Tuesday, May 10, 2022

రాగల మూడు రోజుల పాటు వర్షాలు

రాగల మూడు రోజుల పాటు వర్షాలు

Courtesy by : తొలివెలుగు మీడియా website

తెలంగాణాలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను “అసని” పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మంగళవారం ఉదయం 8.30 గంటలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో తఫాను కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది.

ఆ తర్వాత ఈ తీవ్ర తుఫాన్ సుమారుగా వాయవ్య  దిశగా పయనించి మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరుకోనున్నట్టు వెల్లడించింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం దిశగా కదిలి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళాఖాతంలోని చేరుకోనున్నట్టు పేర్కొంది. క్రమ క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పింది.

మంగళవారం ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతుందని తెలిపింది.


No comments:

Post a Comment