Saturday, May 21, 2022

800 కోట్ల భూమి కబ్జా!

800 కోట్ల భూమి కబ్జా!

Courtesy by : ABN ఆంధ్రజ్యోతి మీడియా Twitter 
800 కోట్ల భూమి కబ్జా!

  • రెవెన్యూ, పోలీస్‌ అండతో దర్జాగా ఆక్రమణ
  • హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ స్థలంలో దౌర్జన్యం
  • అర్ధరాత్రి పొక్లెయిన్లు, డంపర్లతో చొరబాటు.. 
  • ప్రహరీ కూల్చి, కంచె వేసి భూమి స్వాధీనం
  • షూటింగ్‌లు జరిగే చోట సినీ పక్కీలో పాగా.. 
  • కార్మికుల క్వార్టర్లకు నీళ్లు, విద్యుత్తు కట్‌
  • తక్షణమే ఖాళీ చేయాలని హుకుం.. 
  • హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్‌.. స్పందించని సర్కారు
హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): అది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న భూమి. చుట్టూ ఐటీ కారిడార్‌. పక్కనే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ. ఆ భూమి విలువ ఎకరం యాభై కోట్లపైనే. అరవయ్యేళ్ల క్రితమే కంపెనీ పేరిట అల్యూమినియం ఫ్యాక్టరీ కోసం 45 ఎకరాలు కొన్నారు. కొన్నారు. మరో 53 ఎకరాలు ప్రభుత్వమే స్వయంగా భూసేకరణ చేసి ఇచ్చింది. మొత్తం 98 ఎకరాలకు పక్కాగా యాజమాన్య పత్రాలు ఉన్నాయి. అరవయ్యేళ్ల క్రితమే అందులో ఫ్యాక్టరీ కట్టి, ముందు జాగ్రత్తగా చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అర్థరాత్రి ఫ్యాక్టరీ మీదకు పొక్లెయిన్లు, డంపర్లతో దండెత్తి వచ్చింది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అండ దండలతో ఏకంగా 15 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించింది. దాదాపు రూ.800 కోట్ల విలువైన భూమిని కబ్జా చేస్తుంటే సమస్త యంత్రాంగం సలాం కొట్టింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఉదంతం రాష్ట్రంలో భూముల యాజమాన్య హక్కుల భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఒకనాడు 45 ఎకరాల భూమిని స్వయంగా అమ్మి, కొలిచి అప్పగించిన పెద్దమనిషి ప్రస్తుత వారసులు ఇప్పుడు పథకం ప్రకారం అరవయ్యేళ్ల తర్వాత వచ్చి మా భూమి ఫ్యాక్టరీలో కలిసిందంటూ వివాదం లేవనెత్తారు. రెవెన్యూ యంత్రాంగాన్ని కూడగట్టుకొని ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏకపక్ష సర్వేలు నిర్వహించి వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు.


 హైకోర్టు అడ్డుకొని స్టే ఇవ్వడంతో ఏకంగా కబ్జాకు తెగబడ్డారు. మే 13న అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు బడా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన నాలుగు పొక్లెయిన్లు, పది టిప్పర్లు అల్యూమినియం ఫ్యాక్టరీలోకి దూసుకొచ్చాయి. పక్కనున్న భూమికి సంబంధించి పవర్‌ ఆఫ్‌ అటార్నీ కాగితాన్ని అడ్డం పెట్టుకొని, ఫ్యాక్టరీ గోడలు బద్దలు కొట్టి, లోపలిదాకా వచ్చారు. ప్రహరీ గోడ ఆనవాలు లేకుండా చేయడం కోసం నిర్మాణ వ్యర్థాలు మొత్తం తరలించేశారు. 15 ఎకరాల మేర కంచె వేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీకి అనుబంధంగా యాభై ఏళ్ల క్రితం నిర్మించిన కార్మికుల క్వార్టర్లను కూడా కంచె లోపల కలిపేసుకొని వాళ్లను వెళ్లిపోవాలని వత్తిడి చేస్తున్నారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పెద్దల అండ ఉన్న అండతోనే హైకోర్టు ఉత్తర్వును కూడా లెక్క చేయకుండా బడా రియల్టర్‌ ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. ఇందులో కబ్జాదారులకు రెవెన్యూ యంత్రాంగం, పోలీసుల సహకారం అందించిన తీరు రాజధాని నగరంలో ప్రైవేటు ఆస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఇలాగే కొనసాగితే దశాబ్దాల క్రితం మీరు కొన్న భూములను ఇట్టే వివాదాస్పదం చేయొచ్చు. చక్రం తిప్పే నేతల ద్వారా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలిగితే మీ భూమికి రెక్కలు వచ్చినట్లే.

800 కోట్ల భూమి కబ్జా!

ఎక్కడ ఈ భూమి?

తెలుగు సినిమాలో క్లైమాక్స్‌ ఫైటింగ్‌ సీన్‌ షూటింగ్‌ అంటే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్లాల్సిందే. దూకుడు మొదలు ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలన్నీ అక్కడ షూట్‌ చేసుకున్నవే. ఐటీ కారిడార్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పక్కన వందెకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. అర్థ శతాబ్దం కిందటే అందులో కార్మికుల కోసం క్వార్టర్లు నిర్మించి, వసతి ఏర్పాటు చేశారు. పాతికేళ్లుగా సినిమా కంపెనీ ఈ భూమిని లీజుకు తీసుకొని సినిమా షూటింగులు నిర్వహిస్తోంది. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం భారీ సెట్టింగులు వేశారు. తాజాగా తమిళ హీరో అజిత్‌ కొత్త సినిమా కోసం సెట్లు వేస్తున్నారు. ఇంతలో ఈ భూమి తమదంటూ కేఎన్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కంచె వేసింది. దాంతో క్వార్టర్లు, సగం సినిమా సెట్టింగులు ఆ కంచె లోపలికి వెళ్లిపోయాయి. ఇక్కడ న్యాయస్థానం ఆదేశాలు అమలు కావడం లేదు.. దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదులు బుట్ట దాఖలవుతున్నాయి.


ఎప్పుడు కొన్నారు? 

సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు దశాబ్ద కాలం ముందే అల్యూమినియం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మార్చి 6, 1961లో 45 ఎకరాల భూమిని ఇక్కడ కొన్నారు. ది కమర్షియల్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ ఫెనాన్స్‌ లిమిటెడ్‌(సీఐఎ్‌ఫఎల్‌) అనే సంస్థ వద్ద ఈ భూమిని కొనుగోలు చేశారు. సంస్థ ఎండీ కిషన్‌చంద్‌ ఈ భూమిని స్వయంగా రిజిస్టర్‌ చేశారు. 1967లో ఫ్యాక్టరీ విస్తరణ కోసం భూమి సేకరించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఎల్‌.వెంకట్రాంరెడ్డి అనే వ్యక్తి నుంచి 43.13 ఎకరాలు, సీఐఎ్‌ఫఎల్‌ నుంచి మరో పది ఎకరాలు మొత్తం 53.14 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. ఇందుకు నిర్ణీత ధరను కూడా ప్రభుత్వానికి చెల్లించారు. దాంతో శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని 90, 91, 92, 93, 94, 95, 96, 99/1, 99/2, 100/1, 100/2, 101/1, 101/2, 101/3 సర్వే నెంబర్లలో అల్యూమినియం ఫ్యాక్టరీకి 98.14 ఎకరాల భూమి సమకూరింది. వెంటనే చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కార్మికుల కోసం 1970లో క్వార్టర్లు నిర్మించారు. మధ్యలో కొన్నాళ్లు పరిశ్రమ మూత పడింది. కొన్నేళ్ల క్రితం పున:ప్రారంభమైంది. సంస్థ ప్రాంగణం ఖాళీ స్థలాన్ని సినిమా షూటింగ్‌ల కోసం రెండున్నర దశబ్దాలుగా అద్దెకిస్తున్నారు. తాజాగా కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఫ్యాక్టరీ లోపలి భూభాగానికి కిషన్‌చంద్‌ వారసుల నుంచి పవరాఫ్‌ అటార్నీ ఉందనే పేరుతో తెర మీదకు వచ్చింది. ఫ్యాక్టరీ ప్రాంగణం లోపల 15 ఎకరాలకు పైగా భూమి తమది ఉందని వాదిస్తోంది. 


సర్వే నివేదిక కోర్టు పరిశీలనలో ఉండగానే ప్రహరీ కూల్చివేయడాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. దౌర్జన్యంగా ఫెన్సింగ్‌ ఎందుకు వేస్తున్నారని అడిగితే చేయి చేసుకున్నారని సెక్యురిటీ గార్డులు చెబుతున్నారు. మూడు క్వార్టర్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపేశారు. ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని క్వార్టర్లలో ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కిషన్‌చంద్‌ కుటుంబానికి చెందిన కొందరు తమ పూర్వీకుడు విక్రయించినది పోగా మిగిలింది ఫ్యాక్టరీ పరిధిలో ఉందంటూ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు జనరల్‌, స్పెషల్‌ పవరాఫ్‌ అటార్నీ ఇచ్చారు. దాని ప్రకారమే కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిధిలోని కొంత స్థలం తమదని వాదిస్తోంది. మండల సర్వేయర్‌ నివేదికలోనూ ఈ విషయం ఉందని అంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా సర్వే నివేదిక తయారు చేశారంటోంది. సర్వే కోసం ఫ్యాక్టరీ ప్రాంగణంలోకే రాలేదని గుర్తు చేసింది. అక్టోబర్‌ 25, 2021 తేదీతో సర్వే నోటీసును 30న తమకు ఇచ్చారని, నవంబర్‌ 1వ తేదీన సర్వే చేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆంధ్రజ్యోతికి తెలిపింది. దీపావళి పండుగ నేపథ్యంలో మరోసారి సర్వే చేయాలని సూచించినట్టు వెల్లడించింది. తమ ప్రమేయం లేకుండా నవంబర్‌ 8న సర్వే చేసి, నివేదిక ఇవ్వడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. సర్వే చేస్తున్న విషయం తమకు చెప్పలేదని, నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. దాంతో డిసెంబర్‌ 13న హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.


కింది కోర్టులో మరో పిటిషన్‌

డిసెంబరు 17వ తేదీన కిషన్‌చంద్‌ కుటుంబానికి చెందిన సురుచిచంద్‌, సలోని జవేరి, శివాని చంద్‌లు భూమి వాస్తవ యజమానులం తామేనని, బాంబే హైకోర్టు ఏప్రిల్‌, 2, 1994 నాడు ఇచ్చిన ఆర్బిట్రల్‌ అవార్డుతో భూమి తమదైందని ప్రస్తావిస్తూ తమ హక్కులకు భంగం కలగకుండా చూడాలంటూ కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. భూమికి సంబంధించి స్పెషల్‌ పవరాఫ్‌ ఆటార్ని ఇచ్చామని, అప్పటి నుంచి భూమి కబ్జాలో ఉన్నామని తెలిపారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులను(ఇంటెరిం ఇంజక్షన్‌) జారీ చేసింది. దాంతో మరోసారి ఫ్య్యాక్టరీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌ 13న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జూన్‌ 17 వరకు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, వాటిని ధిక్కరిస్తూ అర్ధ, అంగ బలంతో కేఎన్‌ఆర్‌ సంస్థ దౌర్జన్యకాండ కొనసాగించింది. రెవెన్యూ, పోలీస్‌ అధికారులు వారికి సహకరిస్తున్నారు.

