*బతుకమ్మ కానుకపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం*
*చీరల పంపిణీ బంద్.. వాటి స్థానంలో..!*
*బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ నిలిపేయనున్న రేవంత్ సర్కార్*
*బతుకమ్మ చీరల స్థానంలో ఎదైనా బహుమతి ఇవ్వాలని యోచన*
*నగదు రూపంలో ఇవ్వాలా, గిఫ్ట్ రూపంలో ఇవ్వాలా అని సమాలోచనలు*
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులకు పెద్ద సంబురం కావటంతో.. వారికి ప్రభుత్వం తరపున కానుకలు ఇచ్చి వారి సంతోషంలో భాగం కావాలని యోచిస్తోంది. గతంలో బీఆర్ఎస ప్రభుత్వ హయాంలోనూ.. ఆడపడుచులకు బతుకమ్మ కానుక కింద.. చీరలు అందించారు. అయితే.. ఈ బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని.. చీరల్లో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరన్న వాదనలు పెద్ద ఎత్తున రావటంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
బతుకమ్మ పండుగకు ఈసారి నుంచి చీరలను పంపిణీ చేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే చీలరకు బదులుగా ఏం ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా బహుమతి ఇద్దామా.. ఒకవేళ ఇస్తే ఏ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగదు రూపంలో ఇవ్వాలా.. లేదా వస్తు రూపంలో ఇవ్వాలా అన్నదానిపై కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. మరోవైపు.. ఈ బతుకమ్మ బహుమతి ఎవరెవరికి ఇవ్వాలి.. అందుకు ఎలాంటి అర్హతలు ఉండాలన్న విషయంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కోసం.. ఏటా సుమారు 370 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. అటు ఆడపడుచులకు బతుకమ్మ కానుక ఇవ్వటంతో పాటు మరోవైపు నేతన్నలకు ఉపాధి కల్పించినట్టవుతోందని ఈ చీరలు పంపిణీ చేసింది గత సర్కార్. అయితే.. ఈ బతుకమ్మ చీరల కోసం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నాణ్యతలేని చీరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళామణులు.. వాటిని రోడ్డుపైనే దహనం చేసిన ఘటనలూ ఉన్నాయి.
అయితే.. ఈ చీరలు ఇవ్వటం కంటే.. అందుకు ఖర్చు చేసిన నగదు చేతికి ఇస్తే పండుగ ఖర్చులకు ఆసరాగా ఉంటాయన్న వాదన కూడా ప్రజల్లో నుంచి వచ్చింది. మరోవైపు.. కొన్ని పండుగలకు ఇచ్చినట్టుగా ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని మహిళలు కోరారు. ఏపీలో సంక్రాంతి పండుగకు.. ఉచితంగా చక్కెర, నూనె, బెల్లం, నెయ్యి, శనిగలు, కందిపప్పు పంపిణీ చేశారు. ఏపీలోలాగే.. ఇక్కడ కూడా పండుగకు అవసరమయ్యే వస్తువులను అందిస్తే ఎలా ఉంటుందన్న యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. మరోవైపు.. ఇలాంటి కార్యక్రమాల్లో అవినీతి కూడా జరిగే అవకాశం ఉండటంతో.. నేరుగా ప్రజల అకౌంట్లలోనే పండుగ కానుకగా ఎంతో కొంత మొత్తం జమ చేస్తే సరిపోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.
Courtesy / Source by :
*V.S. జీవన్*
No comments:
Post a Comment