Wednesday, August 28, 2024

*హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన*

*హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన*

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని, పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదు’’ అని హెచ్చరించారు.

హైడ్రా హైదరాబాద్‌కు మాత్రమే ఇప్పటివరకు పరిమితం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, చెరువులు నాళాలపై కూల్చివేతలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. నిబంధనలు పాటించని భవనాలను కూల్చివేస్తాం. తొలి కూల్చవేత మొదలుపెట్టిందే కాంగ్రెస్ నేత పల్లం రాజు నుంచి. కేటీఆర్ ఫామ్ హౌస్‌కి అనుమతి సర్పంచి నుంచి తీసుకున్నాం అని అంటున్నారు. సర్పంచ్ ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వరు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు జరుగుతున్నాయి. గత పదేళ్లలో చెరువులను, నాలాలను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.

*సుప్రీంకోర్ట్, ఎన్జీటీ మార్గదర్శకాలు పాటిస్తున్నాం: రేవంత్ రెడ్డి*

అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తేల్చుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నా కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలు తీసుకుని రావాలి. నేను కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని ఆధారాలతో అక్కడికి వెళ్లాను. కేటీఆర్‌కి దమ్ముంటే నా కుటుంబ సభ్యులు లేదా నావి అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలి. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాలను పాటిస్తున్నాం. చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. సెక్రటేరియెట్, జీహెచ్ఎంసీ లాంటి భవనాలకు సుప్రీంకోర్టు అనుమతి ఉంది. రాయదుర్గంలో కూల్చివేత సరైనదే. ఆ భూమి ప్రభుత్వ భూమి’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

*కేటీఆర్ కొడంగల్‌కు వెళ్తానంటే స్వాగతిస్తా...*

మాజీ మంత్రి కేటీఆర్ కొడంగల్‌కు వెళ్తానంటే స్వాగతిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ కేటీఆర్ కొడంగల్‌కు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడాలి. కేటీఆర్‌ను వాళ్ల తండ్రి కేసీఆర్ నమ్మడు. కర్ణాటకలో వాల్మీకి స్కామ్‌తో మాకు సంబంధం లేదు. తెలంగాణ ఖాతాలు ఉన్నంత మాత్రాన మాకు సంబంధం ఉంటుందా?. వాల్మీకి స్కామ్‌లో బీఆర్ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చు. డ్రగ్స్ కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతలు బెంగుళూరు వెళ్లడం అందరికీ తెలిసిందే’’ అని సీఎం అన్నారు.

Courtesy / Source by :
*V.S. జీవన్*

No comments:

Post a Comment