అర్ధరాత్రి.. అరాచకం

మే 13వ తేదీన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో (తెల్లవారితే 14) ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి ఫ్యాక్టరీ ప్రహరీ గోడను కూల్చేశారు. ఉదయం 6 గంటలకు ఫ్యాక్టరీ ప్రతినిధులు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 10 గంటలకు రావాలంటూ తిప్పి పంపారు. 10 గంటలకు వెళితే ఉదయం ఇచ్చిన ఫిర్యాదు కనిపించడం లేదన్నారు. రెండు రోజుల అనంతరం కేఎన్‌ఆర్‌ సిబ్బంది కొందరు ఫెన్సింగ్‌ వేశారు. ఫ్యాకరీ ప్రతినిధులు సమాచారమందించినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఫెన్సింగ్‌ వేయవద్దని అడ్డుకున్న కార్మికులనే స్టేషన్‌కు తరలించారు. నిర్మాణ సంస్థ సిబ్బంది జోలికి పోలీసులు వెళ్లక పోవడం అనుమానాలకు తావిస్తోంది. సెట్టింగులు, క్వార్టర్లను ఆక్రమించి కంచె వేయడమే కాకుండా రక్షణ కోసం గార్డులను ఏర్పాటు చేశారు. రహదారులకు అడ్డుగా రాళ్ల కుప్పలు పోశారు. క్వారర్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపివేశారు. టిప్పర్ల రాకపోకలతో పైపులైన్లు పగిలి ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరింది. ప్రహరీ గోడ కూల్చి, కంచె వేసినప్పుడు ప్రేక్షకపాత్ర వహించిన పోలీస్‌ యంత్రాంగం భూమి కబ్జాలోకి వెళ్లిపోయాక పికెట్‌ ఏర్పాటుచేసి కాపలా కాస్తుండడం గమనార్హం. అధికార పార్టీ అండదండలే దీనికి కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. భూమి వాళ్లదైతే దొంగ రాత్రి గోడలు కూల్చివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అందరి సమక్షంలో సర్వే చేసి, నిజంగా వారికి భూమి ఉన్నట్టు తేలితే కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలే తప్ప దౌర్జన్యం చేయడం సబబు కాదని కార్మికులు పేర్కొంటున్నారు.


ఖాళీ చేసి పొమ్మంటుర్రు

మాది వరంగల్‌ జిల్లా.. 15 యేళ్లుగా మా ఆయన కంపెనీలో పని చేస్తున్నారు. ఇక్కడే క్వార్టర్‌లో ఉంటాం. మేముండే ప్రాంతమంతా తమదంటూ కొందరూ అర్ధరాత్రి గోడలు కూల్చి వచ్చారు. ఆ తర్వాత పెన్సింగ్‌ వేశారు. రాత్రిళ్లు వచ్చి ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెబుతున్నారు. లేకుంటే పోలీసులతో వచ్చి రాత్రికి రాత్రే ఇళ్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికిపోతాం.

-ఓ కార్మికుడి భార్య వరలక్ష్మి


నీళ్లు, కరెంట్‌ బంద్‌

మా ఆయన ఇదే కంపెనీలో పని చేసేవారు. ఆయన పోయాక కంపెనీలోనే 30 యేళ్లుగా అటెండర్‌గా పని చేస్తున్నాను. క్వార్టర్‌లో ఉంటున్నా. వారం రోజులుగా మమ్మల్ని వెళ్లిపోమంటున్నారు. నీళ్లు, కరెంటు బంద్‌ చేశారు. ఎండాకాలం బయటకు రాకుండా పెన్సింగ్‌ వేశారు. డ్యూటీకి కూడా పోలేకపోతున్నాం. మంచి నీళ్లు, సరుకులు తెచ్చుకోవడమూ ఇబ్బందే. ఫెన్సింగ్‌ కింద నుంచి తిరగడం వృద్ధులకు ఇబ్బందిగా ఉంటోంది. 

- అటెండర్‌ సీ.లక్ష్మి


రోడ్డుపై రాళ్లు పోశారు

మా అబ్బాయి కంపెనీలో పని చేస్తారు. చాలా ఏళ్లుగా ఇక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నాం. గోడ కూల్చేశారు. కంపెనీలోకి వెళ్లకుండా, రాకుండా రోడ్డుపై రాళ్లు పోశారు. అడ్డుగా పెన్సింగ్‌ పాతారు. ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తొలగించిన కరెంటు పునరుద్దరిస్తే మళ్ళి తీసేస్తున్నారు. పైపులైన్లు పగులగొట్టడంతో ఇళ్లు మొత్తం బురదగా మారింది.

- సూపర్‌వైజర్‌ తల్లి సపూర్‌ ఉన్నీసా


రెండు సార్లు సర్వే చేశాం

కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేశాం. పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాం. ఇరు వర్గాలు తమ భూమి ఉందని చెబుతున్నాయి. సర్వే ఆధారంగా న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. రెండు పర్యాయాలు సర్వే చేశాం. 

- రెవెన్యూ వర్గాలు



No comments:

Post a Comment