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి(32), సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన తిగుళ్ల అంజయ్య (48) అనే రైతు, యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ(45) వడదెబ్బతో మృతిచెందారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment